Begin typing your search above and press return to search.

అమెరికాకు డంకీ రూట్.. అడ్డంగా బుక్కైన ఇద్దరు భారతీయులు

ఇటీవలి దర్యాప్తులలో భాగంగా గత వారం రోజుల క్రితం బ్రిడ్జ్‌వాటర్‌ ప్రాంతంలో బోర్డర్‌ పెట్రోలింగ్‌ సిబ్బంది మొత్తం 16 మంది అక్రమ వలసదారులను అరెస్టు చేశారు.

By:  A.N.Kumar   |   7 Aug 2025 11:00 PM IST
అమెరికాకు డంకీ రూట్.. అడ్డంగా బుక్కైన ఇద్దరు భారతీయులు
X

అమెరికాలోకి అక్రమంగా ప్రవేశించేందుకు యత్నించిన ఇద్దరు భారతీయులను అక్కడి బోర్డర్‌ పెట్రోలింగ్‌ సిబ్బంది అరెస్ట్‌ చేశారు. ఈ ఘటన మెనే రాష్ట్రంలోని బ్రిడ్జ్‌వాటర్‌ సమీపంలోని అమెరికా-కెనడా సరిహద్దులో చోటుచేసుకుంది. అధికారులు వెల్లడించిన వివరాల ప్రకారం, కాలినడకన సరిహద్దు దాటి అమెరికాలోకి ప్రవేశించేందుకు వారు ప్రయత్నించారు. అయితే బోర్డర్‌ గస్తీ సిబ్బంది అప్రమత్తంగా ఉండటంతో వెంటనే వారిని అదుపులోకి తీసుకున్నారు.

- డంకీ రూట్‌ కదలికలు మళ్లీ ఉధృతం?

ప్రస్తుతం అరెస్టులో ఉన్న ఈ ఇద్దరు భారతీయుల వివరాలను అధికారులు ఇంకా వెల్లడించలేదు. కానీ, ఈ ప్రాంతంలో సాధారణంగా ఇటువంటి అక్రమ చొరబాట్లు అరుదుగా జరుగుతుంటాయని చెబుతున్నారు. గత కొన్ని వారాలుగా అమెరికా సరిహద్దుల్లో భద్రతను మరింత కట్టుదిట్టం చేయడంతో, డంకీ రూట్‌ ద్వారా అక్రమంగా ప్రవేశించే ప్రయత్నాలు తగ్గుముఖం పట్టాయని పేర్కొనవచ్చు.

గత వారం 16 మంది అరెస్ట్‌

ఇటీవలి దర్యాప్తులలో భాగంగా గత వారం రోజుల క్రితం బ్రిడ్జ్‌వాటర్‌ ప్రాంతంలో బోర్డర్‌ పెట్రోలింగ్‌ సిబ్బంది మొత్తం 16 మంది అక్రమ వలసదారులను అరెస్టు చేశారు. వీరిలో 13 మంది రొమేనియా పౌరులు, 1 కొలంబియా దేశస్థుడు, ఇద్దరు భారతీయులు ఉన్నారు.

-ట్రంప్ పాలన కఠిన వైఖరి

డంకీ రూట్‌ లేదా ఇతర అక్రమ మార్గాల ద్వారా అమెరికాలోకి ప్రవేశించే వారిపై ప్రస్తుతం ట్రంప్‌ సర్కారు మరింత కఠిన చర్యలు తీసుకుంటోంది. సరైన పత్రాలు లేకుండా అమెరికాలో నివసిస్తున్నవారిని గుర్తించి అరెస్టు చేసి స్వదేశాలకు తిరిగి పంపే ప్రక్రియ కొనసాగుతోంది. అధికారిక గణాంకాల ప్రకారం, గత ఆరు నెలల్లో దాదాపు 1,700 మంది భారతీయులను అమెరికా నుంచి వెనక్కి పంపించారు.

-మిగిలిన భారతీయులకు హెచ్చరిక

ఈ నేపథ్యంలో అమెరికాలో స్థిరపడాలనే ఆశతో అక్రమ మార్గాలు ఎంచుకునే భారతీయులకు ఇది గమనించదగ్గ పరిణామం. డంకీ రూట్‌ మార్గంలో ప్రయాణం చేయడం అనేక రిస్కులతో కూడుకున్నదే కాకుండా, అరెస్టు అయ్యే ప్రమాదం, దేశ బహిష్కరణ కూడా ఎదురవుతుంది. కావున చట్టబద్ధమైన వీసా, పత్రాలతోనే ప్రవేశించేలా ప్రణాళిక సిద్ధం చేయాల్సిన అవసరం ఉందని నిపుణులు సూచిస్తున్నారు.