లిఫ్ట్ ఇచ్చిన పాపానికి జైలుకు.. జాబ్ పోగొట్టుకున్న భారతీయుడు
దేశం కాని దేశంలో ఉన్న వేళలో.. అనుక్షణం అప్రమత్తంగా ఉండాల్సిందే. ఏ చిన్న తేడా వచ్చినా పరిణామాలు చాలా దారుణంగా మారటమే కాదు.. కోలుకోలేని దెబ్బ పడే దుస్థితికి చేరుకుంటారు.
By: Garuda Media | 15 Jan 2026 5:00 PM ISTదేశం కాని దేశంలో ఉన్న వేళలో.. అనుక్షణం అప్రమత్తంగా ఉండాల్సిందే. ఏ చిన్న తేడా వచ్చినా పరిణామాలు చాలా దారుణంగా మారటమే కాదు.. కోలుకోలేని దెబ్బ పడే దుస్థితికి చేరుకుంటారు. అందుకే అంటారు.. విదేశాల్లో ఉండే వారు ఎంత విలాసవంతమైన జీవితాన్ని గడుపుతున్నా.. చంటిగాడు లోకల్ అన్నట్లుగా ధీమాగా మాత్రం ఉండలేరు. అనుక్షణం అప్రమత్తంగా ఉంటూ.. ఆచితూచి అన్నట్లుగా తిరగాల్సిన పరిస్థితి. ఏ చిన్న తేడా వచ్చినా మొదటికే మోసం అన్న తరహాలో ఇబ్బందుల్ని ఎదుర్కోవాల్సి వస్తుంది. అలాంటి ఉదంతమే ఒకటి సౌదీ అరేబియాలోని ఒక భారతీయుడికి ఎదురైంది. అసలేం జరిగిందంటే..
సౌదీఅరేబియాలోని జిబాన్ లో ప్రసాద్ అనే భారతీయుడు డ్రైవర్ గా పని చేస్తున్నాడు. ఇటీవల అతను తన డ్యూటీలో భాగంగా వాహనాన్ని డ్రైవ్ చేస్తున్నాడు. ఆ సమయంలో రోడ్డు మీద ఒక వ్యక్తి లిప్టు అడిగాడు. పోన్లే పాపం.. సాయం చేద్దామని భావించిన ప్రసాద్ అతన్ని తన వాహనంలోకి అనుమతించాడు. అతడ్ని ఎక్కించుకొని తన ప్రయాణాన్ని కొనసాగించిన కాసేపటికి పోలీస్ పోస్టు ఎదురైంది.
అక్కడి పోలీసులు ప్రసాద్ వాహనాన్ని తనిఖీ చేయటంతో పాటు.. లిఫ్ట్ ఇచ్చిన వ్యక్తి పత్రాల్ని పరిశీలించారు. అయితే.. సదరు వ్యక్తి యెమన్ కు చెందిన వాడిగా.. సౌదీలోకి అక్రమంగా ప్రవేశించాడన్న విషయాన్ని గుర్తించిన పోలీసులు అతడ్ని.. కారు డ్రైవర్ ప్రసాద్ ను అరెస్టు చేశారు. సాయం చేయబోయిన పాపానికి జైలుకు వెళ్లిన దుస్థితి. దాదాపు నెల రోజుల జైలు అనంతరం.. బయటకు వచ్చాడు.
అనంతరం జాబ్ లోకి చేరేందుకు వెళ్లగా.. సదరు సంస్థ అతడ్ని విధుల్లోకి తీసుకునేందుకు నో చెప్పింది. డ్రైవర్ ఉద్యోగం చేయమంటే.. రోడ్డు మీద వెళ్లే వారికి లిఫ్ట్ ఇస్తావా? అంటూ ప్రశ్నిస్తూ జాబ్ తీసేశారు. అంతేకాదు.. ప్రసాద్ కు రావాల్సిన జీతంతో పాటు.. అతడికి కంపెనీ నుంచి రావాల్సిన జీతంతో పాటు.. కంపెనీ బెనిఫిట్స్ అన్నింటికి నో చెప్పేశారు. దీంతో తీవ్ర ఆర్థిక ఇబ్బందుల్లో పడ్డాడు ప్రసాద్. ఈ నేపథ్యంలో భారత రాయబార కార్యాలయాన్ని సంప్రదించిన ప్రసాద్ ను స్వదేశానికి పంపేందుకు అవసరమైన ఏర్పాట్లు చేస్తున్నారు. ఇలా సాయం కోసం ఎవరో ఏదో అడిగారని.. జాలితో సాయం చేస్తే.. లేని కష్టాల్ని ఆహ్వానించినట్లే అన్న విషయాన్ని అస్సలు మర్చిపోకూడదు. అందులోనూ విదేశాల్లో మరింత అప్రమత్తంగా ఉండాల్సిందే.
