Begin typing your search above and press return to search.

కెనడా డాక్టర్ల నిర్లక్ష్యానికి భారతీయుడు బలి

తన తండ్రి ఛాతీ నొప్పితో ఆసుపత్రికి వెళితే..కెనడా వైద్యుల నిర్లక్ష్యం కారణంగా గంటల కొద్దీ వైద్యం కోసం ఎదురుచూసి చనిపోయినట్లుగా మృతుడి కుమారుడు వెల్లడించాడు.

By:  Garuda Media   |   26 Dec 2025 11:06 AM IST
కెనడా డాక్టర్ల నిర్లక్ష్యానికి భారతీయుడు బలి
X

వైద్యుల నిర్లక్ష్యంతో రోగులు మరణించే దురదృష్టకర ఘటనల్ని మనదేశంలో అప్పుడప్పుడూ చూస్తుంటాం. విదేశాల్లో ఈ తీరు చాలా తక్కువన్న మాట తరచూ వినిపిస్తూ ఉంటుంది. అందుకు భిన్నంగా కెనడాలో చోటు చేసుకున్న తాజా దారుణం విస్తుపోయేలా చేస్తుంది. కెనడా లాంటి దేశంలో వైద్యులు ఇంత నిర్లక్ష్యంగా వ్యవహరిస్తారా? అన్న సందేహం కలుగుతుంది. తాజాగా చోటు చేసుకున్న ఘటనలో కెనడా వైద్యుల నిర్లక్ష్యంతో భారతీయుడు ఒకరు ఎనిమిది గంటల పాటు ఛాతీ నొప్పితో తీవ్ర ఇబ్బందికి గురై.. చివరకు ప్రాణాలు విడిచిన వైనం షాకింగ్ గా మారింది.

డిసెంబరు 22న జరిగిన దారుణం తాజాగా వెలుగు చూసింది. తన తండ్రి ఛాతీ నొప్పితో ఆసుపత్రికి వెళితే..కెనడా వైద్యుల నిర్లక్ష్యం కారణంగా గంటల కొద్దీ వైద్యం కోసం ఎదురుచూసి చనిపోయినట్లుగా మృతుడి కుమారుడు వెల్లడించాడు. 44 ఏళ్ల ప్రశాంత్ శ్రీకుమార్ అనే భారత సంతతి వ్యక్తి కెనడాలోని ఆసుపత్రిలో మరణించటం.. దీనికి కారణం అక్కడి వైద్యుల నిర్లక్ష్యమన్న ఆరోపణ ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది.

ఛాతీ నొప్పితో ఆసుపత్రికి వెళితే.. ఈసీజీలో అంతా నార్మల్ గానే ఉందని చెప్పిన అత్యవసర గదిలో ఏకంగా ఎనిమిది గంటల పాటు వెయిట్ చేసేలా చేశారని.. చివరకు చికిత్స కోసం తీసుకెళుతుండగా తీవ్రమైన గుండెపోటుతో మరణించినట్లుగా ప్రశాంత్ శ్రీకుమార్ కుమార్ ఆరోపించారు. తాను నొప్పిని భరించలేకపోతున్నట్లుగా తన తండ్రి విపరీతంగా వేదన చెందాడని.. ఏడుస్తూ చెప్పినట్లుగా పేర్కొంటూ.. కన్నీరు మున్నీరయ్యాడు.

కెనడాలోని ఎడ్మాంటన్ కు చెందిన ప్రశాంత్ ఆఫీసులో పని చేసుకుంటున్న సమయంలో విపరీతమైన ఛాతీ నొప్పికి గురయ్యాడు. దీంతో అతని సహోద్యోగి ఒకరు వెంటనే అతన్ని గ్రే నన్స్ కమ్యూనిటీ ఆసుపత్రికి తీసుకెళ్లారు. అక్కడ చాలాసేపు వెయిటింగ్ రూంలో కూర్చోబెట్టిన తర్వాత ఈసీజీ చేశారు. అంతా నార్మల్ గా ఉందని పేర్కొంటూ నొప్పికి ‘టైలీనల్’ మెడిసిన్ మాత్రమే ఇచ్చారని.. నొప్పి భరించలేనిదిగా ఉందంటూ తన తండ్రి తనతో వాపోయినట్లుగా పేర్కొన్నారు.

బీపీ అంతకంతకూ పెరిగిపోతున్నా.. నర్సులు పట్టించుకోలేదన్నారు. చివరకు చికిత్స చేసేందుకు తీసుకెళ్లారని.. అప్పటికే చాలా ఆలస్యమైందంటూ.. ‘మా నాన్న నా వైపు నిస్సహాయంగా చూస్తూ.. కూర్చున్న కూర్చీలోనే కుప్పకూలారు’’ అని పేర్కొన్నారు. వైద్యుల నిర్లక్ష్యంతో ప్రాణాలు కోల్పోయిన నేపథ్యంలో ఈ ఉదంతంపై రివ్యూ చేస్తున్నట్లుగా ఆసుపత్రి వర్గాలు వెల్లడించాయి. ప్రశాంత్ కు భార్య.. ముగ్గురు పిల్లలు ఉన్నారు. ఈ తరహా నిర్లక్ష్యం ఉంటుందా? అన్నదిప్పుడు ప్రశ్నగా మారింది.