Begin typing your search above and press return to search.

స్టెమ్ ఓపీటీ ఈఏడీ కార్డు ఆలస్యం: విద్యార్థుల్లో ఆందోళన

యూఎస్.సీఐఎస్ 'ఎమ్మా’ లైవ్ చాట్ ద్వారా సంప్రదించి లైవ్ ఏజెంట్‌తో మాట్లాడాలి. వారికి అంతర్గత ట్రాకింగ్ సమాచారం లేదా ఇంకా జనరేట్ కాని యూఎస్.పీఎస్ నంబర్ వివరాలు అందుబాటులో ఉండవచ్చు.

By:  A.N.Kumar   |   13 Nov 2025 11:49 PM IST
స్టెమ్ ఓపీటీ ఈఏడీ కార్డు ఆలస్యం: విద్యార్థుల్లో ఆందోళన
X

అమెరికాలో స్టెమ్ ఓపీటీ (ఆప్షనల్ ప్రాక్టికల్ ట్రైనింగ్ ) ఎక్స్‌టెన్షన్ కోసం ఎదురుచూస్తున్న భారతీయ విద్యార్థులు ప్రస్తుతం తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. యూఎస్.సీ.ఐ.ఎస్ (యూఎస్ సిటీజన్ షిప్ మరియు ఇమిగ్రేషన్ సర్వీసెస్) వ్యవస్థలో నెలకొన్న అనిశ్చితి, కార్డు పంపిణీలో ఆలస్యం వల్ల వారి ఉద్యోగ జీవితం ప్రభావితమవుతోంది. ముఖ్యంగా దరఖాస్తు ఆమోదం పొందినా ఈఏడీ (ఎంప్లాయి మెంట్ ఆథరైజేషన్ డాక్యుమెంట్) కార్డు భౌతికంగా అందకపోవడం వల్ల ఉద్యోగంలో చేరేందుకు అడ్డంకులు ఏర్పడుతున్నాయి.

*ఆమోదం వచ్చినా... ఉద్యోగం ప్రారంభించలేని దుస్థితి

ఎఫ్-1 వీసాపై ఉన్న విద్యార్థులకు ఈఏడీ కార్డు ఉద్యోగం ప్రారంభించడానికి అత్యంత ముఖ్యమైన పత్రం. స్టెమ్ ఓపీటీ నిబంధనల ప్రకారం.. ఈ కార్డు లేకుండా ఉద్యోగంలో చేరడం సాధ్యం కాదు. కార్డు స్టేటస్ 'కార్డ్ ప్రొడ్యూసెడ్’ అని చూపించినా.. భౌతికంగా అందకపోవడం వల్ల ఉద్యోగ సంస్థలు జాయినింగ్‌ను ఆలస్యం చేస్తున్నాయి. దీంతో నిర్ణీత జాయినింగ్ తేదీ ఆలస్యం అవుతుంది. ఉద్యోగం కోల్పోయే ప్రమాదం లేదా నిరవధికంగా సెలవు తీసుకోవాల్సిన పరిస్థితి ఏర్పడుతోంది.

* ఎఫ్-1 స్టేటస్‌పై ప్రభావం

ఉద్యోగం లేకుండా ఉన్న రోజులు లెక్కలోకి రావడం ప్రారంభమవుతుంది. ఇది మొత్తం F-1 స్టేటస్‌పై ప్రభావం చూపుతుంది. కెరీర్ టైమ్‌లైన్‌కు నష్టం కలుగుతుంది. విద్యార్థుల భవిష్యత్ ప్రణాళికలు దెబ్బతింటాయి.

* ట్రాకింగ్ నంబర్ లేమి: నిపుణుల అభిప్రాయం

'కార్డ్ ప్రొడ్యూసెడ్' అని చూపించినా ట్రాకింగ్ వివరాలు వెంటనే రాకపోవడం ఇటీవల పెరిగిన సమస్య. ఇమ్మిగ్రేషన్ నిపుణుల ప్రకారం.. ఇది యూఎస్.సీఐఎస్ వ్యవస్థలోని కమ్యూనికేషన్/డిస్పాచ్ లాగ్ వల్ల జరుగుతోంది. కార్డు ప్రింట్ అయినా దాన్ని యూఎస్.పీఎస్ (యునైటెడ్ స్టేట్స్ పోస్టల్ సర్వీసెస్) కు పంపే ప్రక్రియ , ట్రాకింగ్ నంబర్‌ను ఆన్‌లైన్ సిస్టమ్‌లో అప్‌డేట్ చేసే ప్రక్రియ మధ్య గ్యాప్ ఉంటోంది. కొన్ని సందర్భాల్లో విద్యార్థులు ట్రాకింగ్ నంబర్ రాకముందే కార్డులను అందుకున్న ఉదాహరణలు కూడా ఉన్నాయి. యూఎస్.సీఐఎస్ ప్రకారం.. సాధారణంగా ఆమోదం పొందిన తర్వాత 30 రోజుల వరకు కార్డు రాకపోతేనే విచారణ జరపాలి.

* సంక్షోభం నుంచి బయటపడేందుకు చర్యలు

యూఎస్.సీఐఎస్ 'ఎమ్మా’ లైవ్ చాట్ ద్వారా సంప్రదించి లైవ్ ఏజెంట్‌తో మాట్లాడాలి. వారికి అంతర్గత ట్రాకింగ్ సమాచారం లేదా ఇంకా జనరేట్ కాని యూఎస్.పీఎస్ నంబర్ వివరాలు అందుబాటులో ఉండవచ్చు. కార్డు 'ప్రొడ్యూసెడ్’ అని చూపించి 7 నుండి 10 రోజులు కొందరి ప్రకారం 30 రోజులు దాటినా రాకపోతే.. యూఎస్.సీఐఎస్ ఈ-రెక్వెస్ట్ సెల్ఫ్ సర్వీసెస్ టూల్స్ ద్వారా "నాన్ డెలివరీ ఆఫ్ కార్డ్ ’ కేటగిరీ కింద సర్వీస్ రిక్వెస్ట్‌ను ఫైల్ చేయాలి.

స్థానిక యూఎస్.సీఐఎస్ ను సంప్రదించాలి. కొన్ని కార్డులు స్కానింగ్ తప్పిదాల వల్ల యూఎస్.సీఐఎస్ సిస్టమ్‌లో రిఫ్లెక్ట్ కాకపోయినా.. స్థానిక పోస్ట్ ఆఫీసు వద్ద ఉండవచ్చు. యూఎస్.పీఎస్ ఇన్ఫార్మెడ్ డెలివరీ కోసం రిజిస్టర్ చేసుకోవడం కూడా మంచిది.

ఉద్యోగ సంస్థతో చర్చలు జరపాలి. హెచ్ఆర్ విభాగానికి ఆమోద నోటీసు (ఐ--797సీ) , 'కార్డ్ ప్రొడ్యూసెడ్’ స్టేటస్ స్క్రీన్‌షాట్‌ను పంపి పరిస్థితిని వివరించాలి. కొన్ని సంస్థలు యూఎస్.సీఐఎస్ రిసిప్ట్ నోటీసు ఆధారంగా తాత్కాలికంగా జాయినింగ్‌కు అనుమతించవచ్చు లేదా జాయినింగ్‌ను కొద్ది రోజులు పొడిగించవచ్చు.

* తక్షణ జోక్యం అవసరం

యూఎస్.సీఐఎస్ వ్యవస్థలో ఈ తరహా 'అన్ ఎక్స్ ప్లేయిన్డ్ డిలేస్’ విద్యార్థులను నిస్సహాయ స్థితికి నెడుతున్నాయి. ఈఏడీ కార్డు లేకపోవడం వల్ల ఉద్యోగ అవకాశాలు కోల్పోవడం, నిరుద్యోగ గడువు పెరగడం వంటి పరిణామాలు విద్యార్థుల మానసిక ఒత్తిడిని పెంచుతున్నాయి. ఈ సమస్యపై యూఎస్.సీఐఎస్ తక్షణమే స్పందించి.. ట్రాకింగ్ సమాచారం అప్‌డేట్‌లో ఉన్న లోపాన్ని సరిదిద్ది, ఈఏడీ కార్డులను సత్వరం విద్యార్థులకు చేరేలా చర్యలు తీసుకోవాలని విద్యార్థి సంఘాలు డిమాండ్ చేస్తున్నాయి.