భారత్ వదిలి వెళ్తున్న వారి సంఖ్య పెరుగుతోంది.. ఎందుకంటే
విద్య మానవాభివృద్ధిలో చాలా కీలకమైన అంశం. దేశాభివృద్ధికి పునాదులు తరగతి గదుల్లోనే పడతాయి. కానీ బాధాకరమైన విషయం ఏంటంటే.. విద్యారంగంపైన పాలకుల చిన్నచూపు.
By: A.N.Kumar | 10 Jan 2026 6:00 PM ISTవిద్య మానవాభివృద్ధిలో చాలా కీలకమైన అంశం. దేశాభివృద్ధికి పునాదులు తరగతి గదుల్లోనే పడతాయి. కానీ బాధాకరమైన విషయం ఏంటంటే.. విద్యారంగంపైన పాలకుల చిన్నచూపు. విద్యారంగాన్ని ఒక పెట్టుబడిగా పాలకులు చూడటం లేదు. ఆర్థికాభివృద్ధి సాధించాలంటే ముందుగా విద్యాభివృద్ధి జరగాలి. తాజాగా విద్యారంగంపై పాలకుల చిన్నచూపును నీతిఆయోగ్ అంకెలు తేటతెల్లం చేశాయి. మన దేశం నుంచి విదేశాలకు చదువు కోసం 25 మంది వెళ్తుంటే.. అదే సమయంలో మన దేశానికి కేవలం ఒకరు మాత్రమే వస్తున్నారు. ఇది తోసిపుచ్చలేని నిజం. మన వ్యవస్థలో ఉన్న లోపాలను ఎత్తిచూపుతున్న లెక్క. అభివృద్ధి అంటే.. కేవలం ప్రాజెక్టులు కట్టడం, రాజధానులు నిర్మించడం, ఫ్యాకర్టీలు స్థాపించడం మాత్రమే కాదు. వీటన్నింటినీ మించినది విద్యారంగంపై పెట్టుబడి పెట్టడం. ప్రైవేటు వారు పెట్టుబడి పెడితే లాభాలే పరమావధి అవుతుంది. కాబట్టి ప్రభుత్వమే విద్యారంగంపై పెట్టుబడి పెట్టాలి. అది దీర్ఘకాల పెట్టుబడి కావాలి. ఫలితం కూడా దీర్ఘకాలంలోనే ఉంటుంది.
దేశ నిర్మాణం జరగాలంటే ముందుగా పాఠశాలలపై పెట్టుబడిపెట్టాలి. అది కూడా ప్రభుత్వరంగంలోనే. పిపిపి మోడల్ లో కాదు. మన దేశానికి బంగ్లాదేశ్, నేపాల్, ఆఫ్రికా లాంటి దేశాల విద్యార్థులు వస్తుంటే.. మన దేశం నుంచి అమెరికా, ఇంగ్లండ్, ఆస్ట్రేలియా, జర్మనీ లాంటి దేశాలకు వెళ్తున్నారు. అక్కడ లక్షలు పోసి చదువుతున్నారు. దీనికి కారణం చదువుకు తగ్గ ఉద్యోగం ఆయా దేశాల్లో దొరకడమే. మన దేశానికి విదేశీ విద్యార్థులు రావడానికి కారణం.. వారి దేశంలో కంటే మనదేశంలోనే ఉన్నత విద్య చౌక. మన దేశం నుంచి ఖరీదైన దేశాలకు మన విద్యార్థులు వెళ్తున్నారంటే.. ఇక్కడ అవసరమైన సదుపాయాలు లేవు. ఈ తేడాను గమనిస్తే పాలకులు ఏం చేయాలో అర్థమవుతుంది. దేశంలో ఉన్నత విద్యపై పెట్టుబడి పెట్టాలి. ప్రపంచ స్థాయి ప్రమాణాలతో యూనివర్శీటీలు ఉండాలి. అందుకు తగ్గ బోధనాసిబ్భంది ఉండాలి. అన్ని రకాలు సదుపాయాలు ప్రపంచ స్థాయిలో ఉండాలి. అప్పుడే మన దేశానికి విదేశీ విద్యార్థులు వస్తారు.
సాధారణంగా దేశీయ వాణిజ్యంలో ఎగుమతులు పెరిగితే దేశానికి లాభం. దిగుమతులు పెరిగితే నష్టం. కానీ విద్యారంగంలో ఇది రివర్స్ లో ఉంటుంది. మన దేశం నుంచి విద్యార్థులు విదేశాలకు వెళ్తే అది మనకి నష్టం. విదేశాల నుంచి మనదేశానికి వస్తే లాభం. విదేశాలకు మనం వెళ్తే డాలర్లు కొనాలి. అదే వాళ్లు వస్తే డాలర్లుతో మన రూపాయలు కొనాలి. అప్పుడు మన దగ్గర విదేశీ మారక నిల్వలు పెరుగుతాయి. వాణిజ్య లోటు తగ్గుతుంది. అది జరగాలంటే ప్రపంచ స్థాయి విద్యనివ్వాలి. ఆ రంగంపై పెట్టుబడులు పెట్టాలి. అప్పుడు రెండు లాభాలు. మన విద్యార్థులు ఇక్కడే ఉంటారు. విదేశీ విద్యార్థులు వస్తారు. ఇక్కడ మరొక చిన్న అడిషన్. కేవలం ప్రపంచ స్థాయి విద్య అందించడం మాత్రమే కాదు.. ఆ చదువుకు తగ్గ ఉద్యోగం కల్పించే డెస్టినేషన్ కావాలి మన దేశం. అప్పుడే అభివృద్ధి సాధ్యం. లేదంటే మళ్లీ ఇంకో దేశానికి మన విద్యార్థులు ఉద్యోగం కోసం వెళ్లాలి.
విద్యారంగంపై ప్రభుత్వ పెట్టుబడులు ప్రాధాన్యతాక్రమంలో మొదటి వరుసలో ఉండాలి. ఆ తర్వాత విద్యకు తగ్గ ఉద్యోగం అందించే విధంగా పరిశ్రమల స్థాపన జరగాలి. ప్రపంచ స్థాయి సౌకర్యాలు కల్పించాలి. తద్వారా ఆర్థికాభివృద్ధి సాధ్యమవుతుంది. నీతి ఆయోగ్ లెక్కలు చెబుతున్న సూచన ఇదే. వాస్తవం ఇదే. కానీ ఇది దీర్ఘకాల ప్రక్రియ. అందుకే పాలకులు దీనిపై దృష్టి పెట్టడంలేదేమో.
