అమెరికా కాదు.. సౌదీ అరేబియా.. భారతీయ బహిష్కరణలపై షాకింగ్ గణాంకాలు
అమెరికా నుంచి భారతీయుల బహిష్కరణ గురించి ఇటీవలి కాలంలో ఎన్నో వార్తలు విన్నాం. అయితే గణాంకాలను పరిశీలిస్తే ఒక ఆశ్చర్యకరమైన విషయం వెలుగులోకి వచ్చింది.
By: A.N.Kumar | 27 Dec 2025 6:28 PM ISTవిదేశాల్లో స్థిరపడాలనే కలలతో వెళతున్న భారతీయులకు వీసా నిబంధనలు, స్థానిక చట్టాలు చుక్కల చూపుతున్నాయి. 2025 సంవత్సరంలో ప్రపంచవ్యాప్తంగా దాదాపు 81 దేశాల నుంచి 24600 మంది భారతీయులు స్వదేశానికి బహిష్కరించబడ్డారు. ఇందులో సగానికి పైగా కేసులు కేవలం ఒక దేశం నుంచి ఉండటం గమనార్హం.
అమెరికా నుంచి భారతీయుల బహిష్కరణ గురించి ఇటీవలి కాలంలో ఎన్నో వార్తలు విన్నాం. అయితే గణాంకాలను పరిశీలిస్తే ఒక ఆశ్చర్యకరమైన విషయం వెలుగులోకి వచ్చింది. 2025లో భారతీయలను అత్యధికంగా వెనక్కి పంపిన దేశం అమెరికా కాదు.. ఇది నిజంగా నిజం. కేంద్ర విదేశీ వ్యవహారాల శాఖ రాజ్యసభలో సమర్పించిన తాజా నివేదిక ప్రకారం.. ఈ ఏడాది అత్యధికంగా భారతీయులన డిపోర్ట్ చేసిన దేశంగా సౌదీ అరేబియా నిలిచింది.
దేశాల వారీగా డిపోర్టేషన్ గణాంకాలు ఇలా ఉన్నాయి..
కేంద్ర నివేదిక ప్రకారం.. టాప్ 5 దేశాల జాబితా ఇలా ఉంది. సౌదీ అరేబియా నుంచి బహిష్కరించబడిన భారతీయుల సంఖ్య 11000 పైగా ఉంది. ఇక అమెరికా నుంచి 3800, మయన్మార్ 1591, మలేషియా 1483, యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ 1469 మంది బహిష్కరించబడ్డారు.
బహిష్కరణకు ప్రధాన కారణాలేంటి?
భారతీయులు ఇంత పెద్ద సంఖ్యలో వెనక్కి రావడానికి ప్రధానంగా మూడు కారణాలు కనిపిస్తున్నాయి.. వీసా గడువు ముగిసినా అక్కడే ఉండిపోవడం.. సరైన పని అనుమతులు లేకుండా ఉద్యోగాలు చేయడం.. ఏజెంట్ల ద్వారా అడ్డదారిలో సరిహద్దులు దాటుతున్నారు.
మయన్మార్, సైబర్ క్రైమ్ ముఠాలు
మయన్మార్ నుంచి డిపోర్ట్ అయిన 1591 మందిలో ఎక్కువమంది సైబర్ క్రైమ్ స్కామ్ లలో చిక్కుకున్న బాధితులే కావడం ఆందోళన కలిగిస్తోంది. ఉద్యోగాల పేరుతో అక్కడికి వెళ్లిన యువతను బలవంతంగా సైబర్ నేరాలకు పాల్పడేలా ముఠాలు ఒత్తిడి చేస్తున్నాయి. ఇందులో తెలుగు రాష్ట్రాలక చెందిన వార గణనీయంగా ఉన్నట్లు సమాచారం.
విద్యార్థుల పరిస్థితి ఏమిటి?
ఉన్నత చదవుల కోసం వెళ్లిన విద్యార్థులు కూడా ఈ ఏడాది డిపోర్టేషన్ ఎదుర్కోవాల్సి వచ్చింది. యూకేలో 170 మంది, ఆస్ట్రేలియా 114మంది, రష్యాలో 82 మంది, అమెరికా లో 45మంది విద్యార్థులు వివిధ కారణాలతో వెనక్కి పంపబడ్డారు.
అమెరికాలో ట్రంప్ ప్రభావం.. విమానాల్లో కట్టిపారేసి..
అమెరికాలో గత ఐదేళ్ల కాలంలో 2025లోనే అత్యధికంగా బహిష్కరణలు జరిగాయి. ముఖ్యంగా డొనాల్డ్ ట్రంప్ అధికారంలోకి వచ్చాక అక్రమ వలసదారలపై ఉక్కుపాదం మోపారు. వాషింగ్టన్ డీసీ నుంచి ఏకంగా 3414 మందిని వెనక్కి పంపారు. బహిష్కరించబడిన వారిని ప్రత్యేక సైనిక విమానాల్లో తీసుకురావడం ఆ సమయంలో వారి చేతులు, కాళ్లు కట్టేయడం వంటి అంశాలు అంతర్జాతీయంగా వివాదాస్పదమయ్యాయి.
విదేశీ ప్రయాణాలు చేసేవారు ఏజెంట్ల మాటలు నమ్మి మోసపోకుండా, ఆయా దేశాల వీసా నిబంధనలు మరియు ఉపాధి చట్టాలపై పూర్తి అవగాహన కలిగి ఉండాలని విదేశీ వ్యవహారాల శాఖ హెచ్చరిస్తోంది.
