డ్యామేజ్ రికవరీకి ఇండిగో వోచర్ల ఎత్తు.. అదెలానంటే?
కారణం ఏమైనా కానీ ఇండిగో విమానయాన సంస్థ మీద ఉన్న నమ్మకంతో విమాన టికెట్లు బుక్ చేసుకున్న వేలాది మందికి చుక్కలు చూపించిన సంగతి తెలిసిందే.
By: Garuda Media | 12 Dec 2025 9:14 AM ISTకారణం ఏమైనా కానీ ఇండిగో విమానయాన సంస్థ మీద ఉన్న నమ్మకంతో విమాన టికెట్లు బుక్ చేసుకున్న వేలాది మందికి చుక్కలు చూపించిన సంగతి తెలిసిందే. ఇండిగో నిర్వాహణ లోపం.. దాన్ని నమ్మకున్న ప్రయాణికులకు దారుణ అనుభవాలు ఎదురయ్యాయి. వేలాది మంది ఇండిగో ప్రయాణికులు శారీరకంగా..మానసికంగా.. ఆర్థికంగా భారీ నష్టానికి గురైన పరిస్థితి. నిర్వహణ లోపాల కారణంగా విమాన సర్వీసులు రద్దు కావటంతో తీవ్ర ఇబ్బందులకు గురైన సంగతి తెలిసిందే.
దీనికి సంబంధించి ఇప్పటికే పరిహారాన్ని చెల్లిస్తున్న ఇండిగో కొత్త ఎత్తుగడకు తెర తీసింది. డిసెంబరు మూడు నుంచి 5 వరకు తమ వద్ద టికెట్లు కొని ఇబ్బందులకు గురైన ప్రయాణికులకు రూ.10వేల చొప్పున వోచర్లను ఇష్యూ చేయనున్నట్లుగా పేర్కొంది. అయితే.. ఏ తేదీ నుంచి ఈ వోచర్లు అందిస్తామన్న విషయాన్ని మాత్రం వెల్లడించలేదు. అంతేకాదు.. ఎంతమంది ప్రయాణికులకు వోచర్లు అందిస్తున్నది కూడా స్పష్టం చేయలేదు.
నిబంధనల ప్రకారం విమాన సర్వీసు క్యాన్సిల్ అయినా.. ఆలస్యమైనా ప్రయాణికులకు పరిహారం చెల్లించాల్సి ఉంటుంది. అందుకు తగ్గట్లే ఇప్పటికే రూ.5 వేల నుంచి రూ.10 వేల వరకు పరిహారాన్ని ప్రకటించిన సంగతి తెలిసిందే. దీనికి అదనంగా ఒక్కో ప్రయాణికుడికి రూ.10 వేలు చొప్పున పరిహారం అందించాలని డిసైడ్ అయినట్లుగా ఇండిగో వెల్లడించింది. అయితే.. ఈ వోచర్లు వచ్చే ఏడాది డిసెంబరు వరకు చెల్లువాటు అయ్యేలా ఉంటాయని స్పష్టం చేస్తున్నారు. కాకపోతే.. ఎంతమందికి ఈ వోచర్ పరిహారాన్ని అందిస్తారన్న దానిపై స్పష్టత ఇవ్వలేదు.
ఇదిలా ఉండగా ఇండిగో రద్దు అవుతున్న సర్వీసుల సంఖ్య అంతకంతకూ తగ్గుతూ వస్తోంది. గురువారం 1950సర్వీసుల్ని నడిపింది. మూడు లక్షల మందిని గమ్యస్థానాలకు చేర్చింది. గురువారం ఢిల్లీ.. బెంగళూరుల్లో 200 విమాన సర్వీసుల్నిరద్దు చేసినట్లుగా ప్రకటించింది. ఇదిలా ఉండగా ఇండిగో సీఈవో పీటర్ ఎల్బర్స్ మరోసారి డీజీసీఏ విచారణ కమిటీ ఎదుట హాజరు కానున్నారు. గురువారం విచారణకు హాజరైన ఆయన శుక్రవారం కూడా హాజరుకానున్నారు. ఇప్పటికే సేవల అంతరాయానికి సంబంధించి పలు ప్రశ్నలు అడిగినట్లుగా తెలుస్తోంది. మరోవైపు ఇండిగో కార్యాలయాల్లో డీజీసీఏ అధికారుల పర్యవేక్షణ మొదలైంది. దీంతో.. పాత పరిస్థితికి ఒకట్రెండు రోజుల్లో వెళ్లిపోయే వీలుందన్న మాట వినిపిస్తోంది.
