Begin typing your search above and press return to search.

ఇటలీలో భారతీయ మహిళల ధైర్యం: భారత్‌ను దూషించిన వెయిటర్‌కు బుద్ధి చెప్పిన వైనం.. వీడియో వైరల్!

ఇటలీలో భారతదేశాన్ని.. భారతీయ మహిళలను అవమానించిన ఒక రెస్టారెంట్ వెయిటర్‌ను నిలదీసి అతడితో బహిరంగంగా క్షమాపణ చెప్పించిన ఘటన ప్రస్తుతం సోషల్ మీడియాలో విపరీతంగా వైరల్ అవుతోంది.

By:  A.N.Kumar   |   24 Jun 2026 3:03 PM IST
ఇటలీలో భారతీయ మహిళల ధైర్యం: భారత్‌ను దూషించిన వెయిటర్‌కు బుద్ధి చెప్పిన వైనం.. వీడియో వైరల్!
X

విదేశాల్లో భారతీయులపై జాత్యహంకార వ్యాఖ్యలు, వివక్ష ఎదురైన సంఘటనలు మనం తరచూ చూస్తూనే ఉంటాం. అయితే అలాంటి వివక్షను చూసి వెనకడుగు వేయకుండా తమ దేశ గౌరవం కోసం ధైర్యంగా పోరాడి గెలిచారు కొందరు భారతీయ మహిళలు. ఇటలీలో భారతదేశాన్ని.. భారతీయ మహిళలను అవమానించిన ఒక రెస్టారెంట్ వెయిటర్‌ను నిలదీసి అతడితో బహిరంగంగా క్షమాపణ చెప్పించిన ఘటన ప్రస్తుతం సోషల్ మీడియాలో విపరీతంగా వైరల్ అవుతోంది.

అసలేం జరిగింది?

ఇన్‌స్టాగ్రామ్‌లో ఖుషీ దుబే అనే యువతి " ఇటలీలో మాకు ఎదురైన అనుభవం ఇది’’ అనే క్యాప్షన్‌తో ఒక వీడియోను పంచుకున్నారు. ఆ వీడియో ఆధారంగా చూస్తే.. ఇటలీలోని ఒక రెస్టారెంట్‌లో 'హొస్సైన్' అనే వెయిటర్ అక్కడికి వచ్చిన భారతీయ మహిళలతో చాలా అసభ్యంగా ప్రవర్తించాడు. అంతటితో ఆగకుండా భారతదేశాన్ని ఉద్దేశించి అత్యంత దారుణమైన పదజాలంతో దూషించాడు. "ఫక్ ఇండియా"* అంటూ పలుమార్లు నోరుపారేసుకున్నాడు. తమ మాతృభూమిని, తమను అంతలా అవమానిస్తున్నా ఆ మహిళలు అస్సలు భయపడలేదు. చాలా ప్రశాంతంగా అంతే ధైర్యంగా అతడిని నిలదీశారు. "ముందుగా నీ భాషను అదుపులో పెట్టుకో. మేము మహిళలం, మాతో గౌరవంగా మాట్లాడటం నేర్చుకో" అంటూ అతడికి గట్టిగా హెచ్చరికలు జారీ చేశారు. అయినప్పటికీ ఆ వెయిటర్ ఏమాత్రం తగ్గకుండా వారిపై వాగ్వాదానికి దిగాడు.

రంగంలోకి దిగిన పోలీసులు.. దిగొచ్చిన వెయిటర్

ఈ గొడవ కాస్త పెద్దది కావడంతో సమాచారం అందుకున్న ఇటలీ పోలీసులు అక్కడికి చేరుకున్నారు. పోలీసులు రంగంలోకి దిగడంతో అంతవరకు రెచ్చిపోయిన వెయిటర్ ఒక్కసారిగా సైలెంట్ అయ్యాడు. పోలీసుల జోక్యంతో తప్పు తెలుసుకొని క్షమాపణ చెప్పడానికి ముందుకు వచ్చాడు. అయితే ఆ భారతీయ మహిళలు అంతటితో వదిలిపెట్టలేదు. సాధారణంగా 'సారీ' చెప్తే సరిపోదని, తాము అనుభవించిన అవమానానికి, భారతదేశాన్ని దూషించినందుకు స్పష్టమైన క్షమాపణ చెప్పాలని పట్టుబట్టారు. "నువ్వు భారతదేశాన్ని దూషించినందుకు క్షమాపణలు చెబుతున్నానని నోటితో స్పష్టంగా చెప్పు." అని నిలదీశారు. మహిళల ధైర్యానికి, పోలీసుల ఒత్తిడికి తలవంచిన ఆ వెయిటర్.. చివరకు "భారతదేశాన్ని అవమానించినందుకు క్షమాపణలు కోరుతున్నాను" అని కెమెరా ముందే ఒప్పుకోవాల్సి వచ్చింది.

దేశ గౌరవాన్ని కాపాడారు.. నెటిజన్ల ప్రశంసలు

ఈ ఘటనపై ఖుషీ దుబే సోషల్ మీడియాలో స్పందిస్తూ.. "ప్రతి సందర్భంలోనూ భారతీయులే తప్పు చేస్తారని భావించడం సరైంది కాదు. కొన్నిసార్లు మనపై ఇలాంటి వివక్ష చూపిస్తారు. మనం ఎక్కడ ఉన్నా సరే, మన దేశ గౌరవాన్ని కాపాడుకోవాలి. జైహింద్" అని భావోద్వేగంగా రాసుకొచ్చారు.

ఈ వీడియో కాస్తా నెటిజన్ల కంట పడటంతో ఆ మహిళలపై ప్రశంసల జల్లు కురుస్తోంది. విదేశాల్లో భారతీయులపై వివక్ష ఇంకా పూర్తిగా రూపుమాసిపోలేదనే చేదు నిజానికి ఈ ఘటన ఒక ఉదాహరణ. అయితే అన్యాయాన్ని అవమానాన్ని మూగగా భరించకుండా.. చట్టం పరిధిలో ధైర్యంగా ప్రశ్నిస్తే మన గౌరవాన్ని ఏ దేశంలోనైనా కాపాడుకోవచ్చని ఈ భారతీయ మహిళలు నిరూపించి అందరికీ ఆదర్శంగా నిలిచారు.