హెచ్–1బీ కల కూలింది.. జీతం లేని పని మిగిలింది..
ఒకప్పుడు అవకాశాల దేశంగా భావించిన అమెరికా.. ప్రస్తుతం అంతర్జాతీయ విద్యార్థుల ముఖ్యంగా భారతీయ విద్యార్థుల పాలిట అనిశ్చితి దేశంగా మారుతోంది.
By: A.N.Kumar | 11 Oct 2025 4:00 PM ISTఒకప్పుడు అవకాశాల దేశంగా భావించిన అమెరికా.. ప్రస్తుతం అంతర్జాతీయ విద్యార్థుల ముఖ్యంగా భారతీయ విద్యార్థుల పాలిట అనిశ్చితి దేశంగా మారుతోంది. ఉన్నత చదువుల కోసం వేలాది డాలర్లు ఖర్చు చేసి, అమెరికన్ డ్రీమ్‌ను సాకారం చేసుకోవాలని ఆశించిన ఎంతోమంది ఇప్పుడు అన్‌పెయిడ్ వర్క్ (జీతం లేని పని) ఊబిలో కూరుకుపోతున్నారు.
* OPTలో అస్థిరత: నిరుద్యోగ భయం
అమెరికాలో చదువు పూర్తి చేసిన అంతర్జాతీయ విద్యార్థులకు లభించే తాత్కాలిక వర్క్ పర్మిట్ అయిన ఆప్షనల్ ప్రాక్టికల్ ట్రైనింగ్ (OPT)లో ఉన్న విద్యార్థుల్లో ఈ సమస్య తీవ్రంగా ఉంది. ఇటీవల ఒక ఎఫ్–1 వీసా విద్యార్థి సోషల్ మీడియాలో పంచుకున్న తన బాధాకరమైన అనుభవం వేలాది మంది విద్యార్థుల పరిస్థితిని ప్రతిబింబిస్తోంది.
ఆ విద్యార్థికి హెచ్–1బీ స్పాన్సర్‌షిప్ ఇస్తానని చెప్పిన యజమాని, ఆకస్మికంగా దానిని రద్దు చేశాడు. దీంతో విద్యార్థికి కేవలం 60 రోజుల నిరుద్యోగ గడువు మిగిలింది. ఈ గడువులోగా చెల్లింపు ఉద్యోగం దొరకకపోతే, అతని వీసా స్టేటస్ ప్రమాదంలో పడుతుంది. చివరికి దేశం విడిచి వెళ్లాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది.
* $100,000 ఫీజు షాక్: యజమానుల వెనుకంజ
ఈ సంక్షోభానికి ప్రధాన కారణాల్లో ఒకటి, ఇటీవల అమెరికా ప్రభుత్వం హెచ్–1బీ వీసా ఫీజును $100,000 కు పెంచుతామనే ప్రకటన చేయడమే. ఈ భారీ ఫీజు భారం కారణంగా కంపెనీలు విదేశీ విద్యార్థులను నియమించుకోవడానికి సంకోచిస్తున్నాయి. ఫీజు పెరిగే భయంతోనే చాలా మంది యజమానులు ఆన్‌బోర్డింగ్‌లను వాయిదా వేయడం లేదా పూర్తిగా రద్దు చేయడం చేస్తున్నారు.
$100,000 ఫీజు షాక్‌తో కంపెనీలు వెనక్కి తగ్గడంతో విద్యార్థికి మొదట వాలంటీర్‌గా చేసిన పని కాస్తా, చివరకు రద్దు అయ్యింది. హెచ్–1బీ స్పాన్సర్‌షిప్‌ను రద్దు చేసుకోవడం అనేది అంతర్జాతీయ విద్యార్థులకు పెద్ద ఎదురుదెబ్బ.
* బలవంతపు అన్‌పెయిడ్ వర్క్: కొత్త బానిసత్వం
వీసా చెల్లుబాటు కొనసాగించుకోవడానికి విద్యార్థులు నిస్సహాయంగా అన్‌పెయిడ్ వర్క్ వైపు మళ్లుతున్నారు. ఉద్యోగం లేని రోజులు పెరిగితే వీసా రద్దవుతుందనే భయంతో.. పూర్తిస్థాయి ఉద్యోగం మాదిరిగానే రోజువారీ అప్‌డేట్లు, డెడ్‌లైన్‌లు, పూర్తి సమయ పనిభారం ఉన్నప్పటికీ.. జీతం లేని స్టార్ట్‌అప్‌లలో లేదా కంపెనీలలో పనిచేస్తున్నారు. అన్‌పెయిడ్ వర్క్ అంటే భద్రత లేదు, ప్రేరణ లేదు. కనీస జీతం కోసం బ్రతకడం కూడా కష్టంగా మారింది.
వీసా స్టేటస్‌ను కాపాడుకోవడానికి విద్యార్థులు బలవంతంగా ఉచిత సేవలు అందించాల్సిన దుస్థితి ఏర్పడింది. భారతీయ విద్యార్థుల్లో ఇది ఇప్పుడు ఒక సాధారణ ధోరణిగా మారింది.
*భారత విద్యార్థుల దుస్థితి: అడుగడుగునా సవాళ్లు
OPTలో ఉన్నవారికి నిరుద్యోగ దినాల పరిమితి ఉండటంతో హెచ్–1బీ నియమాల కఠినతరం.. కొత్త ఫీజుల భయం కారణంగా భారతీయ విద్యార్థులు తీవ్ర ఒత్తిడిని ఎదుర్కొంటున్నారు. హెచ్–1బీ నిబంధనలు కఠినతరం కావడంతో యజమానులు వీదేశీ విద్యార్థులను నియమించుకోవడానికి సంకోచించడంతో.. ఉద్యోగాలు దొరకడం మరింత కష్టమవుతోంది.
ఒకప్పుడు అవకాశాల స్వర్గంగా భావించిన అమెరికా, ఇప్పుడు అనిశ్చితికి చిరునామాగా మారింది. చదువు పూర్తి చేసిన తర్వాత స్థిరమైన ఉద్యోగం దొరకకపోతే.. అన్‌పెయిడ్ వర్క్ చేస్తూ బ్రతకడం తప్ప మరో మార్గం లేకుండా పోవడం దురదృష్టకరం.
