రిటర్న్ ఇండియా.. విదేశాల్లోని 81% మంది ‘హోమ్‌సిక్’ కుర్రాళ్ళ అసలు కథ ఇదీ
తాజాగా ఆక్స్‌ఫర్డ్ ఇంటర్నేషనల్ వారు నిర్వహించిన ‘స్టూడెంట్ గ్లోబల్ మొబిలిటీ ఇండెక్స్’ సర్వే ఒక షాకింగ్ విషయాన్ని బయటపెట్టింది.
By: A.N.Kumar | 8 Aug 2026 3:34 PM ISTవిదేశాలకు వెళ్లి చదువుకోవాలనే ఆశ ప్రతి ఇంట్లోనూ కామనే.. పాస్‌పోర్ట్ చేతిలో పడటం ఆలస్యం.. అమెరికా, కెనడా, యూకే, ఆస్ట్రేలియా విమానాలు ఎక్కేయడమే ఆలస్యం.. మెరుగైన విద్య, భారీ ఆఫర్లు, అంతర్జాతీయ లైఫ్‌స్టైల్ అనుకోవచ్చు. కానీ వీరంతా అక్కడే మూటముల్లె సర్దేసుకుని పర్మనెంట్ గూడు కట్టేస్తారని అనుకుంటే మీరు పొరపాటో పప్పులో కాలో వేసినట్లే.
తాజాగా ఆక్స్‌ఫర్డ్ ఇంటర్నేషనల్ వారు నిర్వహించిన ‘స్టూడెంట్ గ్లోబల్ మొబిలిటీ ఇండెక్స్’ సర్వే ఒక షాకింగ్ విషయాన్ని బయటపెట్టింది. ఈ సర్వేలో పాల్గొన్న 17,925 మంది విద్యార్థులలో ఏకంగా 81 శాతం మంది చదువు పూర్తవ్వగానే “మన దేశమే మేలురా సామీ” అంటూ భారత్‌కు తిరిగి వచ్చేస్తామని చెప్పారట!
పిజ్జాలు, బర్గర్లు తిన్నా.. పప్పుచారు కాదనలేరు..
విదేశాలకు వెళ్లేటప్పుడు ఇన్స్టాగ్రామ్ రీల్స్, ఎయిర్‌పోర్ట్ పోజులు భలే ఆకర్షణీయంగా ఉంటాయి. కానీ తీరా అక్కడికి వెళ్లాక సొంతంగా వంట వండుకోవడం, గిన్నెలు తోముకోవడం, సున్నా డిగ్రీల చలిలో పనులేసుకోవడం గుర్తొచ్చాకే ఈ 'దేశభక్తి' లేదా 'హోమ్‌సిక్' నిద్రలేస్తుందేమో.. "విదేశీ చదువు కేవలం స్కిల్స్, ఎక్స్‌పోజర్ కోసమే తప్ప అక్కడ శాశ్వతంగా పాతుకుపోవడానికి కాదు" అని ఈ 81% మంది మహాశయులు చెబుతున్నారు.
ఇక మిగిలిన 15 శాతం మంది మాత్రం “చదువయ్యాక ఏదో ఒక ఉద్యోగానికి అప్లై చేస్తాంలే” అని కవర్ చేశారు. అయితే ఆ ఉద్యోగం హైదరాబాద్‌లో చేస్తారా లేక న్యూయార్క్‌లో చేస్తారా అనేది మాత్రం సస్పెన్స్‌గానే ఉంచారు.
మాటలు ఓకే.. మరి చేతలు?
సర్వే ఫలితాలు సరే కానీ ఇక్కడొక చిన్న లాజిక్ ఉంది. విమానం ఎక్కే ముందు ప్రతీ ఒక్కరూ “చదువుకుని తిరిగొచ్చేస్తా అమ్మో!” అనే చెప్తారు. కానీ తీరా అక్కడ డాలర్లలోనో, పౌండ్లలోనో జీతం చేతికి రావడం మొదలయ్యాక.. వీకెండ్ పార్టీలు, మెరుగైన కార్లు, లైఫ్‌స్టైల్ అలవాటయ్యాక.. మనస్సు మెల్లగా మారుతుంది. విదేశాల్లో కొన్నాళ్ళు పనిచేసి మంచి ప్యాకేజీ రాగానే "మరో రెండేళ్ళు ఉండిపోదాం" అనే లూప్‌లో పడిపోతుంటారు. పెళ్లిళ్లు, స్నేహితులు, ఆస్తులు అని అక్కడ సామాజిక మూలాలు గట్టిపడ్డాక ఈ 81% కాస్తా ఎంత శాతానికి పడిపోతుందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు!
మొత్తానికి "విదేశీ విద్య అంటే కేవలం సెటిల్ అవ్వడమే కాదు, గ్లోబల్ ఎక్స్‌పోజర్ సాధించి తిరిగి వచ్చి ఇక్కడే జెండా పాతడం" అనే ఆలోచన నేటి యూత్‌లో పెరగడం శుభపరిణామమే. కాకపోతే ఈ 81 శాతం మందిలో ఎంతమంది నిజంగా వాపస్ వస్తారు, ఎంతమంది డాలర్ల మోజులో అక్కడే 'పర్మనెంట్' అయిపోతారో కాలమే సమాధానం చెప్పాలి.
