మన జెన్-జెడ్ వేరే లెవెల్...వెరీ స్ట్రాంగ్
జెన్ జెడ్ అంటే భయం వేస్తోంది. కొన్ని దేశాలలో ఈ తరం పోకడలు చూస్తే ముచ్చెమటలు పడుతూంటాయి.
By: Satya P | 13 Jan 2026 9:22 AM ISTజెన్ జెడ్ అంటే భయం వేస్తోంది. కొన్ని దేశాలలో ఈ తరం పోకడలు చూస్తే ముచ్చెమటలు పడుతూంటాయి. దేశాన్ని మార్చేద్దామన్న ఉత్సాహంలో వారు చేసే దూకుడుతో ఏకంగా ప్రభుత్వాలే కుప్ప కూలుతున్నాయి. పాలకులే మాజీలు అయి బతుకు జీవుడా అనుకోవాల్సి వస్తోంది. కొంతమంది అయితే ప్రాణాలను అర చేత పట్టుకుని పారిపోవాల్సిన నేపథ్యం ఉంది. భారత్ కి ఇరుగు పొరుగు దేశాలలో చూసినా అలాగే ప్రపంచంలో జరుగుతున్న పరిణామాలు అధ్యయనం చేసినా కూడా ఇదే పోకడ కనిపిస్తుంది. మరీ ఎక్స్ ట్రీం థాట్స్ తో జెన్ జెడ్ ఉంటోంది అన్నది ఓవరాల్ గా ఉన్న భావన. అయితే మన జెన్ జెడ్ మాత్రం అలాంటి వారు కాదని అంటున్నారు.
వారి వరల్డ్ వేరు :
భారతదేశపు జెన్-జెడ్ గ్రేట్ అంటూ కితాబు ఇస్తున్నది ఎవరో కాదు ప్రధాని నరేంద్ర మోడీ. వారు దేశం గర్వించేలా ఉంటున్నారు అని ఆయన అన్నారు. అంతే కాదు వారిది క్రియేట్ వరల్డ్ అని గుర్తు చేశారు. అలా వారు తమదైన శైలిలో నూతన ఆలోచనలు శక్తి సంకల్పం అన్నీ పెట్టి మరీ దేశ ప్రగతిలో పాలు పంచుకుంటున్నారు అని మోడీ కొనియాడారు. భారతీయ యువశక్తి దేశ నిర్మాణంలో ముందువరుసలో ఉందని ప్రధానమంత్రి చెప్పుకొచ్చారు.
యువతే కీలకం :
యువత దేశానికి ఎంతో కీలకం అవుతుందని ఆయన జోస్యం చెప్పారు. న్యూఢిల్లీలో జరిగిన వికసిత్ భారత్ యంగ్ లీడర్స్ డైలాగ్ - 2026 ముగింపు సమావేశంలో ప్రధాని నరేంద్ర మోడీ ప్రసంగిస్తూ మన జెన్ జెడ్ సూపర్ అంటూ ప్రశంసల వర్షం కురిపించారు. ఇక 2047లో దేశానికి స్వాతంత్ర్యం వచ్చి 100 ఏళ్లు పూర్తయ్యే నాటికి ఈనాటి యువత జీవితంలో అత్యంత కీలకమైన సమయం అవుతుందని నరేంద్ర మోదీ స్పష్టం చేశారు. వారికి ఇది ఒక సువర్ణావకాశం అని ఆయన అన్నారు. వారి సామర్థ్యమే భారతదేశ సామర్థ్యం గా మారుతుందని అలా వారి విజయం భారతదేశ విజయాన్ని కొత్త శిఖరాలకు తీసుకువెళ్తుందని నరేంద్ర మోడీ ధీమా వ్యక్తం చేశారు.
యువ భాగస్వామ్యంతో :
యంగ్ లీడర్స్ డైలాగ్ అన్నది ఒక చారిత్రాత్మకమైన ప్రత్యేకమైన కార్యక్రమమని ప్రధానమంత్రి ఈ సందర్భంగా పేర్కొన్నారు. యువ తరానికి ఒక భారీ వేదికగా యంగ్ లీడర్స్ డైలాగ్ మారిందని ప్రధానమంత్రి అన్నారు. ఇది దేశ అభివృద్ధిలో యువతకు ప్రత్యక్ష భాగస్వామ్యాన్ని కల్పించిందని చెప్పుకొచ్చారు. యంగ్ లీడర్స్ డైలాగ్ తనకు సైతం ఒక మేధోమథన కేంద్రంగా మారిందని ఆయన చెప్పడం విశేషం. భారతదేశపు జెన్-జెడ్ సృజనాత్మకతతో నిండి ఉందని యంగ్ లీడర్స్ డైలాగ్ ఇది చాటిచెబుతోందని ఆయన అన్నారు. యంగ్ లీడర్స్ డైలాగ్ కార్యక్రమంలో భాగంగా దేశవ్యాప్తంగా ఉన్న యువత ఢిల్లీలో నిర్వహించిన ప్రదర్శనను నరేంద్ర సందర్శించడమే కాదు యువ నాయకులతో ముచ్చటించి వారి ఆవిష్కరణలు ఆలోచనలను స్వయంగా తెలుసుకున్నారు. ఈ నెల 9 నుండి 12వ తేదీ వరకూ మూడు రోజుల పాటు యంగ్ లీడర్స్ డైలాగ్ ఢిల్లీ వేదికగా జరిగింది. ఇందులో దేశవ్యాప్తంగా వివిధ స్థాయిలలో 50 లక్షల మందికి పైగా యువత పాల్గొన్నారు.
