హెచ్-1బీ వీసాల పతనం: టాప్ 7 భారత ఐటీ దిగ్గజాలకు కేవలం 4,573 వీసాలే!
అమెరికాలో హెచ్1బీ వీసాల పతనానికి బోలెడన్నీ కారణాలున్నాయి. అమెరికాలో అవుట్ సోర్సింగ్ ఆధారిత హెచ్1బీ కంపెనీలపై అధికారులు కఠిన నిబంధనలను అమలు చేస్తున్నారు.
By: A.N.Kumar | 10 Dec 2025 3:00 AM ISTట్రంప్ వచ్చాక ఇండియన్ ఐటీ కంపెనీలకు కష్టకాలమొచ్చింది. భారతీయులను చేర్చుకోలేక.. అమెరికన్లను చేర్చుకుంటే ఖర్చు తడిసిమోపడై నానా కష్టాలు పడుతున్నాయి. దీనికి తోడు ఈసారి హెచ్1బీ వీసాలు మొత్తం కోత విధించడంతో భారత ఐటీకి గడ్డుకాలం నడుస్తోంది. అమెరికా టాలెంట్ మార్కెట్ లో భారత ఐటీ సేవాసంస్థలు గత దశాబ్ధంలో ఎన్నడూ లేనంతటి కఠిన పరిస్థితులు ఎదుర్కొంటున్నాయి. 2025 ఆర్థిక సంవత్సరంలో టాప్ 7 భారత ఐటీ కంపెనీలకు కేవలం 4573 హెచ్1 బీ వీసాలే మంజూరు కావడం.. ఇది 10 ఏళ్ల కనిష్ట స్థాయిగా నమోదైంది. ఈ చారిత్రక పతనం అమెరికా వీసా విధానాల్లో వచ్చిన భారీ మార్పులను.. అలాగే భారత ఐటీ రంగం తన వ్యూహాలను మార్చుకోవాల్సిన అవసరాన్ని స్పష్టం సూచిస్తోంది.
గత పదేళ్లలో భారత ఐటీ సంస్థలు తమ అమెరికా క్లయింట్ల కోసం ఉద్యోగాలను పంపడానికి హెచ్1బీ వీసాలపై భారీగా ఆధారపడేవి. బ్యాంకింగ్ , హెల్త్ కేర్, మాన్యూ ఫాక్చరింగ్ వంటి కీలక రంగాలకు ఇవి అత్యంత కీలకంగా మారాయి. 2010 కాలంలో భారత కంపెనీలు ఏడాదికి 10వేల నుంచి 15వేల వరకూ వీసాలు పొందేవి. ప్రస్తుతం ఈ సంఖ్య సగం కంటే తక్కువ స్థాయికి పడిపోయింది. ఈ తగ్గుదలకు అమెరికా అధికారుల కఠిన తనిఖీలు, స్థానిక ఉద్యోగాలకు పెరుగుతున్న ప్రాధాన్యం, హైబ్రిడ్ వర్క్ మోడల్స్, ఇతర దేశాల నుంచి పోటీపెరగడం వంటి బహుళ కారణాలు దోహదపడ్డాయి.
అమెరికాలో హెచ్1బీ వీసాల పతనానికి బోలెడన్నీ కారణాలున్నాయి. అమెరికాలో అవుట్ సోర్సింగ్ ఆధారిత హెచ్1బీ కంపెనీలపై అధికారులు కఠిన నిబంధనలను అమలు చేస్తున్నారు.దరఖాస్తుదారులు ప్రత్యేక నైపుణ్యాలు ఉన్నాయని రుజువు చేసే ఆధారాలను తప్పనిసరి చేశారు. అధిక వేతన నిబంధనలను కఠినంగా అమలు చేయడం కూడా కారణం.. ట్రంప్ టైట్ చేయడంతో అమెరికాలోనే స్థానిక ఉద్యోగులను భారత ఐటీ కంపెనీలు పెద్ద ఎత్తున నియమించుకోవడం మొదలుపెట్టాయి. ఆఫ్ షోర్ డెలివరీ, హైబ్రిడ్ వర్క్, ఏఐ ఆధారిత సేవల పెరుగుదల వల్ల అమెరికాకు ఉద్యోగులను పంపాల్సిన అవసరం తగ్గింది. అమెరికాలో విదేశీ వీసాలపై రాజకీయంగా పెరిగిన సున్నితత్వం కూడా కారణం.
హెచ్1 బీ వీసాల పతనం, భారత ఐటీ రంగానికి వ్యూహాత్మక మార్పులను తప్పనిసరి చేస్తోంది. ఈ పరిస్థితి సంస్థల నిర్వహణ, కార్యాచరణ తీరును ప్రభావితం చేయనుంది. కంపెనీలు అమెరికాలోనే ఎక్కువ మంది ఉద్యోగులను నియమించుకోవాలి కాబట్టి కాస్ట్ గణనీయంగా పెరుగుతోంది. ఎక్కువ ప్రాజెక్టులు భారత్ కు ఆఫ్ షోర్ చేయబడుతున్నాయి. కెనడా, మెక్సికో, పోలాండ్, తూర్పు యూరప్ వంటి ఇతర దేశాల్లో ఐటీ కార్యకలాపాల విస్తరణకు సంస్థలు మొగ్గు చూపుతున్నాయి.
ఇవన్నీ జరిగినా కూడా భారత ఐటీ కంపెనీల ఆదాయంలో 50-60 శఆతం ఇప్పటికీ అమెరికా నుంచే వస్తుండడం గమనార్హం. అయితే ఈ ఏడాది కేవలం 4573 వీసాల మంజూరు ఒక చారిత్రాత్మక పతనంగా పరిశ్రమ వర్గాలు అభివర్ణిస్తున్నాయి. భారత ఐటీ రంగం ఇకపై అమెరికాపై అతిగా ఆధారపడకుండా కొత్త మార్గాల్లో ముందుకు సాగాల్సిన సమయం ఆసన్నమైందని ఇది స్పష్టంగా సూచిస్తోంది.
