అమెరికా హైవేలపై 'ఆపరేషన్ హైవే సెంటినెల్'.. కాలిఫోర్నియాలో 30 మంది భారతీయుల అరెస్టు
డిసెంబర్ 10, 11 తేదీల్లో కాలిఫోర్నియాలోని ఎల్ సెంట్రో సెక్టర్ పరిధిలో ‘ఆపరేషన్ హైవే సెంటినెల్’ పేరుతో అధికారులు భారీ సోదాలు నిర్వహించారు.
By: A.N.Kumar | 24 Dec 2025 6:56 PM ISTఅమెరికాలో ఉపాధి కోసం అక్రమ మార్గాలను ఎంచుకునే వారికి.. నిబంధనలు ఉల్లంఘించే వారికి ఆ దేశ అధికారులు గట్టి హెచ్చరికలు జారీచేస్తున్నారు. తాజాగా కాలిఫోర్నియాలో జరిగిన ప్రత్యేక తనిఖీల్లో 30 మందికి పైగా భారతీయ పౌరులు అరెస్ట్ అవ్వడం ఇటు అమెరికాలోనూ.. అటు భారత్ లోనూ పెద్ద చర్చకు దారితీసింది. అసలు ఏం జరిగింది? అధికారులు ఎందుకు ఇంత కఠినంగా వ్యవహరిస్తున్నారో తెలుసుకుందాం..
ఆపరేషన్ హైవే సెంటినెల్
డిసెంబర్ 10, 11 తేదీల్లో కాలిఫోర్నియాలోని ఎల్ సెంట్రో సెక్టర్ పరిధిలో ‘ఆపరేషన్ హైవే సెంటినెల్’ పేరుతో అధికారులు భారీ సోదాలు నిర్వహించారు. ఈ ఆపరేషన్ లో యూఎస్ కస్టమ్స్ మరియు బార్డర్ ప్రొటెక్షన్ (సీబీపీ), ఇమ్మిగ్రేషన్ మరియు కస్టమ్స్ ఎన్ ఫోర్స్ మెంట్ సంయుక్తంగా పాల్గొన్నాయి. మొత్తం 49 మంది అక్రమ వలసదారులు పట్టుబడగా... అందులో 30 మంది భారతీయులు ఉండడం గమనార్హం. మిగిలిన వారు చైనా, రష్యా, ఉక్రెయిన్ ,హైతీ దేశాలకు చెందినవారు. వీరంతా సరైన ఇమిగ్రేషన్ పత్రాలు, వీసాలు లేకుండానే అక్రమంగా కమర్షియల్ డ్రైవింగ్ లైసెన్సులు పొంది భారీసెమీ ట్రక్కులను నడుపుతున్నారు.
కఠిన చర్యలకు దారితీసిన కారణాలేమిటి?
గత కొంతకాలంగా అమెరికా హైవేలపై ట్రక్కుల వల్ల జరుగుతున్న ఘోర ప్రమాదాలే ఈ ఉక్కుపాదానికి ప్రధాన కారణం. సరైన శిక్షణ, చట్టబద్ధత లేని డ్రైవర్ల వల్ల అమెరికన్ పౌరులు ప్రాణాలు కోల్పోవడంపై అక్కడి ప్రభుత్వం సీరియస్ గా ఉంది. రాజిందర్ కుమార్, హర్జిందర్ సింగ్ వంటి డ్రైవర్ల వల్ల జరిగిన ప్రమాదాల్లో పౌరులు మరణించడం అధికారుల దృష్టికి వచ్చింది. అక్టోబర్ లో జషన్ ప్రీత్ సింగ్ అనే వ్యక్తి డ్రగ్స్ మత్తులో 18 వీలర్ ట్రక్కు నడుపుతూ ముగ్గురిని ఢీకొట్టి చంపడం అమెరికా వ్యాప్తంగా సంచలనం సృష్టించింది. తప్పుడు డాక్యుమెంట్లతో లైసెన్స్ పొందడం వల్ల రోడ్డు భద్రతతో పాటు జాతీయ భద్రతకు కూడా ముప్పు వాటిల్లుతుందని అధికారులు భావిస్తున్నారు.
అధికారుల లక్ష్యం ఇదే!
ఈ దాడుల ద్వారా అమెరికా ప్రభుత్వం కొన్ని స్పష్టమైన లక్ష్యాలను నిర్ధేశించుకుంది. ఇమిగ్రేషన్ చట్టాల ఉల్లంఘనపై ‘సున్నా సహన విధానం’ అమలు చేస్తోంది. వాణిజ్య రవాణా రంగంలో కేవలం అర్హత, చట్టబద్ధత ఉన్న వారే ఉండేలా చూస్తున్నారు. తప్పుడు మార్గాల్లో అమెరికలోకి ప్రవేశించి అక్రమంగా ఉద్యోగాలు చేసే వారికి గట్టిసంకేతం పంపారు.
కాలిఫోర్నియాలో జరిగిన ఈ అరెస్టులు కేవలం వలసదారులకే కాకుండా వారికి అక్రమంగా లైసెన్సులు ఇప్పించే ముఠాలకు కూడా హెచ్చరిక. అమెరికా కల సాకారం చేసుకోవాలనుకునే వారు చట్టబద్ధమైన మార్గాలను ఎంచుకోవాలని.. లేదంటే జైలు శిక్షతోపాటు శాశ్వతంగా ఆ దేశం నుంచి బహిష్కరణకు గురయ్యే ప్రమాదం ఉందని నిపుణులు హెచ్చరిస్తున్నారు.
