హార్ముజ్ లో నెత్తురోడిన సముద్రం: ఇరాన్-అమెరికా బలగాల కాల్పుల్లో భారతీయ నావికుడు దుర్మరణం
దుబాయ్‌లోని భారత కాన్సులేట్ ఈ ఘటనపై అధికారిక ప్రకటన విడుదల చేసింది. మరణించిన వ్యక్తి భారతీయుడేనని ధృవీకరించింది. "భారతీయ నావికుడు అల్తాఫ్ మృతి చెందడం అత్యంత బాధాకరం.
By: A.N.Kumar | 9 May 2026 12:23 PM ISTఅంతర్జాతీయ వాణిజ్యానికి అత్యంత కీలకమైన, వ్యూహాత్మకమైన హార్ముజ్ జలసంధి మరోసారి రణరంగంగా మారింది. ఇరాన్, అమెరికా బలగాల మధ్య చోటుచేసుకున్న భీకర కాల్పుల ఘటనలో ఒక భారతీయ నావికుడు బలికావడం తీవ్ర విషాదాన్ని నింపింది. ఈ క్రాస్‌ఫైర్‌లో అల్తాఫ్ తలబ్ కెర్ అనే భారతీయ నావికుడు ప్రాణాలు కోల్పోయారు. ఈ ఘటన సముద్ర మార్గాల్లో ప్రయాణించే వాణిజ్య నౌకల భద్రతపై ప్రపంచవ్యాప్తంగా పెను ఆందోళనలను రేకెత్తించింది.
క్రాస్‌ఫైర్‌లో చిక్కుకున్న ‘అల్‌ఫైజ్ నూర్ సులేమానీ’
దుబాయ్ రేవు నుంచి నిత్యావసర సరుకులతో యెమెన్ దేశానికి బయలుదేరిన ‘అల్‌ఫైజ్ నూర్ సులేమానీ’ అనే కార్గో నౌకలో అల్తాఫ్ సెయిలర్‌గా పనిచేస్తున్నాడు. గురువారం నాడు ఈ నౌక హార్ముజ్ జలసంధి మీదుగా ప్రయాణిస్తున్న సమయంలో ఆ ప్రాంతంలో అప్పటికే మోహరించి ఉన్న ఇరాన్ కోస్ట్ గార్డ్ , అమెరికా నౌకాదళ బలగాల మధ్య అకస్మాత్తుగా కాల్పులు ప్రారంభమయ్యాయి. దురదృష్టవశాత్తూ ఈ రెండు దేశాల బలగాల మధ్య జరుగుతున్న కాల్పుల మధ్యలోకి ఈ వాణిజ్య నౌక వెళ్ళింది. తూటాల వర్షం కురుస్తున్న సమయంలో నౌకపై ఉన్న అల్తాఫ్ తీవ్రంగా గాయపడ్డారు. గాయాల తీవ్రత ఎక్కువగా ఉండటంతో ఆయన అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయినట్లు నౌకాయాన వర్గాలు వెల్లడించాయి.
17 మంది సిబ్బందిని రక్షించిన ‘ప్రేమ్ సాగర్’
ఈ పెను ప్రమాదం జరిగిన వెంటనే సమీపంలో ఉన్న ‘ప్రేమ్ సాగర్’ అనే మరో నౌక అప్రమత్తమైంది. కాల్పుల నుంచి తప్పుకున్న ‘అల్‌ఫైజ్ నూర్ సులేమానీ’ నౌకలోని మిగిలిన 17 మంది సిబ్బందిని ‘ప్రేమ్ సాగర్’ సిబ్బంది అతికష్టమ్మీద రక్షించారు. బాధితులందరినీ సురక్షితంగా దుబాయ్‌కు తరలించారు. ప్రస్తుతం వారంతా ప్రాణాపాయం నుంచి తప్పించుకున్నారని.. అయితే తోటి నావికుడు కళ్లముందే మరణించడంతో వారంతా తీవ్ర దిగ్భ్రాంతిలో ఉన్నారని సమాచారం.
భారత కాన్సులేట్ స్పందన.. విదేశాంగ శాఖ చర్యలు
దుబాయ్‌లోని భారత కాన్సులేట్ ఈ ఘటనపై అధికారిక ప్రకటన విడుదల చేసింది. మరణించిన వ్యక్తి భారతీయుడేనని ధృవీకరించింది. "భారతీయ నావికుడు అల్తాఫ్ మృతి చెందడం అత్యంత బాధాకరం. మిగిలిన 17 మంది భారతీయ సిబ్బందిని సురక్షితంగా ఒడ్డుకు చేర్చాం. వారికి అవసరమైన అన్ని వైద్య సహాయాలు, కౌన్సెలింగ్ అందిస్తున్నాం" అని కాన్సులేట్ ప్రతినిధులు తెలిపారు.
మరోవైపు భారత విదేశాంగ శాఖ ఈ వ్యవహారాన్ని తీవ్రంగా పరిగణిస్తోంది. అల్తాఫ్ స్వస్థలం, కుటుంబ వివరాలను సేకరించి, వారిని సంప్రదించేందుకు ప్రయత్నిస్తున్నారు. మృతదేహాన్ని వీలైనంత త్వరగా భారత్‌కు తరలించేందుకు దౌత్యపరమైన చర్యలు ముమ్మరం చేశారు.
అంతర్జాతీయ ఆందోళనలు.. హార్ముజ్ జలసంధి ఎందుకంత కీలకం?
ప్రపంచవ్యాప్తంగా రవాణా అయ్యే చమురులో దాదాపు 20 శాతం వాటా ఒక్క హార్ముజ్ జలసంధి ద్వారానే జరుగుతుంది. పర్షియన్ గల్ఫ్ , గల్ఫ్ ఆఫ్ ఓమన్‌లను కలిపే ఈ సన్నని సముద్ర మార్గంపై పట్టు కోసం ఇరాన్, అమెరికా మధ్య దశాబ్దాలుగా ఘర్షణ వాతావరణం నెలకొంది. గతంలోనూ ఇక్కడ వాణిజ్య నౌకలను ఇరాన్ స్వాధీనం చేసుకోవడం లేదా అమెరికా డ్రోన్లను కూల్చివేయడం వంటి ఘటనలు జరిగాయి. తాజాగా జరిగిన కాల్పుల ఘటనతో సముద్ర మార్గాల్లో పనిచేస్తున్న వేలమంది భారతీయ నావికుల భద్రత ప్రశ్నార్థకంగా మారింది. ఇక్కడ ఉద్రిక్తతలు పెరిగితే అంతర్జాతీయ మార్కెట్లో చమురు ధరలు పెరిగే అవకాశం ఉంది.
ఒక సామాన్య నావికుడు దేశాలు.. సైన్యాల మధ్య జరిగే ఆధిపత్య పోరులో బలికావడం మానవతావాదులను కలచివేస్తోంది. భారత ప్రభుత్వం ఈ ఘటనపై ఇరాన్ , అమెరికా ప్రభుత్వాలతో మాట్లాడి, భవిష్యత్తులో ఇలాంటి పొరపాట్లు జరగకుండా కఠినమైన భద్రతా నిబంధనలు అమలు చేయాలని నావికుల సంఘాలు డిమాండ్ చేస్తున్నాయి. అల్తాఫ్ మృతికి దేశవ్యాప్తంగా ప్రజలు సంతాపం ప్రకటిస్తున్నారు.
