ఐదేళ్లలో 48 రైల్వేస్టేషన్లే టార్గెట్.. తెలుగు రాష్ట్రాల సంగతేంటి?
అంతకంతకూ పెరుగుతున్న రైలు ప్రయాణికులకు తగ్గట్లే రైళ్ల సామర్థ్యాన్ని పెంచేందుకు వీలుగా తాజాగా కేంద్రం కీలక నిర్ణయాన్ని తీసుకుంది.
By: Garuda Media | 27 Dec 2025 11:17 AM ISTఅంతకంతకూ పెరుగుతున్న రైలు ప్రయాణికులకు తగ్గట్లే రైళ్ల సామర్థ్యాన్ని పెంచేందుకు వీలుగా తాజాగా కేంద్రం కీలక నిర్ణయాన్ని తీసుకుంది. ఇందులో దేశంలో ఎక్కువ రద్దీగా ఉండే 48 రైల్వే స్టేషన్ల మీద గురి పెట్టింది. ఇక్కడి నుంచి బయలుదేరే రైళ్ల సామర్థ్యాన్ని ఐదేళ్ల వ్యవధిలో రెట్టింపు చేయటమే లక్ష్యంగా పెట్టుకుంది. ఇందులో భాగంగా తాజాగా ఒక పక్కా ప్లాన్ సిద్ధం చేసింది. రాబోయే రోజుల్లో పెరిగే డిమాండ్ తో పాటు.. ప్రయాణికుల అవసరాల్ని తీర్చటమే లక్ష్యంగా పెట్టుకుంది.
దేశ వ్యాప్తంగా 48 రైల్వే స్టేషన్లను ఎంపిక చేయగా.. ఇందులో తెలుగు రాష్ట్రాల్లోని కొన్ని రైల్వే స్టేషన్లు ఉన్నాయి. ఇక్కడి నుంచి రోజువారీగా ప్రయాణికుల సంఖ్య భారీగా ఉండటంతో.. వీటిని విస్తరించటం.. కొత్త టెర్మినల్స్ ను సిద్ధం చేయటం లాంటి ఏర్పాట్లు చేయనున్నారు. తెలుగురాష్ట్రాల్లోని రైల్వే స్టేషన్ల విషయానికి వస్తే..
- సికింద్రాబాద్/హైదరాబాద్
- విశాఖపట్నం
- విజయవాడ
- తిరుపతి
ఇక.. టాప్ 10 స్టేషన్లను చూస్తే దేశ రాజధాని ఢిల్లీ మొదటి స్థానంలో నిలవగా.. దేశ ఆర్థిక రాజధానిగా చెప్పే ముంబయి రెండో స్థానంలో నిలిచింది. మూడోస్థానంలో కోల్ కతా.. నాలుగో స్థానంలో చెన్నై నిలిచాయి. హైదరాబాద్ ఐదో స్థానంలో నిలిచింది. నిజానికి మొదటి ఐదు స్టేషన్లలో హైదరాబాద్ మినహాయిస్తే.. మిగిలిన నాలుగు స్టేషన్లు స్వాతంత్య్రానికి ముందు నుంచి అత్యధిక రైళ్లు నడిచే మార్గాలుగా చెప్పాలి. బెంగళూరు రైల్వే స్టేషన్ ఆరో స్థానంలో నిలిచింది.
ఎంపిక చేసిన ఈ 48 రైల్వే స్టేషన్లలో రానున్న ఐదేళ్ల వ్యవధిలో ఇక్కడి నుంచి రెట్టింపు సామర్థ్యంతో రైళ్లను నడిచేలా చేయటంతో పాటు.. ప్రస్తుత టర్మినల్స్ లో అదనపు ప్లాట్ ఫారాలు నిర్మించనున్నారు. అంతేకాదు.. ఆయా నగరాల చుట్టుపక్కల కొత్త టర్మినల్స్ ను ఏర్పాటు చేయటం.. నిర్వహణ సౌకర్యాలు మెరుగుపర్చటం.. సెక్షనల్ సామర్థ్యాన్ని పెంచటం లాంటివి ఉంటాయి. దేశ వ్యాప్తంగా 48 ప్రధాన రైల్వే స్టేషన్లకు సంబంధించిన సమగ్ర ప్రణాళికను రైల్వే ప్లానింగ్ డైరెక్టరేట్ కు సమర్పిస్తారు. ఇప్పుడు పెట్టుకున్న లక్ష్యాన్ని నిర్దేశిత గడువులోపు పూర్తి చేయాలన్న లక్ష్యంగా పెట్టుకున్నట్లుగా చెబుతున్నారు. మొత్తంగా ఐదేళ్ల వ్యవధిలో దేశంలోని ప్రధాన రైల్వే స్టేషన్ల రూపురేఖలు మారనున్నట్లుగా చెప్పాలి.
