కెనడా సందుల్లో సారీ ఫంక్షన్ సందడి... నెటిజన్ల మైండ్ బ్లాక్.. స్థానికుల ఫ్యూజులు అవుట్..
మంచు తుఫాన్లకు, చల్లటి గాలికే అలవాటు పడిన కెనడా వాసులకు ఒకరోజు ఉదయాన్నే దిమ్మతిరిగే దృశ్యం కనిపించింది.
By: A.N.Kumar | 4 Aug 2026 8:07 PM ISTమంచు తుఫాన్లకు, చల్లటి గాలికే అలవాటు పడిన కెనడా వాసులకు ఒకరోజు ఉదయాన్నే దిమ్మతిరిగే దృశ్యం కనిపించింది. ప్రతిరోజూ తెల్లటి కోట్లు, గ్రే రంగు శీతాకాల దుస్తుల్లో తిరిగే వాళ్ల కళ్ల ముందు ఒక్కసారిగా రంగురంగుల సీతాకోకచిలకలు వాలినంత పండగ వాతావరణం నెలకొంది. మన భారతీయ మహిళలు ధగధగ మెరిసిపోయే పట్టుచీరలు కట్టుకుని, పక్కా దేశీ లుక్‌లో కెనడా వీధుల్లోకి ప్రదర్శనగా దిగిపోయారు. సొంత ఊళ్లో ఇంట్లో లేదా ఏదైనా ఫంక్షన్ హాల్లో జరుపుకోవాల్సిన 'సారీ ఫంక్షన్' వేడుకను ఏకంగా కెనడా రోడ్లపైనే సెట్ చేశారు. రంగురంగుల పట్టు చీరలు, భారీ జరీ అంచులు, మెడలో మెరిసే నగలు, చేతులకు రంగుల గాజులతో ఒక మెచ్యూర్ అయిన బాలిక హంస వాహనంపైకి ఎక్కించి ఆమెను అందంగా తయారు చేసి బంధువులంతా మోస్తూ మేళతాళాలతో ఊరేగిస్తూ పక్కా ఇండియన్ హంగామా సృష్టించారు. ఇక వీధిని దిల్ సుఖ్ నగర్ లేదా టి.నగర్ మార్కెట్‌లా మార్చేసి, ఫోన్లు చేతికి తీసి రకరకాల రీల్స్, షార్ట్స్, ఫోటోషూట్‌లతో కెనడా వీధులను కుదిపేశారు.
ఈ వింత సందడి చూసి పాపం స్థానిక కెనడియన్ల ఫ్యూజులు ఎగిరిపోయాయి. అప్పటివరకు ప్రశాంతంగా కాఫీ సిప్ చేస్తూ నడుస్తున్న వాళ్లంతా ఒక్కసారిగా ఆగిపోయి నోళ్లు వెళ్లబెట్టారు. అసలు తమ వీధుల్లో ఏం జరుగుతోందో అర్థం కాక తెల్లమొహం వేశారు. ఇవేం బట్టలురా బాబోయ్.. ఎంత రంగుల ప్రపంచం అని కొందరు ఆశ్చర్యంగా చూస్తే అసలు ఏ వీధిలో హాలీవుడ్ షూటింగ్ జరుగుతోంది అని మరికొందరు కన్ఫ్యూజ్ అయ్యారు. ఏమైనా కొత్త రకం డ్రెస్ కోడ్ పెట్టారా అని తలలు పట్టుకుని చూస్తున్న స్థానికుల అమాయకపు ముఖకవళికలు అక్కడ ఉన్నవారికి భలే వినోదాన్ని పంచాయి. తమ రొటీన్ బ్లాక్ అండ్ వైట్ కోట్లతో పోలిస్తే ఈ పట్టుచీరల ధగధగల ముందు తాము ఎందుకూ పనికిరామని లోలోపల అనుకుంటూ కొంచెం సంకోచంగా మరికొంచెం కుతూహలంగా వాళ్లు నిలబడిపోయిన తీరు అందరినీ ఆకట్టుకుంది.
ఈ హంగామాకు సంబంధించిన వీడియోలు, ఫోటోలు నెట్టింట ప్రత్యక్షమవ్వడమే ఆలస్యం.. సోషల్ మీడియాలో నెటిజన్లు రచ్చ రచ్చ చేశారు. వేల కిలోమీటర్ల దూరంలో ఉన్నా ఏ విదేశంలో ఉన్నా మనోళ్లు తమ మూలాలను, పద్ధతులను, పట్టుచీరల ప్రేమాభిమానాలను అస్సలు వదిలేది లేదని ఈ ఘటన నిరూపించింది. ఒకవైపు సంస్కృతిని కాపాడుకుంటున్నారని ప్రశంసల వర్షం కురుస్తుంటే ఇంకోవైపు మీమర్లు మాత్రం కెనడియన్ల అమాయకపు ముఖాలపై దారుణమైన సెటైర్లు వేస్తున్నారు. పాపం అక్కడ ఉన్న విదేశీయులకేం తెలుసు.. మనోళ్లు మున్ముందు 'సీమంతాలు', 'గాజుల పండుగలు' కూడా రోడ్లపైనే జరిపినా ఆశ్చర్యపోనక్కర్లేదని కామెంట్లు పెడుతున్నారు. ఏదేమైనా కెనడా సందుల్లో మన భారతీయ మహిళలు చేసిన ఈ 'సారీ సందడి' మాత్రం సోషల్ మీడియాలో వేరే లెవెల్ ట్రెండింగ్‌గా నిలిచింది.
