బలహీనమైన రూపాయి.... మోయాల్సింది సామాన్యుడే
ఈ విధంగా బలహీనమైన రూపాయి ప్రభావం దేశంలో విస్తృతమైన ప్రభావంగా ఉంటుంది అని అంటున్నారు. విదేశీ ప్రయాణంతో పాటు విద్య మరింత ఖరీదైనవిగా మారతాయి.
By: Satya P | 5 Dec 2025 9:24 AM ISTభారత్ రూపాయి ప్రపంచంలో ఎక్కడా చెల్లడం లేదని కాంగ్రెస్ జాతీయ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గె విమర్శించారు. అంతా బాగుందని దేశంలో అనుకుంటున్నారు కానీ బయట మాత్రం రూపాయికి విలువ లేకుండా పోతోంది అని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. ఆర్థికపరంగా భారత్ విధానాలు సరిచేసుకోవాల్సి ఉందని అన్నారు. ఇదే మాటను ఆర్ధిక నిపుణులు అంటున్నారు. ఎగుమతులు దిగుమతుల మధ్య భారీ తేడా ఉంటే కనుక అది రూపాయిని బక్క చిక్కేలా చేస్తుంది. అలాగే దేశంలో విదేశీ మదుపరులు తమ పెట్టుబడులు భారీ ఎత్తున పెట్టడం కనుక తగ్గిపోతే కనుక అది కూడా తీవ్ర ప్రతికూల ప్రభావం చూపిస్తుంది. ఇలా రూపాయి పాపాయి చిక్కి పోవడానికి సవాలక్ష కారణాలు ఉంటాయి. అన్ని దేశాలతో మంచి సంబంధాలు ఉంటే మన ఎగుమతులు బ్రహ్మాండంగా సాగితే విదేశీ మారక నిల్వలు బాగా పెరుగుతాయి. కానీ అదేమీ జరగకపోతే ఉన్న నిల్వలు తగ్గిపోతే కనుక అపుడు రూపాయి సహజంగానే బలహీనం అవుతుంది.
దారుణంగా పతనం :
భారతీయ రూపాయి ఇపుడు డాలర్ తో పోలిస్తే దారుణంగా పతనం అవుతోంది. తాజాగా చూస్తే కనుక 90 పై దాటి ఉంది. అంటే మన తొంబై రూపాయలు ఒక డాలర్ తో సమానం అన్న మాట. ఇది దేశంలో బలహీనమైన కరెన్సీ పనితీరును తెలియచేస్తోంది అని అంటున్నారు. పెరుగుతున్న వాణిజ్య లోటు అలాగే జీడీపీ వృద్ధి బలహీనపడటం, విదేశీయ దేశీయ ఈక్విటీలను అమ్మడం మొదలైనవి దీనికి కారణాలుగా ఆర్ధిక నిపుణులు చెబుతున్నారు.
సగటు మనిషి మీదనే :
ఈ విధంగా బలహీనమైన రూపాయి ప్రభావం దేశంలో విస్తృతమైన ప్రభావంగా ఉంటుంది అని అంటున్నారు. విదేశీ ప్రయాణంతో పాటు విద్య మరింత ఖరీదైనవిగా మారతాయి. అలాగే ఎలక్ట్రానిక్స్, ఉపకరణాలు, మందులు, కార్లు వంటి దిగుమతి చేసుకున్న వస్తువుల ధర విపరీతంగా పెరుగుతుంది. ఇంధన ధరలు పరోక్షంగా భారీగా పెరగవచ్చు ఇలా ద్రవ్యోల్బణం పెరుగుదల హెచ్చు స్థాయిలో ఉండొచ్చు అని చెబుతున్నారు. ఇలా రూపాయి బలహీనత ఇప్పుడు సగటు భారతీయ కుటుంబాన్ని పెద్ద ఎత్తున తాకుతోంది అని అంటున్నారు. ప్రతీ కుటుంబంలో ఇంధన బిల్లుల నుండి నెల వారీ వాయిదాలు, ట్యూషన్ ఫీజులు ప్రయాణ ఖర్చుల వరకూ అన్నీ ఇబ్బడి ముబ్బడిగా పెరుగ్తాయని అంటున్నారు.
అందుకే పెరుగుదల :
భారతదేశం దాని చమురులో 90 శాతం పైగా ఇతర దేశాల నుంచి దిగుమతి చేసుకుంటుంది అలాగే, ఎలక్ట్రానిక్స్, ఎరువులు ఆహారం కోసం వాడే వంట నూనె కోసం విదేశీ సరఫరాదారుల పైననే భారత్ ఎక్కువగా ఆధారపడి ఉంటుంది. బలహీనమైన రూపాయి ఈ బిల్లులను విపరీతంగా పెంచుతుంది. దాంతో వీటి ధరలు ఆకాశాన్ని తాకుతాయని అంటున్నారు. మొత్తానికి రూపాయి వీక్ అయితే ఆ భారం అంతా మోయాల్సింది సామాన్యుడే అని ఆర్ధిక నిపుణులు చెబుతున్నారు. చూడాలి ముందు ముందు ఈ ప్రభావం ఎంత ఉండబోతోందో.
