అసలుసిసలు హీరోలు.. ఫ్లైట్ లో వ్యక్తి ప్రాణాల్ని కాపాడిన మనోళ్లు
అయితే.. ఈ విషయం ఏదీ బయటకు రాలేదు. ఈ విమానంలో ప్రయాణించిన ఒక ప్రయాణికుడి కారణంగా మీడియాకు ఈ విషయం తెలిసిందే.
By: Garuda Media | 1 Nov 2025 10:13 AM ISTచేసిన పని గురించి గొప్పలు చెప్పుకోవటం చాలామందిలో చూస్తుంటాం. అయితే.. ఒక వ్యక్తి ప్రాణాలు కాపాడి.. ఎవరికి తాము చేసిన పని గురించి చెప్పకపోవటమే కాదు.. తోటి మనిషికి ఆ మాత్రం సాయం చేయకపోతే ఎలా? అంటూ సింఫుల్ గా ప్రశ్నించే ఇద్దరు భారతీయ నర్సుల తీరు ఇప్పుడు అందరి ప్రశంసల్ని అందుకుంటోంది. కేరళలోని కొచ్చికి చెందిన ఇద్దరు మేల్ నర్సులు.. తమ విమాన ప్రయాణంలో ఒక వ్యక్తి ప్రాణాల్ని కాపాడిన వైనం సౌదీలోని మీడియాలో రావటంతో వారు చేసిన మంచి పని అందరికి తెలిసేలా చేసింది. ఇంతకూ అసలేం జరిగిందంటే..
కేరళలోని వయనాడ్ కు చెందిన 26 ఏల్ల అభిజిత్ జీస్, చెంగన్నూర్ కు చెందిన 29 ఏళ్ల అజీశ్ నెల్సన్ లు ఎయిర్ అరేబియాలో దుబాయ్ కు వెళుతున్నారు. ఫ్లైట్ టేకాఫ్ తీసుకున్న 20 నిమిషాలకే ఒక ప్రయాణికుడు శ్వాస పీల్చుకోవటంలో తీవ్ర ఇబ్బందికి గురవుతున్న విషయాన్ని గుర్తించారు. వెంటనే స్పందించిన వారు ఆయనకు సాయం చేసేందుకు ముందుకు వచ్చారు. ఈ క్రమంలో రెండుసార్లు సీపీఆర్ చేసిన వారు ప్రయాణికుడి ప్రాణాల్ని నిలబెట్టారు. వీరికి సాయంగా ఆరిఫ్ అబ్దుల్ ఖాదిర్ అనే డాక్టర్ కూడా సాయంగా నిలిచారు.
అయితే.. ఈ విషయం ఏదీ బయటకు రాలేదు. ఈ విమానంలో ప్రయాణించిన ఒక ప్రయాణికుడి కారణంగా మీడియాకు ఈ విషయం తెలిసిందే. విమానంలో ఒక వ్యక్తి ప్రాణాల్ని కాపాడిన ఇద్దరు భారతీయ నర్సుల ఉదంతాన్ని ఖలీజ్ టైమ్స్ లో కథనంగా ఇచ్చారు. దీంతో.. ఈ ఇద్దరు భారతీయుల గురించి ఆరా మొదలైంది. బాధిత ప్రయాణికుడి కుటుంబం వీరిద్దరికి థ్యాంక్స్ చెప్పగా.. వీరు మాత్రం ఫ్లైట్ దిగిన వెంటనే.. తమ విధుల్లో చేరేందుకు వెళ్లిపోయారు. వీరి గురించి మీడియా వెతకటం మొదలు పెట్టిన తర్వాత.. వారిద్దరు బయటకు వచ్చారు.
తామేమీ గొప్పపని చేయలేదని.. తమ వృత్తిధర్మాన్ని పాటించామని వినయంగా చెప్పటం పలువురిని ఆకట్టుకుంటోంది. విమానం టేకాఫ్ తీసుకున్న తర్వాత బాధిత ప్రయాణికుడు శ్వాస పీల్చుకోవటంలో ఇబ్బంది పడటం గమనించామని..దగ్గరకు వెళ్లి పరీక్షిస్తే నాడి కొట్టుకుంటున్నట్లుగా అనిపించలేదని.. దీంతో గుండెపోటుకు గురైన విషయాన్ని గుర్తించి.. వెంటనే సీపీఆర్ చేసినట్లుగా పేర్కొన్నారు. పరిస్థితి మెరుగు పడటంతో తాము ఊపిరి పీల్చుకున్నట్లుగా చెప్పారు. ఎయిర్ పోర్టులో వైద్య సిబ్బంది వైద్య సాయం చేయటంతో ఇప్పుడు ఆ ప్రయాణికుడు కోలుకుంటున్నట్లుగా వివరించారు. ఏమైనా.. ఒక వ్యక్తి ప్రాణాల్ని కాపాడి కూడా గొప్పలు చెప్పుకోకుండా సింఫుల్ గా వ్యవహరించిన ఈ తీరు పలువురిని ఆకట్టుకుంటోంది.
