Begin typing your search above and press return to search.

రూపాయీ... ఏమైంది నీకు...

రెండో ప్రపంచయుద్ధానంతరం భారత్ లో మధ్య తరగతి శకం ప్రారంభమైందని చెప్పాలి. అటు మరీ పేదలు కాకుండా...ఇటు మరీ ధనవంతులు కా మధ్యస్థంగా ఉన్నవారికి మధ్యతరగతి ప్రజలుగా గుర్తించారు.

By:  Tupaki Political Desk   |   16 Dec 2025 1:43 PM IST
రూపాయీ... ఏమైంది నీకు...
X

అమెరికాలో డాలర్లు పండును...ఇండియాలో సంతానం పండును అని కవి తిలక్ అన్నట్లు ఇండియాలో రూపాయి నానాటికి బక్కచిక్కిపోతోంది. కర్ణుడి చావుకు కారణాలు అనేకం అన్నట్లు...మన రూపాయి నానాటికీ చతికిల పడటానికి కారణాలు ఎన్నో. పెరుగుతున్న దేశ జనాభా...అంతకన్నా పెరుగుతున్న పేదరికం. ప్రజల తలసరి ఆదాయం పడిపోవడం...నిరుద్యోగ సమస్య పెనుభూతంలా మారిపోతుండటంతో...రూపాయి మనకు బై బై అంటోంది. అమెరికా డాలర్ మాత్రం వైట్ఎలిఫెంట్ లా నానాటికీ బరువు పెరుగుతునే ఉంది. తాజాగా మన రూపాయి మరింత బక్కగై...అయిదుపైసలు క్షీణించడంతో డాలర్ తోపోలిస్తే...రూపాయి విలువ మంగళవారం ఏకంగా 36 పైసలు తగ్గి రూ.91.14.. లైఫ్ టైమ్ కనిష్టానికి జారిపోయింది. మరింత వేగంగా రూ.91 దాకా వెళ్ళిపోయినా ఆశ్చర్యపోనక్కర్లేదంటున్నారు మన దేశ ఆర్థిక నిపుణులు.

మన రూపాయి మొదట్నుంచి ఇంత క్షీణతతో లేదనే చెప్పాలి. మన దేశానికి స్వాతంత్ర్యం వచ్చినపుడు 1947లో డాలర్ ఎక్స్ ఛేంజి విలువ...రూ.3.30గా ఉండేది. అయితే క్రమంగా రూపాయి పతనమవుతూ వస్తోంది. పుంజుకున్న సందర్భాలు చాలా తక్కువ అని చెప్పాలి. ఇపుడు అమెరికన్ డాలర్ విలువ ఏకంగా రూ.91.14కి చేరుకుందంటే మన రూపాయి ఏ లోయలో మూల్గుతోందో అర్థం చేసుకోవచ్చు. అయితే ఈ పతనం ఇంతటితో ఆగుతుందన్న నమ్మకం లేదు. ఇది ఇలాగా పాతాళం మన పైకి వచ్చేదాకా జారుతునే ఉంటుంది. వాస్తవానికి 1949 నుంచి 1966 దాకా usd-inr ఎక్స్ చేంజి రేటు రూ.4.76 వద్ద స్థిరంగా కొనసాగింది. ఆ తర్వాతే నానాటికీ తీసికట్టు నాగంబొట్లులా తయారైంది. 1950లో రూపాయికి 16 ఆణాలు, 64 పైసలుగా విభజించారు. ఆ తర్వాత రూపాయికి వంద పైసలన్నారు. అయితే ఈ దుర్గతి కేవలం మన రూపాయికి మాత్రమేనా అంటే లేదు అమెరికన్ డాలర్ కూడా ద్రవ్యోల్బణానికి గురైనట్లు తెలుస్తోంది.

మరి కొందరు స్వాతంత్ర్యం వచ్చినపుడు డాలర్...రూపాయి రెండు సమానంగా ఉండేవని వాదించేవారూ ఉన్నారు. అయితే ఆధికారిక రికార్డుల ప్రకారం అది ఎప్పటికీ జరగలేదనే చెప్పాలి. స్వాతంత్రానికి ముందు భారత్ బ్రిటిష్ పాలనలో ఉండేది కాబట్టి పౌండ్ విలువ అధికంగా ఉన్నందున...రూపాయి విలువ కూడా అదే స్థాయిలో కాకపోయినా కాసింత అటుఇటుగా బాగానే ఉండేది. 1947లో 1 పౌండ్ రూ.13.37కు సమానమని అనేవారు. కానీ స్వాతంత్ర్యం వచ్చినప్పటి నుంచి దేశం స్వేచ్చగా ఎదగగలిగిందే గానీ పేదరికాన్ని తప్పించలేక పోయింది. సమాజంలో అసమానతలు...ప్రధానంగా ఆర్థిక అసమానతలు విపరీతంగా పెరిగిపోయాయి. ధనికులు మరింత ధనికులు కాగా పేదవాళ్ళు మరిం పేదవాళ్లుగా మారిపోయారు.

రెండో ప్రపంచయుద్ధానంతరం భారత్ లో మధ్య తరగతి శకం ప్రారంభమైందని చెప్పాలి. అటు మరీ పేదలు కాకుండా...ఇటు మరీ ధనవంతులు కా మధ్యస్థంగా ఉన్నవారికి మధ్యతరగతి ప్రజలుగా గుర్తించారు. మద్యతరగతి జనాభా అధికం. సమాజంలో కట్టుబాట్లు, కష్టసుఖాలు నియమనిబంధనలు అన్నీ మధ్యతరగతిజీవులకే అన్నట్లు తయారైంది. జానాభా విస్పోటం...ఎన్నో అనర్థాలకు దారితీసింది. ప్రభుత్వం బలవంతంగా ఫ్లామిలీ ప్లానింగ్ అమల్లోకి తీసుకొచ్చింది. చివరికి ఎన్నికల్లో పోటీ చేయాలన్నా ఇద్దరి కంటే ఎక్కువ సంతానం ఉన్నవారు అనర్హులు అన్నంతగా సంస్కరణలు కఠినంగా అమలయ్యాయి. కానీ విచిత్రంగా ద్రవ్యోల్బణం పిశాచంలా విజృంభిస్తుండటంతో పూర్ క్లాస్...మిడిల్ క్లాస్ రెండూ కలిసి పోయి ఒకే వర్గంగా రూపాంతరం చెందాయి. ఇపుడు సమాజంలో కేవలం ఉన్నవాళ్లు లేనివాళ్లన్న విభజనే కనిపిస్తోంది.

ఇక ప్రస్తుతం రూపాయి పడిపోవడానికి కారణం తాజాగా అమెరికా..బారత్ లమధ్య వాణిజ్య ఒప్పందాల్లో ఆలసస్యమే అంటున్నారు. పెట్టుబడిదారులు సెంటిమెంట్ గా ఫీలవడంతో రూపాయి నేలచూపులు చూస్తోందని నిపుణులు అంటున్నారు. దీంతోపాటు మార్కెట్ ఒడిదొడుకులు, డాలర్ విలువ పెరగడం కారణాలుగా చెబుతున్నారు. మనం కారణాలు లక్ష చెప్పవచ్చు...కానీ రూపాయి పడిపోతోంది అన్నది మాత్రం పచ్చివాస్తవం. మనదేశం అంతర్జాతీయ మార్కెట్ ను విపరీతంగా ఆకర్షిస్తోందని చెబుతున్నా ...పరిస్థిలో మార్పు లేదు. మన రూపాయిని చూసే అమెరికా అధ్యక్షుడు చెలరేగిపోతున్నాడనిపిస్తోంది. ప్రతీకార దిగుమతి సుంకాలంటూ...వలసపోయిన ఇండియన్లను హెచ్1బీ వీసాలంటూ రాచిరంపాన పెడుతుండానికి కారణం మన రూపాయి మసకేసిపోవడమే.