Begin typing your search above and press return to search.

పరాయి దేశాల రూల్స్ తెలియక చిక్కుల్లో పడుతున్న భారతీయులు..

సోషల్ మీడియా యుగంలో ఎక్కడైనా ఫోటోలు తీసి స్టేటస్‌లు పెట్టడం మనకు అలవాటు. కానీ గల్ఫ్ దేశాలలో ముఖ్యంగా దుబాయ్‌లో పర్సనల్ ప్రైవసీ చట్టాలు చాలా కఠినంగా ఉంటాయి.

By:  Madhu Reddy   |   16 May 2026 1:02 PM IST
పరాయి దేశాల రూల్స్ తెలియక చిక్కుల్లో పడుతున్న భారతీయులు..
X

విమాన ప్రయాణంలో ఫోటోలు తీసుకున్నందుకు ఒక భారతీయ వలస కార్మికుడికి దుబాయ్ కోర్టు 10 ఏళ్ల జైలు శిక్ష విధించిన ఘటన అంతర్జాతీయంగా పెద్ద సంచలనంగా మారింది. బీహార్‌కు చెందిన వసీం అక్రమ్ అనే అమాయక యువకుడు చేసిన చిన్న పొరపాటు అతడి జీవితాన్ని చీకట్లోకి నెట్టేసింది. అయితే, విదేశీ చట్టాలపై అవగాహన లేకపోవడం వల్ల ఇలాంటి ఘోర చిక్కుల్లో పడిన అమాయక భారతీయుల కథలు ఇవేం మొదటివి కావు. గతంలో కూడా కేవలం రూల్స్ తెలియక తీవ్రమైన శిక్షలు అనుభవించిన కొందరి బాధలు చెప్పలేనివి..ఆ వివరాలు చూద్దాం..

సింగపూర్‌లో చూయింగ్ గమ్ తెచ్చిన జైలు పాలు..

మన దేశంలో చూయింగ్ గమ్ నమలడం, ఎక్కడ పడితే అక్కడ ఉమ్మడం చట్టరీత్యా నేరం కాదు. కానీ సింగపూర్‌లో చూయింగ్ గమ్‌లను పూర్తిగా నిషేధించారు. కొన్నేళ్ల క్రితం భారతదేశం నుండి సింగపూర్‌కు ఉద్యోగం కోసం వెళ్లిన ఒక తెలుగు యువకుడు, తనతో పాటు కొన్ని చూయింగ్ గమ్ ప్యాకెట్లను బ్యాగులో తీసుకెళ్లాడు. ఇక అక్కడ విమానాశ్రయం తనిఖీల్లో అవి దొరకడంతో అధికారులు అతడిని అరెస్ట్ చేశారు. కేవలం నమలడానికే తెచ్చుకున్నానని, ఇక్కడ నిషేధమనే విషయం తనకు తెలియదని ఎంత మొరపెట్టుకున్నా అక్కడి చట్టాలు వదిలిపెట్టలేదు. ఇక భారీ జరిమానాతో పాటు కొన్ని నెలల పాటు జైలు శిక్ష అనుభవించాల్సి వచ్చింది.

దుబాయ్‌లో ఇతరుల ఫోటోలు తీసి చిక్కుల్లో..

సోషల్ మీడియా యుగంలో ఎక్కడైనా ఫోటోలు తీసి స్టేటస్‌లు పెట్టడం మనకు అలవాటు. కానీ గల్ఫ్ దేశాలలో ముఖ్యంగా దుబాయ్‌లో పర్సనల్ ప్రైవసీ చట్టాలు చాలా కఠినంగా ఉంటాయి. ఇక కేరళకు చెందిన ఒక వలస కార్మికుడు దుబాయ్‌లోని ఒక పర్యాటక ప్రాంతంలో సెల్ఫీ తీసుకుంటున్న సమయంలో, వెనుక కొంతమంది స్థానిక మహిళలు కూడా ఫోటోలో పడ్డారు. ఆ ఫోటోను అతడు ఫేస్‌బుక్‌లో షేర్ చేశాడు. ఆ మహిళల కుటుంబ సభ్యులు ఫిర్యాదు చేయడంతో, సైబర్ క్రైమ్ చట్టాల కింద ఆ యువకుడిని పోలీసులు అరెస్ట్ చేశారు. పరాయి స్త్రీలను వారి అనుమతి లేకుండా ఫోటో తీయడం అక్కడ పెద్ద నేరం. దాంతో ఆ యువకుడికి భారీ జరిమానా విధించి, ఆ తర్వాత దేశం నుండి బహిష్కరించారు.

అంతర్జాతీయ చట్టాల ప్రకారం "నాకు ఈ విషయం తెలియదు" అని చెప్పడం నేరం నుండి తప్పించుకోవడానికి కారణం కాలేదు. మన దేశంలో సాధారణంగా భావించే విషయాలు,ఫోటోలు తీయడం, కొన్ని రకాల మందులు తీసుకెళ్లడం, గాల్లో నోట్లు జల్లడం వంటివి,విదేశాల్లో తీవ్రమైన నేరాలుగా పరిగణించబడతాయి. అందుకే ఏ దేశానికి వెళ్లినా అక్కడి కఠినమైన రూల్స్ మరియు సైబర్ చట్టాల గురించి ముందే తెలుసుకోవడం చాలా అవసరం.

బీహార్‌కు చెందిన వసీం అక్రమ్ ఉదంతం విదేశాలకు వెళ్లే ప్రతి ఒక్కరికీ ఒక కనువిప్పు లాంటిది. అమాయకత్వం వల్ల ఒక కుటుంబానికి ఆధారమైన వ్యక్తి పదేళ్లు జైలుపాలు కావడం అత్యంత హృదయవిదారకం.ఇక ఇప్పుడు కేంద్ర ప్రభుత్వం దౌత్యపరంగా జోక్యం చేసుకుని దుబాయ్ ప్రభుత్వంతో మాట్లాడితేనే వసీంకు విముక్తి లభిస్తుంది. విదేశాలకు వెళ్లే కార్మికులకు మన ప్రభుత్వాలు చట్టాలపై కనీస అవగాహన సదస్సులు నిర్వహించాల్సిన అవసరం ఎంతైనా ఉంది.