Begin typing your search above and press return to search.

యాపిల్ ఫోన్ తయారీలో దేశీయ కంపెనీల కీ రోల్

ఆస్తులు.. అంతస్తులతో సంబంధం లేకుండా వేలాది రూపాయిలు పోసి ఐఫోన్ కొనేందుకు ప్రదర్శించే క్రేజ్ చూస్తే మతి పోవాల్సిందే.

By:  Garuda Media   |   25 Sept 2025 9:32 AM IST
యాపిల్ ఫోన్ తయారీలో దేశీయ కంపెనీల కీ రోల్
X

యూత్ మొదలు మరెవరైనా తమ కలల ఫోన్ ఏదన్న మాట అడిగినంతనే వచ్చే సమాధానం ఐఫోన్. లక్ష రూపాయిలకు దగ్గరగా ఉండే ఈ ఫోన్ కొనుగోలు చేసేందుకుచూపించే ఆసక్తి అంతా ఇంతా కాదు. ఏడాదికేడాదికి వచ్చేకొత్త మోడల్ ను అప్డేట్ చేసుకునే ప్రత్యేక జీవులు కుప్పలు కుప్పలుగా కనిపిస్తుంటారు ఇటీవల కాలంలో మొదలైన మరో ట్రెండ్ ఏమంటే.. అల్పాదాయ వర్గాలు.. అందునా చిన్న ఉద్యోగాలు చేసే యూత్ సైతం.. తాము పని చేసే జీతానికి.. వారి చేతిలో ఉండే ఐఫోన్ కు ఏ మాత్రం సింక్ లేనోళ్లు బోలెడంత మంది కనిపిస్తున్నారు.

ఆస్తులు.. అంతస్తులతో సంబంధం లేకుండా వేలాది రూపాయిలు పోసి ఐఫోన్ కొనేందుకు ప్రదర్శించే క్రేజ్ చూస్తే మతి పోవాల్సిందే. అంతకంతకూ పెరుగుతున్న ఆదరణకు తగ్గట్లే.. గతంలో చైనాలో తయారయ్యే ఐఫోన్ ఇటీవల కాలంలో ఇండియాకు షిప్టు కావటం.. ఇక్కడే తయారు కావటం తెలిసిందే. మనదేశంలో ఐఫోన్ తయారీ సామర్థ్యాల విస్తరణపై యాపిల్ కంపెనీ మరింత ఫోకస్ చేసింది. సాధ్యమైనన్ని విడి భాగాల్ని దేశీయంగా సమీకరించుకోవటంతో పాటు.. సరఫరా వ్యవస్థను వేగంగా విస్తరిస్తోంది.

ఐఫోన్ల తయారీకి అవసరమైన యంత్రాలను మన దేశంలోనే సమకూర్చుకుంటున్న యాపిల్ సంస్థ.. చైనా మీద వీలైనంత తక్కువగా ఆధారపడుతోంది. చివరకు ఆ దేశంలోని ఐఫోన్ ప్లాంట్లలో పని చేసే ఇంజినీర్లను సైతం భారత్ కు పంపిస్తోంది. ఆసక్తికరమైన మరో అంశం ఏమంటే.. దేశీయంగా ఐఫోన్ తయారీకి అవసరమైన విడి భాగాల్ని దేశీయంగా 35 కంపెనీలు ఉత్పత్తి చేస్తున్నట్లు తెలుస్తోంది.

ఇందులో సగం కంపెనీలు గడిచిన రెండేళ్లుగా యాపిల్ కోసం పని చేస్తున్నట్లుగా చెప్పాలి. ఇంతకూ ఈ కంపెనీలు ఏమిటన్న విషయానికి వస్తే కొన్ని సంస్థల పేర్లు బయటకు వచ్చాయి. దేశీయంగా తయారు చేసే ఐఫోన్ కు విడిభాగాలు సమకూర్చే కంపెనీల్లో కీలకభూమిక పోషిస్తున్న సంస్థల విషయానికి వస్తే.. టైటన్ ఇంజినీరింగ్ అండ్ ఆటోమేషన్, జ్యోతి సీఎన్ సీ ఆటోమేషన్, భారత్ ఫోర్జ్, విప్రో లాంటి ప్రధాన సంస్థలు యాపిల్ కు విడిభాగాలు అందిస్తున్నట్లు చెబుతున్నారు.

అంతేకాదు.. మరికొన్నిచిన్న కంపెనీలు సైతం యాపిల్ కు సేవలు అందిస్తున్నాయి. చైనాయేతర సంస్థలకు ప్రాధాన్యంలభిస్తుండటంతో.. దేశీయంగా కొన్ని సంస్థలకు అవకాశం లభిస్తోంది. దీంతో.. వాటి దిశ.. దశ మారిపోతుందని చెబుతున్నారు. రానున్న రెండేళ్లలో ఈ భాగస్వాముల సంఖ్య మరింత పెరగనుందని తెలుస్తోంది. అదే జరిగితే.. దేశీయ కంపెనీలు మరింత బలోపేతం కావటంతో పాటు.. వాటి ఇమేజ్ భారీగా పెరుగుతుందని చెప్పక తప్పదు.