ఒక చిన్న రాయితో రైల్వే శాఖకు కోట్ల రూపాయల నష్టం.. భద్రతకు ముప్పుగా మారుతున్న వికృత చేష్టలు..
రైల్వే చట్టం-1989 ప్రకారం, రైల్వే ఆస్తులను ధ్వంసం చేయడం లేదంటే ప్రయాణికులకు ముప్పు కలిగించడం తీవ్రమైన నేరం.
By: Tupaki Political Desk | 26 April 2026 11:32 AM ISTరైల్వే ఆస్తులను సొంత ఆస్తులుగా భావించాల్సిన బాధ్యత దేశంలోని ప్రతి పౌరుడిపై ఉంది. కానీ, కొందరు చేస్తున్న అనాలోచిత పనులు రైల్వేకు కోట్లలో నష్టాన్ని చేకూర్చడమే కాకుండా ప్రయాణికుల భద్రతను కూడా ప్రమాదంలో నెడుతున్నాయి. గత రెండేళ్లలో (2023 నుంచి ఇప్పటి వరకు) నమోదైన ఈ గణాంకాలు ఆందోళన కలిగిస్తున్నాయి.
భారతీయ రైల్వే దేశానికి వెన్నుముక వంటిది. అయితే, ఇటీవల కాలంలో రైళ్లపై రాళ్లు రువ్వడం అనేది వికృతమైన ట్రెండ్‌గా మారిపోయింది. అధికారిక గణాంకాల ప్రకారం, 2023 నుంచి రైళ్లపై రాళ్ల దాడికి సంబంధించి ఏకంగా 7,971 కేసులు నమోదయ్యాయి. ఈ దాడుల వల్ల సదరు శాఖకు రూ. 5.79 కోట్ల మేర నష్టం వాటిల్లింది. ఇది కేవలం కిటికీ అద్దాల నష్టం మాత్రమే కాదు.., దీని వెనుక ప్రయాణికుల ప్రాణాలకు ముప్పు పొంచి ఉంది. దీంతో పాటు రైలులో ప్రయాణం అంటే ప్రయాణికులు భయపడతారు.
ఎందుకీ దాడులు?
రైళ్లపై రాళ్లు రువ్వే వారిలో ఎక్కువ శాతం మంది అవగాహన లేని యువత, పిల్లలు ఉంటున్నట్లు రైల్వే ప్రొటెక్షన్ ఫోర్స్ గుర్తించింది. ముఖ్యంగా అత్యాధునిక ‘వందే భారత్’ ఎక్స్‌ప్రెస్ రైళ్లపై దాడులు జరుగుతున్నాయి. ఆ రైళ్ల గ్లామర్ లేదంటే ఆధునికతపై ఉన్న అసూయ, లేదా కేవలం సరదా కోసం చేసే పనులు వినాశనానికి దారితీస్తున్నాయి. రైలుపై రాయి వేయడం అనేది ఒక నేరమని, దానివల్ల లోపల ఉన్న ప్రయాణికుడు గాయపడే ప్రమాదం ఉందని చాలా మంది గ్రహించడం లేదు.
రైల్వేకు వాటిల్లిన రూ. 5.79 కోట్ల నష్టం అనేది సామాన్య పౌరుల పన్నుల రూపంలో వచ్చిన సొమ్ము. పగిలిన అద్దాలను మార్చడానికి, రైలును షెడ్డుకు పంపడానికి పట్టే సమయం వల్ల సర్వీసులు ఆలస్యం అవుతున్నాయి. వందే భారత్ వంటి రైళ్ల అద్దాలు అత్యంత ఖరీదైనవి కావడంతో నష్టం తీవ్రత ఎక్కువగా ఉంది. దాడి వల్ల అద్దాలు పగిలి లోపల ఉన్న పిల్లలు, వృద్ధులు గాయపడుతున్న ఘటనలు చూస్తున్నాం. ఒక చిన్న రాయి కూడా బుల్లెట్ వేగంతో వచ్చి తగిలితే ప్రాణాంతకం కాగలదు.
కఠిన చర్యలు తీసుకోవాలి..
రైల్వే చట్టం-1989 ప్రకారం, రైల్వే ఆస్తులను ధ్వంసం చేయడం లేదంటే ప్రయాణికులకు ముప్పు కలిగించడం తీవ్రమైన నేరం. సెక్షన్ 152 ప్రకారం రైళ్లపై రాళ్లు రువ్వే వారికి 10 ఏళ్ల వరకు జైలు శిక్ష విధించే అవకాశం ఉంది. రైల్వే శాఖ ఇప్పుడు దాడులు ఎక్కువగా జరిగే ప్రాంతాలను గుర్తించి అక్కడ డ్రోన్లు, సీసీటీవీల ద్వారా నిఘా పెంచుతోంది. పట్టాల పక్కన ఉండే గ్రామాల్లో ప్రజలకు అవగాహన కల్పిస్తోంది.
శిక్షలు ఎన్ని ఉన్నా, ప్రజల్లో బాధ్యత కూడా పెరగాలి. అప్పుడే సమస్య సద్దుమణుగుతుంది. రైల్వే ఆస్తి మన ఆస్తి అని, మన కుటుంబ సభ్యులే రైళ్లలో ప్రయాణిస్తున్నారని ప్రతి ఒక్కరూ గుర్తించాలి. విద్యాసంస్థలు, తల్లిదండ్రులు పిల్లలకు చిన్నతనం నుంచే ప్రజా ఆస్తుల పట్ల గౌరవం నేర్పాలి. రైల్వే శాఖ కూడా ఇలాంటి నేరస్తులకు మినహాయింపు లేకుండా కఠినంగా శిక్షించడం ద్వారా ఇతరులకు ఒక గుణపాఠం చెప్పాలి.
