Begin typing your search above and press return to search.

ఇండిగో ఇష్యూ: పాత -కొత్త నిబంధనల మధ్య తేడా ఏంటి?

దేశంలోని మిగిలిన విమానయాన సంస్థలతో పోలిస్తే ఇండిగో తన విమాన సర్వీసుల్ని నడిపే విషయంలో కచ్ఛితత్త్వంతో ఉంటుందన్న పేరుంది.

By:  Garuda Media   |   4 Dec 2025 1:00 PM IST
ఇండిగో ఇష్యూ: పాత -కొత్త నిబంధనల మధ్య తేడా ఏంటి?
X

ఇప్పటివరకు ఎప్పుడూ లేని విధంగా రెండు రోజుల నుంచి దేశంలోనే అది పెద్ద విమానయాన సంస్థ అయిన ఇండిగో సంస్థ తీవ్ర ఇబ్బందుల్ని ఎదుర్కొంటున్న పరిస్థితి. మంగళవారంతో పోలిస్తే.. బుధవారం ఈ సమస్య పెరగటమే కాదు.. పెద్ద ఎత్తున విమానాలు క్యాన్సిల్ అయిన దుస్థితి. అత్యవసర పనుల మీద వెళ్లే వేలాది మంది విమాన సర్వీసులు క్యాన్సిల్ కావటం.. గంటల కొద్దీ ఆలస్యంగా నడవటం కారణంగా తీవ్ర అసౌకర్యానికి గురైన పరిస్థితి.

దేశంలోని మిగిలిన విమానయాన సంస్థలతో పోలిస్తే ఇండిగో తన విమాన సర్వీసుల్ని నడిపే విషయంలో కచ్ఛితత్త్వంతో ఉంటుందన్న పేరుంది. అలాంటి ఇండిగో ఒక్కసారిగా పెద్ద ఎత్తున సర్వీసులు క్యాన్సిల్ చేయటం.. గంటల కొద్దీ ఆలస్యంగా నడటంతో ప్రయాణికులు తీవ్ర అసౌకర్యానికి గురయ్యారు. దీనికి సాంకేతిక కారణాల్ని చూపిస్తున్నా.. అసలు విషయం వేరే ఉందని చెబుతున్నారు. దేశవ్యాప్తంగా 2200 విమానాల్ని నడిపించే ఇండిగో.. ఒక్క మంగళవారం 200 విమానాలు రద్దు చేయగా.. 1400 విమానాలు ఆలస్యంగా నడిచాయి. ఈ పరిస్థితికి అసలు కారణమేంటి? అన్న విషయంలోకి వెళితే.. ఫ్లైట్ డ్యూటీ టైమ్ లిమిటేషన్ కు సంబంధించిన రూల్ లో సవరణ చేయటమే కారణమని చెబుతున్నారు,

ఇప్పటివరకు ఉన్న పాత నిబంధనకు కొత్త రూల్ ను తీసుకొచ్చిన నేపథ్యంలో పైలట్లు.. ఇతర సిబ్బందికి మరింత ఎక్కువ రెస్టు ఇవ్వాల్సి వస్తోంది. ఫలితంగా పైలట్ల కొరత ఏర్పడింది. దీంతో అనివార్యంగా విమానాల్ని రద్దు చేయాల్సి వచ్చినట్లు చెబుతుంది. అయితే.. ఇక్కడ వచ్చే ఒక సందేహం ఏమంటే.. కొత్త నిబంధనల్ని అమలు చేయాలని నిర్ణయించిన వేళలో.. ఇలాంటి పరిస్థితి ఉత్పన్నమవుతుందన్న విషయాన్ని గుర్తించి.. అందుకు తగ్గట్లే సిద్ధం కాకపోవటం ఇండిగో ఫెయిల్యూర్ కాదా? అన్నది ప్రశ్న.

కొత్త నిబంధనతో పాటు.. సాంకేతికత లోపాలు సైతం చెక్ ఇన్ వ్యవస్థలు సరిగా పని చేయకపోవటానికి కారణంగా చెబుతున్నారు. దీంతో ఇండిగో కౌంటర్ల ముందు ప్రయాణికులు బారులు తీరిన పరిస్థితి. కొత్త నిబంధనల్లో కీలకాంశాలు.. ఇండిగో రవాణా వ్యవస్థను తీవ్రంగా ప్రభావితం చేసిన అంశాల్ని చూస్తే..

- రాత్రి వేళ డ్యూటీ గంటలు తగ్గించారు. రాత్రి 12 నుంచి ఉదయం 6 గంటల వరకు

- వరుసగా ఎక్కువ గంటలు పని చేయకుండా.. మధ్యలో ఎక్కువ విరామం తప్పనిసరి.

- కేబిన్ సిబ్బందికి ల్యాండింగ్స్ పరిమితం చేయటం.

- పదకొండు గంటల డ్యూటీలో గరిష్ఠంగా ఆరు ల్యాండింగ్స్ ఉండాలి.

- 11.30 గంటల డ్యూటీలో గరిష్ఠంగా 5 ల్యాండింగ్స్ ఉండాలి.

- పద్నాలుగు గంటల డ్యూటీలో 9 గొటల ఫ్లైయింగ్.. కేవలం రెండు ల్యాండింగ్స్ మాత్రమే అనుమతి.

- ప్రతి ఏటా పైలట్లు.. సిబ్బందికి ఫాటిగ్మేనేజ్ మెంట్ ట్రైనింగ్ తప్పనిసరి.

ఇంతకాలం అమలు చేసిన పాత రూల్స్ కు.. కొత్త నిబంధనలకు మధ్య తేడాను చూస్తే.. విశ్రాంతి సమయంలో గతంలో తక్కువగా ఉంటే ఇప్పుడు ఎక్కవైంది. దీంతో సిబ్బంది అందుబాటు తగ్గింది. రాత్రి డ్యూటీ గతంలో ఎక్కువగా ఉంటే.. ఇప్పుడు తగ్గింది. దీంతో రాత్రి విమానాలు తగ్గాయి. ల్యాండింగ్స్ పరిమితి గతంలో ఎక్కువగా ఉంటే.. ఇప్పుడు తగ్గించారు. దీంతో షెడ్యూల్ కుదించాల్సిన పరిస్థితి. గతంలో పని చేసే సిబ్బందికి ట్రైనింగ్ ఎయిర్ లైన్స్ సంస్థ ఇష్టం మీద ఉండేది. ఇప్పుడు అందుకు భిన్నంగా తప్పనిసరి చేశారు. దీంతో అదనపు సమయం శిక్షణ కోసం వినియోగించాలి. దీంతో.. అదనపు సిబ్బంది అవరమవుతారు.

కొత్తగా తీసుకొచ్చిన నిబంధనలు నవంబరు ఒకటి నుంచి అమల్లోకి వచ్చినా.. కొత్త నిబంధనలకు అనుగుణంగా ఇండిగో సిద్ధం కాలేదని.. అదే కొంపముంచినట్లుగా చెబుతున్నారు. ఇదే విషయాన్ని స్పష్టం చేస్తూ ఎయిర్ లైన్స్ పైలట్స్ అసోసియేషన్ ఆఫ్ ఇండియా విడుదల చేసిన ప్రకటనలో స్పష్టం చేసింది. మానవవనరుల నిర్వహణలో ఇండిగో ఫెయిల్ అయ్యింది. అందుకే విమానాల్ని రద్దు చేయాల్సి వచ్చిందన్న మాట బలంగా వినిపిస్తోంది.