ఇండిగో గోల: 600 కోట్లు తిరిగి ఇచ్చేశారు.. 'వేదన మూల్యం' మాటేంటి?
ఇండిగో విమానాల రద్దు, సర్వీసుల ఆలస్యం నేపథ్యంలో దేశవ్యాప్తంగా వేలాది మంది ప్రయాణికులు నానా తిప్పలు పడిన విషయం తెలిసిందే.
By: Garuda Media | 8 Dec 2025 10:47 AM ISTఇండిగో విమానాల రద్దు, సర్వీసుల ఆలస్యం నేపథ్యంలో దేశవ్యాప్తంగా వేలాది మంది ప్రయాణికులు నానా తిప్పలు పడిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం ప్రత్యేకంగా 37 రైళ్లను అందుబాటులోకి తెచ్చి ఒకింత ఉపశమనం కల్పించిం ది. ఇదేసమయంలో ఇండిగో విమాన టికెట్లు సొంతం చేసుకున్నవారు చెల్లించిన సొమ్మును తిరిగి ఇచ్చే ప్రక్రియ కూడా ప్రారంభమైంది. ఆదివారం రాత్రి 7 గంటల సమయానికి 610 కోట్ల రూపాయలను ప్రయాణికులకు తిరిగి చెల్లించారు. అయితే.. మరో 800 కోట్ల రూపాయల వరకు చెల్లించాల్సి ఉంటుందని ఇండిగో అధికారులు తెలిపారు.
ఇక, కేంద్ర ప్రభుత్వం ఈ సంస్థపై చర్యలకు దిగిన విషయం తెలిసిందే. విషయాన్ని సీరియస్‌గా తీసుకుంటున్నామని.. ఇండిగో ను వదిలేది లేదని పౌరవిమానయాన శాఖ మంత్రి కె. రామ్మోహన్ నాయుడు తెలిపారు. ఈ క్రమంలోనే ఇండిగో సీఈవోను తొలగించే అంశంపై ప్రతిపాదనలు రెడీ చేశారు. మరోవైపు.. డైరెక్టర్ ఆఫ్ సివిల్ ఏవియేషన్ అధికారులు కూడా ఇండిగోను వివరణ కోరారు. ఈ ప్రక్రియలు కొనసాగుతున్న క్రమంలో ప్రయాణికులు చెల్లించిన టికెట్ రుసుమును తిరిగి చెల్లించారు. అయితే.. ఇదే సమయంలో ఢిల్లీకి చెందిన పలువురు ప్రయాణికులు.. తమ ఆవేదన, సమయం వృథా చేయడం.. వంటి అంశాలపై ప్రశ్నలు లేవనెత్తుతున్నారు.
అంతేకాదు.. వీటిపై కంజ్యూమర్ ఫోరమ్‌లో కేసులు వేసేందుకు రెడీ అయ్యారు. ఇదే జరిగితే.. ఇండిగో వ్యవహారం చిక్కుల్లో పడుతుంది. వాస్తవానికి ఇప్పటికే సుప్రీంకోర్టులో కేసులు దాఖలయ్యాయి. అయితే.. ఇవి ఎలా ఉన్నప్పటికీ.. కంజ్యూమర్ ఫోరమ్‌లో కేవలం సొమ్ము విషయంపైనే కేసులు దాఖలయ్యే అవకాశం కనిపిస్తోంది. ఇది జరిగితే.. ఇండిగో సంస్థ.. ప్రయాణికులకు మరిన్ని నిధులు.. జరిమానాలు, ఆలస్య ఫీజులతో పాటు సమయం వృథా చేసినందుకు కూడా సొమ్ము చెల్లించాల్సి ఉంటుంది. ఇక, ఆదివారం నాటికి ఇండిగో సేవలు 65 శాతం వరకు మెరుగు పడ్డాయని సంస్థ తెలిపింది. ప్రస్తుతం 75 శాతం మేరకు విమానాలు నడుపుతున్నట్టు పేర్కొంది. అయినా.. ప్రయాణికులు ఇబ్బందులు పడుతూనే ఉండడం గమనార్హం.
