Begin typing your search above and press return to search.

ఇండిగో సంక్షోభం: 30 ఏళ్ల క్రితమే ఊహించారా? గుత్తాధిపత్యం పెను ముప్పు!

దేశమంతా ఇప్పుడు ఒక్కటే చర్చ.. ఏ టీవీ చూసినా ఇదో ఘోష.. ఇండిగో సంస్థను.. కేంద్ర విమానయాన శాఖ మంత్రిని, ఆ శాఖను ఉతికి ఆరేస్తున్నారు.

By:  A.N.Kumar   |   7 Dec 2025 3:51 PM IST
ఇండిగో సంక్షోభం: 30 ఏళ్ల క్రితమే ఊహించారా? గుత్తాధిపత్యం పెను ముప్పు!
X

దేశమంతా ఇప్పుడు ఒక్కటే చర్చ.. ఏ టీవీ చూసినా ఇదో ఘోష.. ఇండిగో సంస్థను.. కేంద్ర విమానయాన శాఖ మంత్రిని, ఆ శాఖను ఉతికి ఆరేస్తున్నారు. ప్రయాణికుల కష్టాలు తీర్చని ఈ మూడింటిపై విరుచుకుపడుతున్నారు. వ్యవస్థను మెయింటేన్ చేయని సంస్థను.. గాలికొదిలేసిన కేంద్రాన్ని తిట్టిపోస్తున్నారు. ఇండిగో విమానయాన సంస్థలో కొనసాగుతున్న సిబ్బంది కొరత సంక్షోభం ఆరో రోజుకు చేరడంతో 30 ఏళ్ల క్రితం నాటి ఓ పాత కామెడీ వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఈ పరిస్థితిని 30 ఏళ్ల క్రితమే గుర్తించారంటూ వీడియోను పోల్చుతూ నెటిజన్లు తీవ్రంగా స్పందిస్తున్నారు.

30 ఏళ్ల క్రితం వీడియోలో ఏముందంటే?

అది 1995.. ‘ఫుల్ టెన్షన్’ అనే టీవీ షోలో ‘ఎస్ఓఎస్ ఎయిర్ లైన్స్’ అనే ఎపిసోడ్ ప్రసారమై పాపులర్ అయ్యింది. ఆ ఎపిసోడ్ ను ఇండిగో ప్రస్తుత పరిస్థితితో పోల్చి నెటిజన్లు ట్రోల్స్ చేస్తున్నారు. ఆ ఎపిసోడ్ లో ఏముందంటే.. సిబ్బందికొరత కారణంగా విమానయాన సంస్థలో ఒక్క వ్యక్తే అన్ని పనులు చేయాల్సి వస్తుంది. లగేజీ తీసుకురావడం.. టికెట్లు ఇవ్వడం.. చివరకు విమానం నడుపడం వరకూ అన్నీ ఓ ఒక్క వ్యక్తి చేతిలోనే ఉంటాయి. ప్రస్తుతం ఇండిగోలో సిబ్బంది కొరత, విమానాల ఆలస్యం రద్దు వంటి సమస్యలు ప్రయాణికులకు తీవ్ర ఇబ్బందులను గురిచేస్తున్నాయి. ఈ నేపథ్యంలోనే పాత కామెడీ సీన్ ఇప్పుడు నిజమైందని చాలా మంది నెటిజన్లు కామెంట్స్ చేస్తున్నారు.

గుత్తాధిపత్యం ఎప్పటికైనా ముప్పే..

ఇండిగో సంక్షోభంకారణంగా ప్రయాణికులు పడుతున్న ఇక్కట్లు.. దేశంలో కొన్ని సంస్థల గుత్తాధిపత్యం ఎంత ప్రమాదకరమో మరోసారి స్పష్టం చేస్తున్నాయి. ప్రస్తుతం విమాన సర్వీసుల మార్కెట్లో ఇండిగో వాటా అగ్రస్థానంలో ఉంది. సుమారు 63 శాతం వాటా ఇండిగోదే.. ఇంత పెద్ద వాటా ఒకే సంస్థకు ఉండడంతో అందులో ఏ చిన్నసమస్య వచ్చినా దాని తీవ్రత అనూహ్యంగా పెరుగుతుంది.

దేశీయ విమాన యాన రంగంలో పోటీ లేకపోవడంతో వినియోగదారులకు ప్రత్యామ్మాయాలు అతి తక్కువగా ఉంటాయి. సంస్థలు తమకు ఇష్టం వచ్చిన ధరలను నిర్ణయించుకునే స్వేచ్ఛను పొందుతాయి. కొత్త సంస్థలు మార్కెట్లోకి ప్రవేశించడం చాలా కష్టమవుతుంది. చిన్న సంస్థలు బడా సంస్థల్లో విలీనం కావడమో లేదా దివాళా తీయడమో జరుగుతుంది. బడా సంస్థల ఉత్పత్తి/సేవల్లో అంతరాయం ఏర్పడితే ఇండిగో సంక్షోభం లాంటి భారీ సమస్యలు ఉత్పన్నమవుతాయి.

గత చరిత్ర చూస్తే.. ఒకప్పుడు అనేక కంపెనీలు టెలికా రంగంలో ఉండేవి. పోటీ ఎక్కువ ఉండి వినియోగదారులకు చాలా ఆఫర్లు వచ్చాయి. ఎయిర్ సెల్, డొకొమొ, టెలినార్, రిలయన్స్ వంటి సంస్థలు వినియోగదారులకు అదిరిపోయే ఆఫర్లు ఇచ్చాయి. కానీ ఇవి విలీనం కావడమో.. లేదా దివాళా తీయడమో జరిగింది. విమానయాన రంగంలోనూ ఇప్పుడు దాదాపు ఇదే పరిస్తితి కొనసాగుతోంది. అందుకే ఒకే సంస్థపై ఎక్కువగా ఆధారపడడం ఎప్పుడూ ప్రమాదకరమే..