దేశం మారుతుంది... భారతీయుల సివిక్ సెన్స్ వీడియో వైరల్!
అవును... సాధారణంగా చాలా మంది భారతీయులకు సివిక్ సెన్స్ చాలా తక్కువగా ఉంటుందనే కామెంట్లు నిత్యం వినిపిస్తుంటాయనే సంగతి తెలిసిందే.
By: Raja Ch | 27 Jan 2026 11:00 PM ISTభారతీయులకు సివిక్ సెన్స్ చాలా తక్కువగా ఉంటుందని.. ప్రధానంగా బస్సులు, రైళ్లు ఎక్కుతున్నప్పుడు ఈ విషయం స్పష్టంగా కనిపిస్తుంటుందని.. రోడ్లపై ట్రాఫిక్ సిగ్నల్స్ విషయంలోనూ చూడొచ్చని.. రోడ్లపై చెత్త పడేసే విషయంలోనూ దర్శనమిస్తుంటుందని చెబుతుంటారు. ఈ విషయంలో భారతీయులు చాలా మారాల్సి ఉందని.. జపాన్ వాసుల తరహాలో సివిక్ సెన్స్ కలిగి ఉండాలని సోషల్ మీడియా వేదికగా సూచనలు కనిపిస్తుంటాయి! ఈ క్రమంలో వాటికి ఓ మోస్తరు కౌంటర్ పడింది.. ఇది శుభసూచకం!
అవును... సాధారణంగా చాలా మంది భారతీయులకు సివిక్ సెన్స్ చాలా తక్కువగా ఉంటుందనే కామెంట్లు నిత్యం వినిపిస్తుంటాయనే సంగతి తెలిసిందే. ఈ విషయంలో ఎవరికి వారు ఆత్మపరిశీలన చేసుకుంటే సమాధానం దొరికేస్తుంది! అయితే.. తాజాగా సోషల్ మీడియాలో హల్ చల్ చేస్తున్న ఓ వీడియోలో.. ఓ అరుదైన దృశ్యం సాక్ష్యాత్కరించిందని చెప్పొచ్చు. ఇందులో భాగంగా... మెట్రో స్టేషన్ లో భారతీయులు క్యూలైన్ లో నిల్చుని.. పై నుంచి వచ్చే వారికి పక్కన స్పేస్ వదిలారు!
వివరాళ్లోకి వెళ్తే... ఓ వ్యక్తి ఇన్ స్టాగ్రామ్ లో ఓ ఆసక్తికర వీడియోను పోస్ట్ చేశారు. ఇందులో భాగంగా... ఢిల్లీలోని కరోల్ బాగ్ మెట్రో స్టేషన్ లోకి ప్రవేశించేటప్పుడు మెట్ల ఒక వైపున వరుసలో నిలబడి క్యూలో ఉన్న వ్యక్తులు కనిపించగా.. మెట్రో స్టేషన్ నుండి బయటకు వస్తున్న వారికి మరొక వైపు స్థలం వదిలివేయబడింది. ఈ చర్య ప్రయాణికులలో అవగాహనను హైలైట్ చేస్తుంది.. ఆన్ లైన్ లో ప్రశంసలను పొందుతుంది. భారత్ లో రద్దీగా ఉండే బహిరంగ ప్రదేశంలో ఇది చాలా అరుదని అంటున్నారు.
ఈ వీడియోను పోస్ట్ చేసిన వ్యక్తి... జపాన్ లో మాత్రమే సివిక్ సెన్స్ ఉంటుందని ఎవరు అంటున్నారు.. అది భారతీయులలో కూడా ఉంది అని చెబుతున్నారు.. ఇది దేశం మారుతోందని చెప్పడానికి ఒక ఉదాహరణ అని అంటున్నారు! ఈ వీడియోపై సోషల్ మీడియాలో సానుకూల స్పందనలు వస్తున్నాయి. ఈ సందర్భంగా... దీనిని ప్రతిచోటా అనుసరిస్తే ఇంకా అద్భుతంగా ఉంటుందని.. ఎవరైనా లైన్ ను దాటాలనుకున్నా సిగ్గు పడో, భయపడో ఆగుతారని చెబుతున్నారు!
కాగా... ఇటీవల ఢిల్లీలోని మెట్రో స్టేషన్ లోపల ఒక వ్యక్తి బహిరంగంగా మూత్ర విసర్జన చేస్తున్న వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయిన సంగతి తెలిసిందే. ఇది బేసిక్ సివిక్ సెన్స్ లేకపోవడం గురించిన చర్చకు దారితీసింది. ఆ వ్యక్తి ప్లాట్ ఫారమ్ లోని గాజు రెయిలింగ్ ల దగ్గర మూత్ర విసర్జన చేస్తున్నట్లు కనిపించగా.. తనను రికార్డ్ చేస్తున్నారని గమనించిన తర్వాత అక్కడ నుంచి పారిపోయాడు! దానికి పూర్తి విభిన్నంగా అన్నట్లుగా తాజా వీడియో ఆసక్తిగా మారింది!
