ఇండిగోకు వాచిపోయింది.. 6 రోజుల్లో రూ.37వేల కోట్లు ఆవిరి
అందుకే అంటారు ఆశ మంచిదే కానీ అత్యాశ ఏమాత్రం మంచిది కాదని. తాజాగా ఇండిగో ఉదంతంతో ఈ మాటలో నిజమెంతన్నది అందరికి అర్థమయ్యేలా చేసింది.
By: Garuda Media | 9 Dec 2025 11:04 AM ISTఅందుకే అంటారు ఆశ మంచిదే కానీ అత్యాశ ఏమాత్రం మంచిది కాదని. తాజాగా ఇండిగో ఉదంతంతో ఈ మాటలో నిజమెంతన్నది అందరికి అర్థమయ్యేలా చేసింది. కాసుల కక్కుర్తి.. ప్రభుత్వ ఆదేశాల్ని అమలు చేసే విషయంలో ప్రదర్శించిన అహంభావం.. తానేం చేసినా వ్యవస్థలు ఊరుకుంటాయన్న దుర్మార్గపు ఆలోచనలు వెరసి.. ఇండిగోకు దెబ్బ మీద దెబ్బ అన్నట్లుగా పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి. అప్పుడెప్పుడో 22 నెలల క్రితం రక్షణ చర్యల్లో భాగంగా కేంద్రం కొత్త నిబంధనల్ని తీసుకొచ్చి.. వాటిని అమలు చేయటానికి తగినంత గడువు ఇచ్చినప్పటికీ.. అవేమీ పట్టించుకోని ఇండిగో.. చివరకు చేతులెత్తేసి సర్వీసుల రద్దుకు తెగబడింది.
తన తోటి విమానయాన సంస్థలు ప్రభుత్వ ఆదేశాలకు అనుగుణంగా నిర్ణయాలు తీసుకోవటమే కాదు అమలు చేస్తున్న వేళ.. అదనపు సిబ్బందిని సమకూర్చుకోకుండా నాటకాలు ఆడి.. చివరకు చేతులెత్తేసిన వైనం తెలిసిందే. దీంతో వేలాది ప్రయాణికులు తీవ్ర అవస్థలకు గురి కావటమే కాదు.. భారతదేశ ప్రతిష్ట దిగజారటం.. కేంద్ర ప్రభుత్వ పని తీరుపై సందేహాలు వ్యక్తమయ్యేలా చేసిన ఇండిగో తీరుపై తీవ్ర ఆగ్రహావేశాలు వ్యక్తం కావటం తెలిసిందే.
ఇదిలా ఉండగా.. తాను చేసిన తప్పులకు ఆ సంస్థ భారీ మూల్యాన్నిచెల్లించుకోవాల్సిన పరిస్థితి కనిపిస్తోంది. ఇప్పటికే రూ.610 కోట్లకు పైనే టికెట్ల రిఫండ్ కింద జారీ చేసినట్లుగా ఇండిగో ప్రకటించింది. కొత్త పైలట్లు.. సిబ్బందిని నియమించుకునే విషయంలో ప్రదర్శించిన తీవ్ర నిర్లక్ష్యానికి ప్రతిగా రానున్న రోజుల్లో డీజీసీఏ భారీ ఫైన్ విధించేందుకు సిద్ధమవుతోంది. ఇప్పటివరకు 5వేలకు పైగా ఇండిగో సర్వీసులు రద్దు కావటం.. పరిస్థితిని చక్కదిద్దేందుకు కేంద్ర విమానయాన సంస్థ కొంతమేర నిబంధనల్ని సడలించినా.. రానున్న రోజుల్లో మాత్రం ఇండిగోకు దెబ్బ మీద దెబ్బ పడటం ఖాయమన్న అభిప్రాయం భారీగా వినిపిస్తోంది.
ఈ వాదనకు బలం చేకూరేలా డీజీసీఏ ఆదేశాలు రానున్న రోజుల్లో ఉంటాయని చెబుతన్నారు. ఫిబ్రవరి వరకు రోజువారీ విమాన సర్వీసుల్ని తగ్గించుకోవాల్సిందిగా ఇండిగోను ఆదేశిస్తారని చెబుతున్నారు. అదే నిజమైతే.. ఆదాయపరంగా ఇండిగోకు భారీ నష్టం వాటిల్లుతుంది. దీనికి తోడు సంస్థ ప్రతిష్ఠ.. పరపతి మీదా నీలినీడలు కమ్ముకుంటాయి. డిమాండ్ కు అనుగుణంగా ఇతర విమానయాన సంస్థల సర్వీసులు పెంచాల్సిందిగా కేంద్రం ఆదేశిస్తుందని చెబుతున్నారు.
ఇవన్నీ ఇండిగోను దెబ్బ తీసే పరిణామాలుగా చెబుతున్నారు. ఇదిలా ఉంటే.. తాజాగా మూడీస్ రేటింగ్స్ అంచనాలో ఇండిగోకు భారీగా దెబ్బ పడింది. ఇటీవల చోటు చేసుకున్న పరిణామాలన్నీ సంస్థ రుణ రేటింగ్ కు ప్రతికూలంగా మారనున్నట్లుగా మూడీస్ అంచనా వేస్తోంది. నూతన నిబంధనల అమలు నుంచి ఇండిగోకు తాత్కాలిక ఉపశమనం కలిగినా.. దీర్ఘకాలంలో మాత్రం ఆ సంస్థకు ఎదురయ్యే సవాళ్లు చాలానే ఉంటాయన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది.
ఇదిలా ఉండగా గడిచిన ఆరు రోజుల్లో ఇండిగో షేరు మార్కెట్ లో 16.4 శాతం క్షీణించింది. ఇండిగో షేరు స్టాక్ మార్కెట్ లో ఇంటర్ గ్లోబ్ ఏవియేషన్ పేరుతో నమోదు కావటం తెలిసిందే. సోమవారం బీఎస్ఈలో ఈ షేరు 8.28 శాతం నష్టపోయింది. ఒకదశలో ఈ షేరు రూ.4842.20 కనిష్ఠ స్థాయికి చేరుకొని అనంతరం రూ.4926.55 వద్ద ముగిసింది. గడిచిన ఆరు ట్రేడింగ్ రోజుల్లో 16.4 శాతం షేరు ధర క్షీణించింది. దీంతో.. దీని మార్కెట్ విలువ రూ.37 వేల కోట్ల మేర ఆవిరైంది. ఇలా ఒకటి తర్వాత ఒకటి చొప్పున తగులుతున్న దెబ్బల నుంచి ఇండిగో తన పూర్వ వైభవాన్ని సంతరించుకోవటానికి చాలానే సమయం పడుతుందన్న వాదన వినిపిస్తోంది. మరేం జరుగుతుందో కాలం మరింత బాగా చెప్పటంతో పాటు.. పలు కార్పొరేట్ కంపెనీలకు ఇండిగో ఉదంతం ఒక చక్కటి ఉదాహరణగా మారుతుందని మాత్రం చెప్పక తప్పదు.
