Begin typing your search above and press return to search.

ఎక్కడ దొరికితే అక్కడే.. అక్రమ వలసదారులపై ట్రంప్ ఉక్కుపాదం

అమెరికాలో ఇటీవల చోటు చేసుకున్న ఒక దారుణ సంఘటన అక్రమ వలసల సమస్యను మరోసారి చర్చనీయాంశం చేసింది.

By:  A.N.Kumar   |   16 Sept 2025 11:00 PM IST
ఎక్కడ దొరికితే అక్కడే.. అక్రమ వలసదారులపై ట్రంప్ ఉక్కుపాదం
X

అమెరికాలో ఇటీవల చోటు చేసుకున్న ఒక దారుణ సంఘటన అక్రమ వలసల సమస్యను మరోసారి చర్చనీయాంశం చేసింది. సెప్టెంబర్ 10న టెక్సాస్‌లో జరిగిన ఒక హృదయ విదారక ఘటనలో భారతీయుడు చంద్ర నాగమల్లయ్య దారుణ హత్యకు గురయ్యారు. క్యూబాకు చెందిన అక్రమ వలసదారుడు యోర్డానిస్‌ కోబోస్‌ మార్టినెజ్ ఈ దారుణానికి పాల్పడ్డాడు. సాక్షుల కళ్ళ ముందే మార్టినెజ్ నాగమల్లయ్య తలను నరికి చెత్తబుట్టలో పడేశాడు. ఈ అమానుషమైన చర్య అమెరికా సమాజాన్ని దిగ్భ్రాంతికి గురిచేసింది.

డీహెచ్‌ఎస్‌, ట్రంప్‌ల స్పందన

ఈ సంఘటనపై అమెరికా హోమ్‌ల్యాండ్‌ సెక్యూరిటీ డిపార్ట్‌మెంట్ (DHS) తీవ్రంగా స్పందించింది. బైడెన్ పాలనలో అక్రమ వలసదారులను అనుమతించకపోతే ఇలాంటి దారుణాలు జరిగేవి కావని డీహెచ్‌ఎస్ పేర్కొంది. అక్రమ వలసలపై మొదటి నుంచి కఠిన వైఖరి అవలంబిస్తున్న అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఈ ఘటనను తీవ్రంగా ఖండించారు. తన ట్రూత్ సోషల్ అకౌంట్‌లో పోస్ట్ చేస్తూ "అమెరికాను మళ్లీ సురక్షితం చేయడమే మా లక్ష్యం. అక్రమ వలసదారులపై ఇక ఏ మాత్రం సున్నితంగా వ్యవహరించం" అని హెచ్చరించారు. నాగమల్లయ్య హత్య కేసులో నిందితుడిపై ఫస్ట్‌ డిగ్రీ హత్య కేసు నమోదు చేసి విచారణ కొనసాగుతోందని కూడా ఆయన స్పష్టం చేశారు.

భవిష్యత్తులో కఠిన చర్యలు

ఈ ఘటన తర్వాత అక్రమ వలసలపై అమెరికా మరింత కఠినంగా వ్యవహరించేందుకు సిద్ధమవుతోంది. డీహెచ్‌ఎస్ వర్గాల ప్రకారం.. ఇకపై అక్రమంగా అమెరికాలోకి ప్రవేశించేవారిని మూడో దేశాలకు తరలించే చర్యలు చేపట్టనున్నారు. "ఎస్వాటిని, ఉగాండా, దక్షిణ సూడాన్ వంటి దేశాల్లోని ఉగ్రవాద నిరోధక కేంద్రాలకు పంపిస్తాం" అని డీహెచ్‌ఎస్ వెల్లడించింది.

ఈ సంఘటన ట్రంప్ ప్రభుత్వానికి ఒక కీలక మలుపు కానుంది. రాబోయే రోజుల్లో అక్రమ వలసల నివారణకు మరింత కఠినమైన చట్టాలు, నిబంధనలు అమలులోకి వచ్చే అవకాశం ఉంది. అమెరికాలోకి చట్టవిరుద్ధంగా ప్రవేశించి నేరాలకు పాల్పడేవారిపై ఇకపై ఎలాంటి ఉపేక్ష ఉండబోదని ఈ ఘటన స్పష్టం చేస్తోంది. ఒక భారతీయుడి దారుణ హత్య, అమెరికా వలస విధానాలపై పెద్ద చర్చకు దారి తీయడమే కాకుండా, అక్రమ వలసలపై కఠినమైన చర్యలకు మార్గం సుగమం చేస్తోంది.