Begin typing your search above and press return to search.

భారతీయ విద్యార్థుల రాకల్లో భారీ కోత.. అమెరికా విద్యారంగం కుప్పకూలుతోందా?

ప్రపంచ ఉన్నత విద్యకు ముఖ్య కేంద్రమైన అమెరికాకు భారతీయ విద్యార్థుల రాక అపూర్వంగా పడిపోయింది. తాజా వలస గణాంకాలు ఈ విషయాన్ని ధృవీకరిస్తున్నాయి.

By:  A.N.Kumar   |   3 Oct 2025 11:25 AM IST
భారతీయ విద్యార్థుల రాకల్లో భారీ కోత.. అమెరికా విద్యారంగం కుప్పకూలుతోందా?
X

ప్రపంచ ఉన్నత విద్యకు ముఖ్య కేంద్రమైన అమెరికాకు భారతీయ విద్యార్థుల రాక అపూర్వంగా పడిపోయింది. తాజా వలస గణాంకాలు ఈ విషయాన్ని ధృవీకరిస్తున్నాయి. 2025–26 విద్యా సంవత్సరంలో జూలై , ఆగస్టు నెలల్లో భారత విద్యార్థుల రాకలు దాదాపు 50% వరకు తగ్గిపోయినట్లు గణాంకాలు వెల్లడిస్తున్నాయి. దీర్ఘకాలంగా అమెరికాకు అత్యధిక విదేశీ విద్యార్థులను పంపుతున్న భారత్ నుంచి ఈ స్థాయిలో తగ్గుదల నమోదు కావడం అమెరికా విధానకర్తలకు, ముఖ్యంగా విశ్వవిద్యాలయాల భవిష్యత్తుకు గంభీరమైన ప్రశ్నలను లేవనెత్తుతోంది.

* భారీ తగ్గుదల వివరాలు: 50% మేర కోత

సాధారణంగా విద్యార్థులు ఎక్కువగా అమెరికా చేరుకునే ఈ కీలక నెలల్లోనే క్షీణత కనిపించడం అత్యంత ఆందోళనకరం.

ఆగస్టు 2025: గత ఏడాది 74,825 మంది విద్యార్థులు చేరగా, ఈసారి కేవలం 41,540 మంది మాత్రమే చేరారు. ఇది 44.5% తగ్గుదల.

జూలై 2025: ఇదే ధోరణి కొనసాగుతూ విద్యార్థుల రాకల్లో 46.4% తగ్గుదల నమోదైంది.

ఈ సంఖ్యలు అమెరికన్ విశ్వవిద్యాలయాల భవిష్యత్తుపై తీవ్ర ప్రభావాన్ని చూపనున్నాయని విద్యా నిపుణులు హెచ్చరిస్తున్నారు.

* ప్రధాన కారణాలు: కఠిన వలస విధానాలే కీలకం

ఈ భారీ తగ్గుదలకు ప్రధానంగా డొనాల్డ్ ట్రంప్ ప్రభుత్వం అమలు చేస్తున్న కఠిన వలస విధానాలు.. పోస్ట్-స్టడీ వర్క్ అవకాశాలపై అనిశ్చితి కారణమని నిపుణులు స్పష్టం చేస్తున్నారు.

* OPTపై పరిమితులు.. పోస్ట్-స్టడీ వర్క్‌పై అనిశ్చితి

పట్టభద్రులైన తర్వాత అమెరికాలో పని చేసే అవకాశం కల్పించే OPT (ఆప్షనల్ ప్రాక్టికల్ ట్రైనింగ్) ప్రోగ్రామ్‌పై పరిమితులు ప్రతిపాదించడం విద్యార్థుల్లో పెద్ద ఆందోళన కలిగిస్తోంది. OPT అవకాశం లేకపోతే 54% మంది విద్యార్థులు అమెరికా చదువుకు వెళ్లరని ఒక సర్వే తేల్చింది. అమెరికా డిగ్రీ తర్వాత అనుభవం, రాబడి కోరుకునే భారతీయ విద్యార్థులకు ఈ మార్పు తీవ్ర నిరాశను మిగిల్చింది.

H-1B వీసా సంస్కరణలు: యువతకు ప్రతికూలం

అధిక నైపుణ్యం కలిగిన ఉద్యోగులకు ఉద్దేశించిన H-1B వీసా విధానంలో మార్పులు కొత్త గ్రాడ్యుయేట్‌లకు ప్రతికూలంగా మారనున్నాయి. సీనియర్ ఉద్యోగులకు ప్రాధాన్యం ఇవ్వడం వల్ల యువ ఇంజినీర్లు, సాఫ్ట్‌వేర్ ప్రొఫెషనల్స్‌కు ఉద్యోగ అవకాశాలు తగ్గనున్నాయి.

H-1B వీసా ఫీజు భారీ పెంపు ప్రతిపాదన

H-1B వీసా ఫీజును ప్రస్తుతం ఉన్న $215 డాలర్ల నుంచి ఏకంగా $1 లక్ష డాలర్ల వరకు పెంచారు.. ఈ భారీ పెంపు ప్రతిపాదనలు ఉన్నత విద్య వ్యయాన్ని మరింత పెంచి, మధ్య తరగతి భారతీయ కుటుంబాలపై అదనపు భారం మోపుతున్నాయి.

వీసా ప్రక్రియలో అడ్డంకులు

ట్రంప్ విధానాలతో వీసా ఇంటర్వ్యూలను నిలిపివేయడం .. స్లాట్ల లభ్యతలో అస్పష్టత.. విద్యార్థుల సోషల్ మీడియా ప్రొఫైల్స్‌పై కఠినమైన తనిఖీలు చేపట్టడం.. వీసా తిరస్కరణ రేటు అకస్మాత్తుగా పెరగడం కూడా ప్రతికూల వాతావరణాన్ని సృష్టించింది.

* అమెరికన్ యూనివర్సిటీలపై ఆర్థిక ప్రభావం

భారత విద్యార్థులు అమెరికా ఆర్థిక వ్యవస్థకు.. విశ్వవిద్యాలయాలకు ట్యూషన్ ఫీజుల రూపంలో గణనీయమైన ఆర్థిక వనరులను అందిస్తున్నారు. ఈ ధోరణి కొనసాగితే ఆర్థికంగా ట్యూషన్‌ ఫీజులపై ఆధారపడిన మధ్య శ్రేణి కళాశాలలు.. చిన్న విశ్వవిద్యాలయాలు ఆర్ధిక సంక్షోభాన్ని ఎదుర్కొనే ప్రమాదం ఉంది. "ఈ ధోరణి కొనసాగితే అమెరికా ప్రపంచ ప్రతిభను ఆకర్షించే ప్రధాన కేంద్రంగా తన స్థానాన్ని కోల్పోయే ప్రమాదం ఉంది.

*విద్యార్థులు ఇతర దేశాల వైపు మొగ్గు

అమెరికాలో పెరుగుతున్న కఠిన నిబంధనల కారణంగా భారతీయ విద్యార్థులు ఇప్పుడు కెనడా, యూకే (UK), ఆస్ట్రేలియా వంటి మరింత ఆహ్వానించే.. మెరుగైన పోస్ట్-స్టడీ వర్క్ వీసా అవకాశాలున్న దేశాలను ఎంచుకునే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయని నిపుణులు విశ్లేషిస్తున్నారు.

అమెరికన్ ప్రభుత్వం, అంతర్జాతీయ విద్యార్థుల ఆందోళనలను పరిగణనలోకి తీసుకుని, వీలైనంత త్వరగా వలస విధానాలను సమీక్షించుకోకపోతే, అమెరికా తన విద్యా రంగంలో భారీ మూల్యం చెల్లించుకోవాల్సి వస్తుందని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.