Begin typing your search above and press return to search.

టెక్సాస్ లో కారణం లేకుండానే తెలుగు విద్యార్థిని కాల్చేశారు

ఫోర్ట్ వర్త్ పోలీస్ విభాగం విడుదల చేసిన పత్రికా ప్రకటనలో నిందితుడి వాహనంలో ఒక గన్‌ను కూడా స్వాధీనం చేసుకున్నట్లు తెలిపారు.

By:  A.N.Kumar   |   7 Oct 2025 12:16 PM IST
టెక్సాస్ లో కారణం లేకుండానే తెలుగు విద్యార్థిని కాల్చేశారు
X

అమెరికాలోని డల్లాస్, టెక్సాస్‌లో గత వారం జరిగిన ఒక ఘోర ఘటనలో, హైదరాబాదుకు చెందిన యువకుడు, చంద్రశేఖర్ పోల్ (28) మృతి చెందడం సంచలనం సృష్టించింది. పార్ట్‌టైమ్ ఉద్యోగం చేస్తుండగా ఈ దారుణం జరిగింది. అమెరికన్ పోలీసులు ఈ హత్య కేసులో నిందితుడిని అరెస్టు చేశారు.

పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. 28 ఏళ్ల చంద్రశేఖర్ పోల్‌పై 23 ఏళ్ల రిచర్డ్ ఫ్లోరేజ్ కారణం లేకుండా గన్‌తో కాల్పులు జరిపాడు. చంద్రశేఖర్ ఆ సమయంలో తన పార్ట్‌టైమ్ పనిలో ఉన్నారని పోలీసులు పేర్కొన్నారు.

నిందితుడి అరెస్ట్.. విచారణ

హత్య అనంతరం ఫ్లోరేజ్ సంఘటనా స్థలం నుండి పారిపోయి, ఆ తర్వాత మరో కారుపై కూడా కాల్పులు జరిపాడు.. అయితే అందులో ఎవరూ గాయపడలేదు. చివరకు ఒక గేట్‌కు ఢీకొట్టి, సమీపంలోని నివాసంలోకి ప్రవేశించడానికి ప్రయత్నించినప్పుడు పోలీసులు అతన్ని అదుపులోకి తీసుకున్నారు.

ఫోర్ట్ వర్త్ పోలీస్ విభాగం విడుదల చేసిన పత్రికా ప్రకటనలో నిందితుడి వాహనంలో ఒక గన్‌ను కూడా స్వాధీనం చేసుకున్నట్లు తెలిపారు. నిందితుడు ప్రస్తుతం ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నప్పటికీ, అతన్ని హత్య కేసులో బుక్ చేసినట్లు పేర్కొన్నారు. టారెంట్ కౌంటీ మెడికల్ ఎగ్జామినర్ కార్యాలయం చంద్రశేఖర్ మరణాన్ని ధృవీకరించింది, బాధితుడు ఘటనా స్థలంలోనే మరణించినట్లు వెల్లడించింది. ఇప్పటివరకు హత్యకు కారణం స్పష్టంగా తెలియకపోవడంతో, పోలీసులు దీనిపై సమగ్ర విచారణ చేస్తున్నారు.

*కుటుంబానికి మద్దతు

చంద్రశేఖర్ పోల్ BDS పూర్తి చేసిన తరువాత MS కోర్సు చేయడానికి అమెరికాకు వచ్చారు. ఆరు నెలల క్రితం డిగ్రీని పూర్తి చేసి, ఉద్యోగం కోసం ప్రయత్నిస్తున్నారు. తన ఖర్చుల కోసం పార్ట్‌టైమ్‌గా ఆ గ్యాస్ స్టేషన్‌లో పని చేస్తున్నట్లు ఆయన సోదరుడు దమోదర్ పోల్ తెలిపారు.

ఈ విషాద సమయంలో హ్యూస్టన్‌లోని భారత కాన్సులేట్ జనరల్ బాధిత కుటుంబంతో సంప్రదింపులు జరుపుతోంది. మృతదేహాన్ని భారతదేశానికి తరలించడంలో సహాయం చేస్తామని కాన్సులేట్ హామీ ఇచ్చింది. మృతదేహాన్ని తరలించడానికి, కుటుంబానికి మద్దతు ఇవ్వడానికి గోఫండ్‌మీ కాంపెయిన్ కూడా ప్రారంభించబడింది.

* భద్రతపై పెరుగుతున్న ఆందోళన

భారతీయ-అమెరికన్ కమ్యూనిటీ సభ్యులు, విద్యార్థులు ఈ హత్యపై తీవ్ర ఆశ్చర్యం, భయం వ్యక్తం చేశారు. అమెరికాలోని భారతీయ విద్యార్థులపై పెరుగుతున్న హింసాత్మక ఘటనలు భద్రతా సమస్యలను మరోసారి తెరపైకి తెచ్చాయి. ముఖ్యంగా రాత్రి సమయంలో పార్ట్‌టైమ్ ఉద్యోగాలు చేసే విద్యార్థులు ప్రమాదాలకు గురయ్యే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయని అధికారులు అభిప్రాయపడ్డారు.

గతంలో కూడా అమెరికాలో భారతీయ విద్యార్థులపై జరిగిన కొన్ని హత్యలు, అనుమానాస్పద మరణాలు భద్రతా సమస్యలను గుర్తుచేశాయి. ఈ ఘటన అంతర్జాతీయ విద్యార్థుల భద్రతపై మరింత జాగ్రత్తలు తీసుకోవాల్సిన అవసరాన్ని స్పష్టంగా తెలియజేస్తోంది.