ఈవీ కార్లు కొనే ప్లాన్ ఉందా? అయితే ఇది మీ కోసమే..
అదేవిధంగా నగరాల్లోని రోడ్లు, షాపింగ్ మాల్స్, మార్కెట్ కాంప్లెక్స్ వద్ద ఏర్పాటు చేసే చార్జింగ్ స్టేషన్ల పరికరాల ధరపై 80 శాతం సబ్సిడీ ప్రకటించింది.
By: Tupaki Political Desk | 30 Sept 2025 12:00 AM ISTవిద్యుత్ కార్లు కొనుగోలు చేసే ఆలోచన ఉన్న వారికి కేంద్రం శుభవార్త చెప్పింది. ఈవీ కారు కొనాలని ఉన్నా, చార్జింగ్ స్టేషన్లు అందుబాటులో లేకపోవడం వల్ల వెనక్కి తగ్గుతున్నవారు ఎక్కువగా ఉండటంతో కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. పర్యావరణ పరిరక్షణకు ఈవీ వాహనాలను ప్రోత్సహించాలని భావిస్తున్న కేంద్రం.. విద్యుత్ వాహనాల వ్యాప్తికి సమస్యగా మారిన చార్జింగ్ స్టేషన్ల విస్తరణకు నడుంచిగించింది. రూ.2,000 వేల కోట్లతో దేశవ్యాప్తంగా 72,300 చార్జింగ్ స్టేషన్లు ఏర్పాటు చేయాలని కేంద్రం నిర్ణయించింది.
కేంద్ర ప్రభుత్వం సొంతంగా చార్జింగ్ స్టేషన్లు ఏర్పాటు చేయాలని భావిస్తోంది. దీనికి సంబంధించి కొన్ని మార్గదర్శకాలను జారీ చేసింది. పీఎం-ఈ డ్రైవ్ కింద ఏర్పాటు చేసిన రూ.10,900 కోట్ల ప్రత్యేక నిధి నుంచి ఈ పథకానికి అవసరమైన 2,000 కోట్లు ఖర్చు చేయనున్నారు. భెల్ ను ఈ చార్జింగ్ స్టేషన్ల ఏర్పాటుకు నోడల్ ఏజెన్సీగా నియమించారు. దీంతో త్వరలో దేశవ్యాప్తంగా విద్యుత్ చార్జింగ్ స్టేషన్లు అందుబాటులోకి వచ్చే అవకాశం ఉందంటున్నారు. దీనివల్ల నిరంతర ప్రయాణానికి అవకాశం చిక్కుతుంది. చార్జింగ్ సమస్య ఉత్పన్నమయ్యే పరిస్థితి లేదంటున్నారు. ప్రస్తుతం పెట్రోల్ బంకుల మాదిరిగానే జాతీయ, రాష్ట్ర రహదారుల పక్కన ఈవీ చార్జింగ్ స్టేషన్లు ఏర్పాటు కానున్నాయని అంటున్నారు.
అయితే చార్జింగ్ స్టేషన్ల ఏర్పాటుకు ప్రభుత్వం కొన్ని మార్గదర్శకాలు ప్రకటించింది. దీని ప్రకారం ప్రభుత్వ కార్యాలయాలు, నివాస సముదాయాలు, ఆస్పత్రులు, విద్యా సంస్థల్లో ఏర్పాటు చేసే ఈవీ చార్జింగ్ స్టేషన్లకు పూర్తి సబ్సిడీ ఇవ్వనున్నారు. కేంద్ర-రాష్ట్ర ప్రభుత్వాలు, ప్రభుత్వ రంగ సంస్థల నిర్వహణ కింద నగరాలు, రహదారులు, రైల్వేస్టేషన్లు, విమానాశ్రయాలు, ఓడ రేవులు, పెట్రోల్ బంకుల వద్ద ఏర్పాటు చేసే చార్జింగ్ స్టేషన్ల యంత్ర పరికరాలపై 70 శాతం నుంచి 80 శాతం సబ్సిడీ ఇవ్వనున్నారు.
అదేవిధంగా నగరాల్లోని రోడ్లు, షాపింగ్ మాల్స్, మార్కెట్ కాంప్లెక్స్ వద్ద ఏర్పాటు చేసే చార్జింగ్ స్టేషన్ల పరికరాల ధరపై 80 శాతం సబ్సిడీ ప్రకటించింది. ఇక బ్యాటరీ స్వాపింగ్, బ్యాటరీ చార్జింగ్ స్టేషన్ల ఏర్పాటుకు కూడా 80 శాతం రాయితీ ఇవ్వనుంది. పది లక్షల కంటే ఎక్కువ జనాభా ఉన్న నగరాలు, స్మార్ట్ సిటీలు, మెట్రోతో అనుసంధానమైన పట్టణాలు, రాష్ట్రాల రాజధానులు, జాతీయ, రాష్ట్ర రహదారులు ఎక్కువగా ఉన్న ప్రాంతాల్లో చార్జింగ్ స్టేషన్ల ఏర్పాటుకు ప్రాధాన్యత ఇస్తున్నట్లు ప్రకటించారు.
దీంతో భవిష్యత్తులో ఈవీ విక్రయాలు పెరిగే అవకాశం ఉందని అంటున్నారు. పెట్రోలో డీజిల్ కార్లతో పోల్చుకుంటే ఈవీ వాహనాల ధర ఎక్కువే. అయినప్పటికీ నిర్వహణ వ్యయం తక్కువగా ఉండటం వల్ల చాలా మంది ఈవీల కొనుగోలుపై ఆసక్తిగా ఉన్నారు. అయితే చార్జింగ్ సమస్యతో ఈవీ కొనుగోలుకు ముందడుగు వేయలేకపోతున్నారు. ప్రయాణాల్లో మధ్యలో చార్జింగ్ తగ్గిపోతే ఇబ్బందులు ఎదరయ్యే అవకాశం ఉండటంతో ప్రస్తుతం నగరాల్లో మాత్రమే ఈవీలు తిరుగుతున్నాయి. దూర ప్రాంతాలకు వెళ్లాలంటే పెట్రోల్, డీజిల్ కార్లనే వాడుతున్నారు. అయితే తాజాగా కేంద్రం తీసుకున్న నిర్ణయంతో ఈ పరిస్థితిలో మార్పు వచ్చే అవకాశం కనిపిస్తోంది.
