మొత్తానికి ఇండిగో సీఈవోతో 'దండం' పెట్టించిన రామ్మోహన్ నాయుడు?
ఇటీవల ఇండిగో విమాన సర్వీసుల్లో తలెత్తిన తీవ్ర జాప్యాలు, రద్దుల కారనంగా వేలాది మంది ప్రయాణికులు ఎదుర్కొన్న అసౌకర్యంపై కేంద్రం తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది.
By: A.N.Kumar | 9 Dec 2025 10:22 PM ISTటికెట్లు బుక్ చేసుకున్నాక.. ఎయిర్ పోర్టుకు వచ్చాక విమానాలు రద్దు చేసి వికటట్టాహాసం పొందిన ఇండిగో సీఈవోను ఎట్టకేలకు తన వద్దకు రప్పించుకొని సీరియస్ గా చర్చలు జరిపారు కేంద్ర విమానయాన శాఖ మంత్రి రామ్మోహన్ నాయుడు. దేశవ్యాప్తంగా విమాన ప్రయాణికులను తీవ్ర ఇబ్బందులకు గురిచేసిన ఇండిగో ఎయిర్ లైన్స్ కు కేంద్ర ప్రభుత్వం గట్టి షాక్ ఇచ్చిది. సంస్థ అంతర్గత వైఫల్యాలపై సీరియస్ అయిన కేంద్ర పౌరవిమానయాన శాఖ మంత్రి కే. రామ్మోహన్ నాయుడు కీలక నిర్ణయం తీసుకున్నారు. ఇండిగో విమాన షెడ్యూళ్లలో 10 శాతం కోత విధిస్తున్నట్టు మంగళవారం ప్రకటించారు. ఈ నిర్ణయం ద్వారా ఇండిగో విమాన సేవలను స్థిరీకరించడం.. ప్రయాణికులకు మెరుగైన సౌకర్యాలు కల్పించడం సాధ్యమవుతుందని మంత్రి తెలిపారు.
సీఈవోకు సమన్లు.. సీరియస్ చర్చలు
ఇటీవల ఇండిగో విమాన సర్వీసుల్లో తలెత్తిన తీవ్ర జాప్యాలు, రద్దుల కారనంగా వేలాది మంది ప్రయాణికులు ఎదుర్కొన్న అసౌకర్యంపై కేంద్రం తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. ఈ వ్యవహారంపై వివరణ కోరేందుకు ఇండిగో సీఈవో పీటర్ ఎల్బర్స్ కు పౌరవిమానయాన శాఖ మంగళవారం సమన్లు జారీ చేసింది. ఈ భేటి అనంతరం మంత్రి రామ్మోహన్ నాయుడు మాట్లాడుతూ ఇండిగో అంతర్గత నిర్వహణ లో వైఫల్యం, విమాన షెడ్యూళ్లు, ప్రయాణికులతో కమ్యూనికేషన్ సరిగా లేకపోవడం వల్లే ఈ పరిస్థితి తలెత్తిందని స్పష్టం చేశారు. ఈ వ్యవహారంపై ప్రస్తుతం విచారణ జరుగుతుందని .. తప్పు చేసిన వారిపై చర్యలు తీసుకోవాల్సి ఉంటుందని హెచ్చరించారు.
రీఫండ్ పై మంత్రి ఆదేశాలు
ఇండిగో సంస్థ కార్యకలాపాలను సమీక్షించేందుకు మరోసారి ఉన్నత స్థాయి సమావేశం నిర్వహించినట్లు మంత్రి రామ్మోహన్ నాయుడు తెలిపారు.డిసెంబర్ 6 వరకూ ప్రభావితమైన విమానాలకు టికెట్లు బుక్ చేసుకున్న ప్రయాణికులకు నూరుశాతం రీఫండ్లు పూర్తి చేసినట్లు ఇండిగో సీఈవో ఈ సందర్భంగా మంత్రికి వివరించారు. దీనిపై స్పందించిన మంత్రి.. మిగిలిన మొత్తాలను కూడా త్వరగా వాపస్ చేయాలని ఇండిగో సీఈవోను గట్టిగా ఆదేశించారు.
షెడ్యూళ్ల కోతతో ఇండిగోకు షాక్
ఇండిగో సేవల్లో ఈ పరిస్థితి మళ్లీ తలెత్తకుండా ఉండేందుకు సంస్థ కార్యకలాపాలను క్రమబద్ధీకరించేందుకు అన్ని మార్గాల్లో విమాన సర్వీసులను తగ్గించాలని 10 శాతం కోత విధిస్తూ నిర్ణయానికి వచ్చినట్లు మంత్రి తెలిపారు.అయితే ఈ కోత ఉన్నప్పటికీ మునుపటిలానే అన్ని గమ్యస్థానాలను కవర్ చేయాలని విమానయాన సంస్థను ఆదేశించారు. చార్జీలపై పరిమితి, ప్రయాణికుల సౌకర్యానికి సంబంధించి మంత్రిత్వశాఖ ఇచ్చిన అన్ని ఆదేశాలను తప్పనిసరిగా పాటించాలని ఇండిగో యాజమాన్యాన్ని మంత్రి రామ్మోహన్ నాయుడు కఠినంగా ఆదేశించారు.
మొత్తానికి ప్రయాణికులను ఇబ్బంది పెట్టిన ఇండిగో సంస్థపై కేంద్రం తీసుకున్న చర్యలు, ఆఫీసుకు రప్పించుకొని మరీ సీరియస్ అయ్యి దండం పెట్టించుకున్నట్టు ఫొటో రిలీజ్ చేసిన రామ్మోహన్ నాయుడు తీరు చూస్తే.. ఇండిగో సంస్థపై కేంద్రం తీసుకున్న చర్యలు ఎయిర్ లైన్స్ చరిత్రలో ఒక హెచ్చరికగా నిలుస్తాయనడంలో ఎలాంటి సందేహం లేదు.
