Begin typing your search above and press return to search.

ఏడు పైసల లాభం.. రూపాయికి వచ్చింది ప్రాణం.. డాలర్ తో తగ్గేదేలే..

డాలర్‌తో పోలిస్తే రూపాయి విలువ శుక్రవారం ప్రారంభ ట్రేడింగ్‌లో 7 పైసలు పుంజుకుని 94.05కు చేరింది. విదేశీ పెట్టుబడులు భారీగా రావడం, బ్రెంట్ క్రూడ్ ధరలు తగ్గడం దీనికి ప్రధాన కారణాలుగా నిలిచాయి. అయితే చమురు ధరలు ఇంకా బ్యారెల్‌కు 95 డాలర్లపైనే ఉండటంతో రూపాయి రికవరీ ఎంతకాలం కొనసాగుతుందన్నది ఆసక్తికరంగా మారింది.

By:  A.N.Kumar   |   13 Nov 2026 3:56 PM IST
ఏడు పైసల లాభం.. రూపాయికి వచ్చింది ప్రాణం.. డాలర్ తో తగ్గేదేలే..
X

ఇన్నాళ్లూ అమెరికన్ డాలర్ దెబ్బకు విలవిల్లాడిపోయిన మన రూపాయి దేవి.. ఎట్టకేలకు కాస్త ఊపిరి పీల్చుకుంది. రోజురోజుకూ పాతాళానికి పడిపోతూ రికార్డులు సృష్టిస్తున్న రూపాయి.. తాజాగా ఏడు పైసలు పుంజుకుని మార్కెట్‌కు చిన్నపాటి ఊరటనిచ్చింది. ఈ శుభపరిణామాన్ని చూసి అసలు పండగ చేసుకోవాలా? లేక కాసేపు కోలుకున్న రోగిలా మళ్లీ కుప్పకూలుతుందేమోనని భయపడాలో అర్థం కాని పరిస్థితి నెలకొంది..

శుక్రవారం ప్రారంభ ట్రేడింగ్‌లో డాలర్‌తో పోలిస్తే రూపాయి విలువ 7 పైసలు పెరిగి 94.05 స్థాయికి చేరింది. అంతకుముందు సెషన్‌లో ఇది 94.12 వద్ద ముగిసింది. వినడానికి ఏడు పైసలే అయినా పతనం బాటలో ఉన్న రూపాయికి ఇది కాస్త కొండంత బలం ఇచ్చే విషయమే. అయితే ఈ ఒక్కరోజూ పెరిగినంత మాత్రాన రూపాయి మళ్లీ తన పాత వైభవాన్ని అందుకుందని సంబరపడిపోవడం అత్యాశే అవుతుంది.

రూపాయి ఈ మాత్రం కోలుకోవడానికి మన దేశ ఆర్థిక వ్యవస్థ ఒక్కటే కారణం కాదు. విదేశీ పెట్టుబడిదారులు సడన్‌గా మన మార్కెట్లపై ప్రేమ చూపించడం.. అంతర్జాతీయంగా క్రూడ్ ఆయిల్ ధరలు తగ్గడం దీనికి ప్రధాన కారణం. గురువారం ఒక్కరోజే దాదాపు రూ.7,830 కోట్లకు పైగా విదేశీ పెట్టుబడులు మన స్టాక్ మార్కెట్లోకి వచ్చాయి. అవి రావడంతో డాలర్లను రూపాయిలుగా మార్చాల్సి వచ్చింది, దాంతో డిమాండ్ పెరిగి కరెన్సీ బలపడింది.

మరోవైపు బ్రెంట్ క్రూడ్ ఆయిల్ ధర బ్యారెల్‌కు 95.47 డాలర్లకు దిగివచ్చింది. పెట్రోల్, డీజిల్ దిగుమతుల కోసం మనం ఎక్కువగా డాలర్లు ఖర్చు చేయాల్సి ఉంటుంది కాబట్టి చమురు ధరలు తగ్గితే మనోడి జేబుపై భారం తప్పుతుంది. అయితే బ్యారెల్ ధర ఇంకా 95 డాలర్ల పైనే ఉందన్న సంగతి మరిచిపోకూడదు.

మన దేశంలో చిల్లర ద్రవ్యోల్బణం 6.09 శాతానికి ఎగబాకడంతో.. దీన్ని కట్టడి చేయడానికి రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా త్వరలో రెపో రేటును పెంచే ఛాన్స్ ఉంది. వడ్డీ రేట్లు పెరిగితే విదేశీ ఇన్వెస్టర్లు మళ్లీ ఆకర్షితులవుతారు. కానీ సామాన్యుడికి మాత్రం లోన్ల భారం పెరిగిపోతుంది. అంటే రూపాయిని కాపాడుకోవడానికి సామాన్యుడి నడ్డి విరుస్తారన్నమాట..

రూపాయి ఏడు పైసలు పెరిగిందని దేశ ఆర్థిక వ్యవస్థ కుబేర స్థాయికి వెళ్లిపోయినట్లు కాదు. ప్రస్తుతానికి విదేశీ ఇన్వెస్టర్లు.. చమురు ధరల తగ్గింపు రూపాయికి ఆక్సిజన్ ఇస్తున్నాయి. ఈ కృత్రిమ శ్వాస కొన్ని రోజులు ఆగితేనే రూపాయి నిజంగా కోలుకుంటుంది. లేదంటే ఈ ఏడు పైసల ఆనందం కూడా మార్కెట్‌లో కేవలం ఒక్కరోజు ముచ్చటగానే మిగిలిపోవడం ఖాయం..