ట్రంప్ మరో దెబ్బ : 100% టారిఫ్స్ తో భారత్‌పై తీవ్ర ప్రభావం!
ట్రంప్ తన విధానాన్ని స్పష్టంగా చెప్పారు. అమెరికాలో ప్లాంట్లు స్థాపించే విదేశీ కంపెనీలకు ఈ సుంకాలు వర్తించవు.
By: A.N.Kumar | 26 Sept 2025 10:57 AM ISTఅమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ భారత ఫార్మా ఉత్పత్తులపై అక్టోబర్ 1 నుంచి 100% దిగుమతి సుంకం (టారిఫ్) విధించాలని తీసుకున్న నిర్ణయం భారత్‌పై బహుముఖ తీవ్ర ప్రభావాలను చూపనుంది. ఇది భారత ఫార్మా రంగానికి అతిపెద్ద దెబ్బగా పరిగణించవచ్చు.
* భారత ఫార్మా రంగంపై పెను ప్రభావం
అమెరికా భారత ఫార్మా కంపెనీలకు అతిపెద్ద ఎగుమతి మార్కెట్. ఫైనాన్షియల్ ఇయర్ 2024లో భారత్ నుంచి జరిగిన $27.9 బిలియన్ ఫార్మా ఎగుమతుల్లో $8.7 బిలియన్ (దాదాపు 31%) కేవలం అమెరికాకే వెళ్లాయి. డాక్టర్ రెడ్డీస్, అరబిందో ఫార్మా, సన్‌ఫార్మా, జైడస్, గ్లాండ్ ఫార్మా వంటి అగ్రశ్రేణి కంపెనీల రెవెన్యూలో 30-50% వరకు అమెరికా మార్కెట్ నుంచే వస్తోంది. టారిఫ్‌లు రెట్టింపు కావడంతో 100% సుంకం అంటే ధర రెట్టింపు అవుతుంది దీంతో ఈ కంపెనీల ఆదాయం నేరుగా తగ్గిపోయే ప్రమాదం ఉంది.
* అమెరికా మార్కెట్‌లో ఔషధాల ధరల పెరుగుదల
ఈ టారిఫ్‌ల ప్రభావం భారత్‌తో పాటు అమెరికన్ వినియోగదారులపైనా పడుతుంది. ప్రస్తుతం అమెరికాలో వినియోగించే జనరిక్ ఔషధాల్లో 45% భారత్ నుంచే వెళ్తున్నాయి. అలాగే, బయోసిమిలర్లలో కూడా 15% సరఫరా భారతదేశం నుంచే జరుగుతుంది. 100% టారిఫ్‌ల కారణంగా ఈ ఔషధాల ధరలు రెట్టింపు అయ్యే అవకాశముంది. ఇది అమెరికా ప్రజల హెల్త్‌కేర్ ఖర్చులను గణనీయంగా పెంచుతుంది.
* అమెరికాలో తయారీ ఒత్తిడి
ట్రంప్ తన విధానాన్ని స్పష్టంగా చెప్పారు. అమెరికాలో ప్లాంట్లు స్థాపించే విదేశీ కంపెనీలకు ఈ సుంకాలు వర్తించవు. ఈ నిబంధన భారత ఫార్మా సంస్థలను అమెరికాలో తయారీ యూనిట్లు (ప్లాంట్లు) నిర్మించేలా లేదా జాయింట్ వెంచర్లు ఏర్పాటు చేసేలా తీవ్రంగా ఒత్తిడి చేస్తుంది. ఈ మార్పు భారత కంపెనీలకు అదనపు ఖర్చు, భారీ పెట్టుబడులు అవసరం అవుతాయి.
* భారత్–అమెరికా వాణిజ్య సంబంధాల్లో ఉద్రిక్తత
ఈ 100% ఫార్మా టారిఫ్‌ల నిర్ణయం ఇరు దేశాల మధ్య వాణిజ్య సంబంధాల్లో ఉద్రిక్తతను పెంచుతుంది. రష్యా నుంచి చమురు దిగుమతుల కారణంగా భారత్‌పై ఇప్పటికే 50% టారిఫ్‌లు అమలులో ఉన్నాయి. ఇప్పుడు ఫార్మా రంగంపై విధించిన టారిఫ్‌లతో ఈ వాణిజ్యపరమైన ఉద్రిక్తత మరింత పెరుగుతుంది, ఫలితంగా ఇరుదేశాల మధ్య జరగాల్సిన ముఖ్యమైన వాణిజ్య చర్చలు మరింత క్లిష్టం కానున్నాయి.
* భారత్ ఫార్మా కంపెనీల భవిష్యత్తు వ్యూహాలు
ఈ సవాలును ఎదుర్కోవడానికి భారతీయ ఫార్మా కంపెనీలు తమ వ్యాపార వ్యూహాలను మార్చుకోవాల్సిన అవసరం ఉంది. అమెరికా మార్కెట్‌పై ఆధారాన్ని తగ్గించుకుని, యూరప్, ఆఫ్రికా, లాటిన్ అమెరికా వంటి ఇతర మార్కెట్లను విస్తరించడం అత్యవసరం. కేవలం జనరిక్ ఔషధాలపైనే కాకుండా, పరిశోధన (R&D), ఇన్నోవేటివ్ డ్రగ్స్‌పై దృష్టి పెట్టి బ్రాండెడ్ ఔషధాలను అభివృద్ధి చేయడం ద్వారా అంతర్జాతీయ మార్కెట్‌లో తమ స్థానాన్ని పదిలం చేసుకోవచ్చు. అమెరికా మార్కెట్‌లో కొనసాగాలంటే, అక్కడికక్కడే జాయింట్ వెంచర్లు లేదా ప్లాంట్లు ఏర్పాటు చేయడం తప్పనిసరి కావచ్చు.
ట్రంప్ విధించిన 100% టారిఫ్‌లు భారత ఫార్మా రంగానికి నిస్సందేహంగా ఒక భారీ షాక్. తక్షణ ఫలితంగా కంపెనీల ఆదాయం పడిపోవడం, అమెరికా మార్కెట్‌లో ఔషధ ధరలు పెరగడం జరుగుతుంది. అయితే దీర్ఘకాలంలో ఇది భారత ఫార్మా కంపెనీలను కొత్త మార్కెట్ల అన్వేషణ, అమెరికాలో పెట్టుబడుల విస్తరణ, పరిశోధనలపై ఎక్కువ దృష్టి పెట్టడం వైపు నెట్టి, రంగంలో కీలకమైన మార్పులకు కారణమయ్యే అవకాశం ఉంది.
