ఇండిగో విమానం రద్దు.. ఆన్లైన్లో రిసెప్షన్.. ఇదెక్కడి విడ్డూరం మావా!
ఇండిగో విమానాల రద్దు కారణంగా ఎన్నో చిత్ర విచిత్రాలు జరుగుతున్నాయి. తాజాగా కర్ణాటకలోని హుబ్బళ్లిలో ఒక విచిత్రమైన, ఎవరు ఊహించని సంఘటన జరిగింది.
By: Madhu Reddy | 5 Dec 2025 6:51 PM ISTఇండిగో విమానాల రద్దు కారణంగా ఎన్నో చిత్ర విచిత్రాలు జరుగుతున్నాయి. తాజాగా కర్ణాటకలోని హుబ్బళ్లిలో ఒక విచిత్రమైన, ఎవరు ఊహించని సంఘటన జరిగింది.ఇండిగో విమానాలు రద్దు కావడంతో చాలామంది ప్రయాణికులు ఇబ్బంది పడుతున్నారు. ఈ నేపథ్యంలోనే బెంగళూరులో సాఫ్ట్ వేర్ ఇంజనీర్ గా పనిచేస్తున్న హుబ్బళ్లికి చెందిన మేధా క్షీరసాగర్ , ఒడిశాలోని భువనేశ్వర్ కి చెందిన సంగమ దాస్ ల రిసెప్షన్ హుబ్బళ్లిలోని గుజరాత్ భవన్లో జరగాల్సి ఉంది. అయితే ఈ జంట నవంబర్ 23న భువనేశ్వర్ లో వివాహం చేసుకున్నారు. పెళ్లయిన దాదాపు పది రోజుల తర్వాత బుధవారం రోజు వధువు స్వస్థలంలో అధికారికంగా ఓ రిసెప్షన్ పార్టీని ఏర్పాటు చేశారు.
అయితే దేశవ్యాప్తంగా కొనసాగుతున్న పైలట్ కొరత కారణంగా ఇండిగో సంస్థ చాలా విమానాలు రద్దు చేయడంతో ఈ కార్యక్రమం మలుపు తిరిగింది. డిసెంబర్ 2న భువనేశ్వర్ నుండి బెంగళూరు హుబ్బళ్లికి టికెట్లు బుక్ చేసుకున్న వధూవరులు మంగళవారం ఉదయం 9 గంటల నుండి మరుసటి రోజు తెల్లవారుజాము వరకు పదేపదే విమానాలు ఆలస్యం కావడంతో అక్కడే చిక్కుకుపోయారు. చివరకు డిసెంబర్ 3న విమానాలు రద్దు చేయబడినట్లు సమాచారం అందింది. దాంతో భువనేశ్వర్-ముంబై- హుబ్బళ్లి మీదుగా ప్రయాణించే అనేకమంది బంధువులు కూడా విమాన రద్దు ఇబ్బందిని ఎదుర్కొన్నారు.
పైగా అప్పటికే రిసెప్షన్ ఈవెంట్ ని ఏర్పాటు చేయడంతో కొంతమంది అతిధులు కూడా రిసెప్షన్ కి వెళ్లారు. అన్ని ఏర్పాట్లు పూర్తి చేసుకున్న వధూవరుల తల్లిదండ్రులు ఆచారాలను నిర్వహించడం కోసం తల్లిదండ్రుల స్థానంలో కూర్చున్నారు. కానీ వధూవరులు లేకుండానే రిసెప్షన్ తనతో పూర్తి చేశారు. ఇక విషయంలోకి వెళ్తే.. భువనేశ్వర్ లో జరిగిన ఈ శుభకార్యానికి వధూవరులు ఇద్దరు పూర్తిగా సాంప్రదాయమైన డ్రెస్సులు ధరించి వీడియో కాన్ఫరెన్స్ ద్వారా ఆన్లైన్ రిసెప్షన్లో పాల్గొన్నారు. వివాహం నవంబర్ 23న జరగగా.. రిసెప్షన్ డిసెంబర్ 3న ప్లాన్ చేసుకున్నారు.
కానీ అకస్మాత్తుగా విమానాలు రద్దు చేయడం వల్ల వధూవరులు ఇద్దరు రాలేరు కాబట్టి రిసెప్షన్ పార్టీకి అప్పటికే అన్ని ఏర్పాట్లు పూర్తవడంతో పెళ్లి కొడుకు పెళ్లికూతురు లేకుండానే కార్యక్రమాన్ని నిర్వహించారు. ఇక ఈ విషయం గురించి వధువు తల్లి మాట్లాడుతూ.. "ఇప్పటికే చాలామంది బంధువులను ఆహ్వానించినందుకు మాకు చాలా బాధగా అనిపించింది. చివరి నిమిషంలో ఈవెంట్ రద్దు చేయడం మంచిది కాదు. కాబట్టి కుటుంబమంతా చర్చించుకున్న తర్వాత వధూవరులిద్దరూ ఆన్లైన్లో రిసెప్షన్ కి హాజరు కావాలని తెలిపి వారిద్దరి కోసం ఒక పెద్ద స్క్రీన్ ని ఏర్పాటు చేసి రిసెప్షన్ కి వచ్చిన వారికి ఆ స్క్రీన్ పై వధూవరులిద్దరిని చూపించాలని ఫిక్స్ అయ్యాం" అంటూ చెప్పుకొచ్చింది.
ప్రస్తుతం ఈ విచిత్ర సంఘటనకు సంబంధించిన వీడియో నెట్టింట వైరల్ గా మారడంతో చాలామంది నవ్వుకుంటున్నారు. మరికొంత మందేమో తమ జీవితంలో ఎంతో ముఖ్యమైనటువంటి శుభకార్యాన్ని అందరితో చేసుకోలేకపోయారు బ్యాడ్ లక్ అంటూ కామెంట్లు పెడుతున్నారు. రోజుకు దాదాపు 2,200 విమానాలను నడుపుతున్నామని చెప్పే ఇండిగో 500 కంటే ఎక్కువ విమానాలను రద్దు చేసింది. విమానాల రద్దు కారణంగా ఢిల్లీ,ముంబై,భోపాల్, హైదరాబాద్,జైపూర్, చెన్నై, బెంగళూరు వంటి ప్రధాన నగరాల్లోని విమానాశ్రయాల్లో చాలామంది ప్రయాణికులు చిక్కుకుపోయారు. ఇదే పరిస్థితి వచ్చే ఏడాది ఫిబ్రవరికి కొనసాగుతుందని ఎయిర్ లైన్ సంస్థ తెలిపింది.
