Begin typing your search above and press return to search.

మల్టీఫ్లెక్సుల్ని మూసేస్తున్నారు.. ఈ ఏడాదిలో ఎన్నంటే?

ప్పటివరకు మెట్రో నగరాల మీదా.. నగరాల మీద ఫోకస్ చేసిన మల్టీఫ్లెక్సులు ఇప్పుడు పట్టణాల మీద ద్రష్టి సారిస్తున్నాయి.

By:  Garuda Media   |   21 Nov 2025 9:28 AM IST
మల్టీఫ్లెక్సుల్ని మూసేస్తున్నారు.. ఈ ఏడాదిలో ఎన్నంటే?
X

సింగిల్ థియేటర్ సీన్ మార్చేశాయి గ్రూపు థియేటర్లు. ఆ ట్రెండ్ ను దెబ్బ తీయటంలో మల్టీఫ్లెక్సులు కీలక పాత్ర పోషించాయి. ఒకప్పుడు సినిమా థియేటర్ అంటే తక్కువలో తక్కువ 500 సీట్లకు పైనే ఉండేవి. ఎప్పుడైతే మల్టీఫ్లెక్సులు ఎంట్రీ ఇచ్చాయో 150 నుంచి 250 మధ్యలో సీట్లు ఉండేలా జాగ్రత్తలు తీసుకుంటున్నాయి. తక్కువ విస్తీర్ణంలో ఎక్కువ స్క్రీన్లను అందుబాటులోకి తెచ్చే ట్రెండ్ కు శ్రీకారం చుట్టినట్లైంది. మల్టీఫ్లెక్సుల్లో పీవీఆర్ -ఐనాక్స్ తిరుగులేని అధిక్యతను ప్రదర్శిస్తుంటే.. వీరికి పోటీగా మిరాజ్.. సినీపోలీస్ లాంటి సంస్థలు మరికొన్ని ఉన్నాయి.

మల్టీఫ్లెక్సుల విషయానికి వస్తే కరోనాకు ముందు కరోనాకు తర్వాత అన్న స్పష్టమైన విభజన కొట్టొచ్చినట్లుగా కనిపిస్తుందని చెప్పాలి. కరోనా అనంతరం చోటు చేసుకున్న పరిణామాలతో పీవీఆర్.. ఐనాక్స్ లు ఒకటి కావటం.. దాన్ని పీవీఆర్ సొంతం చేసుకోవటంతో.. ఈ రంగంలో అత్యధిక స్క్రీన్లు ఉన్న బ్రాండ్ గా మారింది. సింగిల్ థియేటర్లు ఏ రీతిలో అయితే మూతబడుతున్నాయో..మల్టీఫ్లెక్సులు సైతం అదే తీరులో మూతపడుతున్న పరిస్థితి.

2024 ఆర్థిక సంవత్సరంలో (2024 ఏప్రిల్ 1 నుంచి 2025 మార్చి 31) ప్రధాన మల్టీఫ్లెక్స్ ఆపరేటర్లు దాదాపు 100 వరకు పని తీరు సరిగా లేని స్క్రీన్లను మూసేయటం గమనార్హం. ఈ ఆర్థిక సంవత్సరంలోనూ ఇప్పటివరకు మరో 60-70 స్క్రీన్ల వరకు మూసివేత దిశగా అడుగులు పడుతున్నాయి. కాకుంటే.. మల్టీఫ్లెక్సులకు ఉన్న సౌలభ్యం ఏమంటే.. ఆదరణ సరిగా లేని చోటి నుంచి కొత్త ప్రాంతాలకు షిప్టు అవుతున్నారు.

ఇప్పటివరకు మెట్రో నగరాల మీదా.. నగరాల మీద ఫోకస్ చేసిన మల్టీఫ్లెక్సులు ఇప్పుడు పట్టణాల మీద ద్రష్టి సారిస్తున్నాయి. అవసరానికి అనుగుణంగా టైర్ టూ పట్టణాల్లోనూ తమ స్క్రీన్లను తెరిచేందుకు ప్రయత్నిస్తున్నాయి. ఈ రంగంలో తిరుగులేని అధిపత్యాన్ని ప్రదర్శిస్తున్న పీవీఆర్ ఐనాక్స్ ఈ ఆర్థిక సంవత్సరంలో కొత్తగా వంద స్క్రీన్లను పెంచేందుకు వీలుగా ప్రణాళికల్ని సిద్ధం చేసుకొని.. ఆ లక్ష్యాన్ని సాధించే దిశగా అడుగులు వేస్తోంది. అక్టోబరు చివరి నాటికి 60 స్క్రీన్లను ప్రారంభించిన పీవీఆర్.. మిగిలిన 40 స్క్రీన్లను మార్చి చివరి నాటికి పూర్తి చేయనుంది.

గత ఆర్థిక సంవత్సరంలో ఆర్థికంగా లాభదాయకంగా లేని 55-69 తెరల్ని మూసివేయగా.. ఈ ఆర్థిక సంవత్సరం చివరి నాటికి 10-15 స్క్రీన్లను మూసివేయాలన్న యోచనలో పీవీఆర్ ఉంది. మిరాజ్.. సినీపోలీస్ సైతం విస్తరణ దిశగా ప్రయత్నిస్తున్నా.. వారికి కొత్త మాల్స్ అందుబాటులోకి రాకపోవటంతో సరైన వేదికల కోసం వెతుకుతున్నట్లుగా చెబుతున్నారు.

ఇక.. పీవీఆర్ ఇప్పుడు రూ.150-200 టికెట్ ధరలతో చిన్న పట్టణాల్లోనూ తమ మల్టీఫ్లెక్సుల్ని ప్రారంభించేందుకు వీలుగా ప్రణాళికల్ని సిద్ధం చేస్తోంది. అయితే.. కొత్త స్క్రీన్లలో అత్యధికం దక్షిణాది రాష్ట్రాల్లోనే ఏర్పాటు చేసేలా పీవీఆర్ - ఐనాక్స్ ప్లాన్ చేస్తుండటం గమనార్హం.