Begin typing your search above and press return to search.

అమెరికా కల చెదిరిపోలేదు.. దిశ మార్చుకుంది అంతే..

కంటిపాపలా చూసుకున్న బిడ్డ భవిష్యత్తు కోసం ఆ త్యాగం వారి ముఖాల్లో నవ్వులు పూయించేది. కానీ.. కాలం మారింది. ఇప్పుడు ఆ కలలోని ఉత్సాహం స్థానంలో ఒక రకమైన నిశ్శబ్ధం ఆందోళన చోటుచేసుకుంటున్నాయి.

By:  A.N.Kumar   |   29 Sept 2026 3:22 PM IST
అమెరికా కల చెదిరిపోలేదు.. దిశ మార్చుకుంది అంతే..
X

ఒక దశాబ్ధం వెనక్కి వెళితే.. ఇంజినీరింగ్ చివరి సంవత్సరం విద్యార్థి కళ్లలో ఒకటే కల.. అది పాస్ పోర్టు పట్టుకొని.. డాలర్ల దేశంలో అడుగుపెట్టడం.. ఎంఎస్ పూర్తి చేయడం.. అక్కడే ఉద్యోగం సంపాదించడం.. జీవితంలో అనుకున్న స్థాయికి చేరుకోవడం.. ఇవే ఆశలు.. ఇవే ఆశయాలు.. ఈ కల కోసం తల్లిదండ్రులు తమ కష్టార్జితాన్ని అవసరమైతే ఆస్తులను సైతం కుదువపెట్టి లక్షలాది రూపాయల విద్యుత్ రుణాలను తెచ్చేవారు. కంటిపాపలా చూసుకున్న బిడ్డ భవిష్యత్తు కోసం ఆ త్యాగం వారి ముఖాల్లో నవ్వులు పూయించేది. కానీ.. కాలం మారింది. ఇప్పుడు ఆ కలలోని ఉత్సాహం స్థానంలో ఒక రకమైన నిశ్శబ్ధం ఆందోళన చోటుచేసుకుంటున్నాయి.

వీసా నిబంధనల్లో మారుతున్న కఠినత్వాలు... అమెరికా ఉద్యోగ మార్కెట్ ను చుట్టుముట్టిన అనిశ్చితి.. విదేశీ విద్యకు పెరుగుతున్న ఊహించని ఖర్చులు.. ఇవన్నీ నేటి యువతను.. వారి కళ్లకు పట్టిన కలలను ఒక్కసారిగా ఆపి ప్రశ్నిస్తున్నాయి. లక్షల రూపాయలు అప్పులు చేసి అన్యాక్రాంతమైన వాతావరణంలో అడుగుపెట్టి రిస్క్ తీసుకోవడం అవసరమా? అనే ప్రశ్న ప్రతీ ఇంజినీరింగ్ విద్యార్థి మనసులో మెదులుతోంది. తల్లిదండ్రుల భుజాలపై ఉన్న ఆర్థిక భారాన్ని మరింత పెంచడం కంటే.. స్వశక్తితో స్వదేశంలోనే నిలబడాలనే విచక్షణ ఇప్పుడు గెలుస్తోంది.

ఇది కేవలం తాత్కాలిక ట్రెండ్ కాదు.. ఒక తరం ఆలోచన విధానంలో వచ్చిన విప్లవాత్మక మార్పు. నిన్నటి వరకూ క్యాంపస్ ప్లేస్ మెంట్స్ అంటే ‘దొరికితే ఒక ఆప్షన్’ అనుకున్న విద్యార్థులు.. నేడు దాన్నే తమ ఫస్ట్ ఛాయిస్ గా మలుచుకుంటున్నారు. అందుకే చివరి సంవత్సరంలో మొదలవ్వాల్సిన ప్రయత్నాలు.. ఇప్పుడు కాలేజీ రెండో ఏడాది నుంచే కోడింగ్, కమ్యూనికేషన్ స్కిల్స్, ఇంటర్వ్యూ ప్రిపరేషన్ల రూపంలో జోరందుకుంటున్నాయి. భవిష్యత్తులో వచ్చే జాబ్ తుపాన్లను తట్టుకోవడానికి యువత ముందుగానే సిద్ధమవుతోంది.

స్వదేశంలో స్థిరపడాలనే ఆలోచన బాగున్నా.. ఇక్కడి దారులు కూడా పూలబాటలేమీ కావు. క్యాంపస్ రిక్రూట్ మెంట్ కు వచ్చే కంపెనీల సంఖ్య క్రమంగా తగ్గిపోతుండడం కలవరపెడుతోంది. ఒకప్పుడు కాలేజీ ముంగిటకు 50 నుంచి 80 కంపెనీలు వస్తే.. నేడు ఆ సంఖ్య 20 నుంచి 30కి పడిపోవడం చేదునిజం. మరోవైపు ఆఫర్ లెటర్లు వచ్చినా జాయినింగ్ ఎప్పుడు అనే ప్రశ్న విద్యార్థులను నిద్రపోనివ్వడం లేదు. నెలల తరబడి కంపెనీల నుంచి పిలుపు రాక.. అనిశ్చితి మధ్య నలిగిపోతున్న నవతరం వేదన వర్ణనాతీతం.

అయితే ఈ మార్పులు విదేశీ కలలను పూర్తిగా తుడిచిపెట్టేయలేదు. అమెరికా వైపు ఆశగా చూసే కళ్లు ఇంకా ఉన్నాయి. ముందు భారత్ లోనే ఉద్యోగం.. రెండుమూడేళ్ల అనుభవం.. తర్వాత విదేశీ ప్రయాణం అనే కొత్త వ్యూహాన్ని విద్యార్థులు ఎంచుకుంటున్నారు. ఇదే రిస్క్ ను తగ్గిస్తుంది.. ఆత్మవిశ్వాసాన్ని పెంచుతుంది.

అమెరికా డ్రీమ్ కు ప్రస్తుతానికి పూర్తిగా తెరపడలేదు కానీ కెరీర్ భ్రమలు మాత్రంపటాపంచలయ్యాయి. నేటి తరం భావోద్వేగాల కంటే వాస్తవికతకు బాధ్యతకు ఎక్కువ ప్రాధాన్యం ఇస్తున్నారు. డబ్బులు, తల్లిదండ్రుల త్యాగం వెనుక భారం తెలిసిన యువత స్వదేశంలోనే బలమైన పునాధి వేసుకొని ఆపై ప్రపంచాన్ని జయించేందుకు అడుగులేస్తోంది. ఇది విద్యార్థుల ఆలోచనలో వచ్చిన గొప్ప పరిణామంగా చెప్పొచ్చు.