ఒక్క వైరల్ రీల్.. భారతదేశంలో మహిళల స్వేచ్ఛపై భారీ చర్చ.
''మీరు సెలవుల కోసం ఎప్పుడూ విదేశాలకే ఎందుకు వెళ్తుంటారు? భారతదేశంలో చూడాల్సిన ప్రదేశాలు లేవా?" ఈ ప్రశ్న చాలామందికి ఎదురయ్యేదే.
By: A.N.Kumar | 10 Jan 2026 4:00 AM IST''మీరు సెలవుల కోసం ఎప్పుడూ విదేశాలకే ఎందుకు వెళ్తుంటారు? భారతదేశంలో చూడాల్సిన ప్రదేశాలు లేవా?" ఈ ప్రశ్న చాలామందికి ఎదురయ్యేదే. కానీ దీనికి ప్రముఖ ద ఇండియన్ చిక్ ఇన్‌ఫ్లూయెన్సర్ ఇచ్చిన సమాధానం ఇప్పుడు దేశవ్యాప్తంగా చర్చనీయాంశమైంది. పర్యాటక ప్రాంతాల అందం కంటే.. అక్కడ లభించే 'గౌరవం, భద్రత' వల్లే తాను విదేశీ ప్రయాణాలకు మొగ్గు చూపుతానని ఆమె కుండబద్దలు కొట్టినట్లు చెప్పారు.
ఇటీవల సోషల్ మీడియాలో ఒక రీల్ భారీ చర్చకు దారితీసింది. ఓ ఇన్‌ఫ్లూయెన్సర్ తన తాజా రీల్‌లో భారత్ , విదేశాల మధ్య మహిళల స్వేచ్ఛలో ఉన్న తేడాను స్పష్టంగా చూపించింది. ఆ వీడియో ప్రస్తుతం వైరల్‌గా మారి మహిళల భద్రత, స్వేచ్ఛ, సమాజపు దృష్టికోణంపై గంభీరమైన చర్చను రేకెత్తిస్తోంది.
ఆ వీడియోలో ఏముంది?
ఒక విదేశీ తీర ప్రాంతంలో నిర్మానుష్యమైన రోడ్డుపై ఒంటరిగా సైకిల్ తొక్కుతూ ఆమె ఈ వీడియోను చిత్రీకరించారు. ఆ వీడియోలో ఆమె ప్రధానంగా ప్రస్తావించిన అంశాలు ఇవే "ఇక్కడ నేను ఒంటరిగా ఉన్నా నన్ను ఎవరూ తదేకంగా చూడటం లేదు. నా వేషధారణ గురించి కానీ నా ఒంటరితనం గురించి కానీ ఎవరూ అసభ్యకర వ్యాఖ్యలు చేయడం లేదు. ఎవరైనా వెంబడిస్తారేమో లేదా ఏదైనా జరుగుతుందేమో అన్న భయం లేకపోవడమే అసలైన స్వేచ్ఛ అని ఆమె పేర్కొన్నారు. సురక్షితమైన వాతావరణం ఉన్నప్పుడు మహిళల్లో ఆత్మవిశ్వాసం పెరుగుతుందని.. అది విదేశాల్లో ఎక్కువగా కనిపిస్తుందని అభిప్రాయపడ్డారు.
సోషల్ మీడియాలో పోటెత్తిన స్పందనలు
ఈ రీల్ పోస్ట్ చేసిన కొద్ది సేపటికే వేల సంఖ్యలో కామెంట్లు వచ్చాయి. ఈ చర్చ ప్రధానంగా రెండు కోణాల్లో సాగుతోంది. చాలా మంది మహిళలు ఈ ఇన్‌ఫ్లూయెన్సర్ మాటలతో ఏకీభవిస్తున్నారు. "భారతదేశంలో సాయంత్రం 7 గంటల తర్వాత ఒంటరిగా బయటకు వెళ్లాలంటే వెయ్యి సార్లు ఆలోచించాలి.. రోడ్డుపై నడుస్తున్నప్పుడు ఎదురయ్యే చూపులు మమ్మల్ని అసౌకర్యానికి గురిచేస్తాయి" అంటూ తమ చేదు అనుభవాలను పంచుకుంటున్నారు. మరోవైపు కొందరు ఈ వీడియోను తప్పుబడుతున్నారు. "భారతదేశం మొత్తాన్ని ఒకే తాటిపై కట్టడం సరికాదు.. ఇక్కడ కూడా ఎన్నో సురక్షితమైన నగరాలు ఉన్నాయి.. సమస్య దేశానిది కాదు.. వ్యక్తిగత ప్రవర్తనది" అంటూ వాదిస్తున్నారు. విదేశాల్లో కూడా నేరాలు జరుగుతాయని వారు గుర్తు చేస్తున్నారు.
అసలు సమస్య ఎక్కడ?
ఈ వైరల్ రీల్ కేవలం ఒక ప్రయాణ అనుభవం మాత్రమే కాదు.. అది మన సమాజపు దృష్టికోణాన్ని ప్రశ్నిస్తోంది. చట్టాలు ఎన్ని ఉన్నా.. మహిళ పట్ల సమాజం చూసే చూపు మారనంత వరకు పూర్తి స్వేచ్ఛ లభించదు. భద్రత కల్పించడం అంటే కేవలం రక్షణ ఇవ్వడం మాత్రమే కాదు, భయం లేకుండా తిరగగలిగే వాతావరణాన్ని సృష్టించడం.
మొత్తానికి ఈ వైరల్ రీల్ ఒక చేదు నిజాన్ని మన ముందు ఉంచింది. పర్యాటక రంగం అభివృద్ధి చెందాలన్నా లేదా మహిళా సాధికారత సాధ్యం కావాలన్నా భౌతిక వసతులతో పాటు మానసిక మార్పు కూడా అవసరమని స్పష్టమవుతోంది. "అతిథి దేవో భవ" అని నమ్మే మన దేశంలో మన మహిళలకు 'సొంత గడ్డపైనే పరాయి దేశంలో ఉన్నంత భద్రత' ఎప్పుడు లభిస్తుందనేది ఇప్పుడు మిగిలి ఉన్న అతిపెద్ద ప్రశ్న.
