Begin typing your search above and press return to search.

బ్లడ్ గ్రూపుకు ‘బెంగళూరు’ పేరు... అరుదైన రక్తం ఈమెకు మాత్రమే సొంతం!

దీంతో వైద్యులు ఈ కేసును రోటరీ బెంగళూరు టీటీకే బ్లడ్ సెంటర్‌ లోని అడ్వాన్స్డ్ ఇమ్యునోహెమటాలజీ రిఫరెన్స్ ల్యాబ్‌ కు సూచించారు.

By:  Raja Ch   |   31 July 2025 3:00 AM IST
బ్లడ్  గ్రూపుకు ‘బెంగళూరు’ పేరు... అరుదైన రక్తం ఈమెకు  మాత్రమే సొంతం!
X

సాధారణంగా బ్లడ్‌ గ్రూప్‌ లంటే ఠక్కున గుర్తొచ్చేవి ఏ, బీ, ఏబీ, ఓ... వాటిలో పాజిటివ్ లు, నెగిటివ్ లు! అలా కాకుండా అత్యంత అరుదైన బ్లడ్ గ్రూప్ అంటే... "గోల్డెన్ బ్లడ్" గ్రూపు పేరు చెబుతారు. ఇది ప్రపంచవ్యాప్తంగా 50 కన్నా తక్కువమంది మాత్రమే ఉంది. అయితే.. తాజాగా వెలుగులోకి వచ్చిన ఓ బ్లడ్ గ్రూప్ అయితే కేవలం ఒక్క భారతీయ మహిళకు మాత్రమే ఉంది.

అవును... కర్ణాటకలోని కోల్కర్ జిల్లాకు చెందిన 38 ఏళ్ల మహిళ ప్రపంచంలోనే అరుదైన బ్లడ్ గ్రూపు కలిగిన మొదటి వ్యక్తిగా గుర్తింపు పొందిందని.. గతంలో ప్రపంచంలో ఎక్కడా ఈ రకం బ్లడ్ గ్రూపు గుర్తించబడలేదని ఒక మీడియా నివేదిక పేర్కొంది. ఈ సందర్భంగా... ఆమెకు రక్తం అవసరమైతే.. ఈమె తన రక్తాన్ని ముందుగానే దానం చేయాల్సి ఉంటుందని వైద్యులు చెబుతున్నారు.

ఎందుకంటే... ఆమెకు ఉన్న అరుదైన రకం బ్లడ్ గ్రూప్ ప్రపంచంలో మరే వ్యక్తికీ లేదని చెబుతున్నారు. అంటే ఏదైనా శస్త్రచికిత్సలు చేయించుకోవాల్సి వస్తే... ఆమె ముందుగా తన సొంత హిమోగ్లోబిన్ స్థాయిలను పెంచుకుని, తన సొంత రక్తాన్ని ముందుగానే నిల్వ చేసుకోవలసి ఉంటుంది. ఈ ప్రక్రియను ఆటోలోగస్ ట్రాన్స్‌ ఫ్యూజన్ అంటారు.

దీంతో వైద్యులు ఈ కేసును రోటరీ బెంగళూరు టీటీకే బ్లడ్ సెంటర్‌ లోని అడ్వాన్స్డ్ ఇమ్యునోహెమటాలజీ రిఫరెన్స్ ల్యాబ్‌ కు సూచించారు. అక్కడ నిపుణులు ఆమె రక్తం పరీక్షించిన తర్వాత... ఆమె రక్తంలో ఒక ప్రత్యేకమైన యాంటిజెన్ ఉందని.. దాన్ని ఇంతకు ముందు ఎప్పుడూ చూడలేదని.. ఆమె కుటుంబ సభ్యుల రక్తాన్ని కూడా పరీక్షించినా అది ఎవరితోనూ మ్యాచ్ కాలేదని తెలిపారు!

ఈ క్రమంలో ఆమె నమూనాలను యూకే లోని బ్రిస్టల్‌ లో గల ఇంటర్నేషనల్ బ్లడ్ గ్రూప్ రిఫరెన్స్ లాబొరేటరీ (ఐబీజీఆర్ఎల్)కి పంపారు. ఈ సమయంలో.. సుమారు 10 నెలల లోతైన పరీక్ష తర్వాత.. ఆమె రక్తంలో కొత్త యాంటిజెన్ ఉందని నిర్ధారించారు. ఈ సమయంలో ఈ అత్యంత అరుదైన బ్లడ్ గ్రూపుకు “సీ.ఆర్.ఐ.బీ” అని నామకరణం చేశారు.

ఇందులో ఈ కొత్త యాంటిజెన్‌ "సీఆర్ఐబీ".. లో క్రోమర్ కోసం "సీఆర్".. ఇండియా, బెంగళూరు కోసం "ఐబీ" అని పేరు పెట్టారు. ఈ పరిశోధన జూన్ 4, 2025న ఇటలీలోని మిలన్‌ లో జరిగిన అంతర్జాతీయ రక్త మార్పిడి సమావేశంలో ప్రకటించబడింది. ఆమెకు ఎప్పుడైనా రక్త మార్పిడి అవసరమైతే, ఇతరుల రక్తంపై ఆధారపడలేరని వైద్యులు చెబుతున్నారు.