భారత సంతతి డాక్టర్.. అమెరికాలో చేసిన ‘అశ్లీల’ వీడియోల ఘోర నేరాలివీ
డిసెంబర్ 2న ఈ భారత సంతతి డాక్టర్ కు శిక్ష ఖరారు సందర్భంగా అనేక మంది ఈయన బాధితులు ధైర్యంగా కోర్టులో నిలబడి అజాజ్ చర్యలు తమ జీవితాలపై ఎంతటి ప్రభావం, బాధ చూపించాయో వివరించారు.
By: A.N.Kumar | 6 Dec 2025 10:15 PM ISTఅతడో భారత సంతతి డాక్టర్.. చేసేది వైద్య వృత్తి కానీ.. పనులు మాత్రం వక్రబుద్ది.. అమెరికాలో ఈయన చేసిన నేరాల చిట్టా ఇప్పుడు అందరినీ షాక్ కు గురిచేస్తున్నాయి. అమెరికాలోని మిచిగాన్ కు చెందిన ఈ భారత సంతతి డాక్టర్ ఉమైర్ అజాజ్ ముఖ్యంగా మహిళలు, చిన్న పిల్లలను రహస్యంగా రికార్డ్ చేసిన కేసులో నేరం నిరూపితమైంది. ఈ కేసులో 35-60 ఏళ్ల జైలు శిక్ష పడింది. డాక్టర్ గా వైద్యం చేయాల్సిన ఈ డాక్టర్ రోగులు, వారి కుటుంబాలతో తనకున్న పరిచయాన్ని వాడుకొని ఈ నేరాలకు పాల్పడినట్టు తేలింది.
అసలు అజాజ్ నేరాల గుట్టు బయటపెట్టింది ఆయన భార్యనే కావడం గమనార్హం. ఇంట్లో తనను, తమ పిల్లలను , మహిళా బంధువులను అతను రహస్యంగా రికార్డ్ చేస్తున్నట్టుగా ఆమె గుర్తించి పోలీసులకు ఫిర్యాదు చేయడంతో ఈ డాక్టర్ గుట్టు బయటపడింది. పోలీసుల విచారణలో దిమ్మదిరిగే వాస్తవాలు బయటపడ్డారు.
అజాజ్ విచారణలో దాదాపు 31 లైంగికంగా వేధించిన దుష్ప్రవర్తన అభియోగాలను పోలీసులు మోపారు. అయితే నేరాన్ని నేరుగా అంగీకరించపోయినప్పటికీ శిక్షను మాత్రం స్వీకరించడానికి సిద్ధమవడంతో ఈ డాక్టర్ మానసిక పరిస్థితిపై అందరిలోనూ చర్చ మొదలైంది.
డిసెంబర్ 2న ఈ భారత సంతతి డాక్టర్ కు శిక్ష ఖరారు సందర్భంగా అనేక మంది ఈయన బాధితులు ధైర్యంగా కోర్టులో నిలబడి అజాజ్ చర్యలు తమ జీవితాలపై ఎంతటి ప్రభావం, బాధ చూపించాయో వివరించారు. కన్నీళ్లు పెట్టుకున్నారు. డాక్టర్ గా తాము పెట్టుకున్న నమ్మకాన్ని వమ్ము చేశాడు. ‘తల్లిదండ్రులు, పిల్లలు బట్టలు మార్చుకుంటుండగా రికార్డ్ చేసి చూశావు.. ఇంత దారుణానికి ఎలా పాల్పడ్డావు అంటూ బాధితులు నిలదీశారు.
అజాజ్ కోర్టులో మౌనంగా ఉండి ఎలాంటి ప్రతిస్పందనను చూపించలేదు. న్యాయమూర్తి అజాజ్ చర్యలను తీవ్రంగా తప్పుపట్టాడు. ఇంత మంది జీవితాలను నాశనం చేశావని.. మానవ కామాంధుడిలా వ్యవహరించావని.. నిన్ను జైల్లో పెట్టడమే సరైన శిక్ష అంటూ న్యాయమూర్తి తీర్పునిచ్చాడు. ఇటువంటి ప్రవర్తన కలిగిన వ్యక్తిని డాక్టర్ అని పిలవడానికి.. ఏ బాధ్యత అయినా అప్పగించడానికి అర్హుడు కాదంటూ న్యాయమూర్తి స్పష్టం చేశారు.
పోలీసుల విచారణలో అజాజ్ దాదాపు ఆరేళ్లుగా బాధితులను రికార్డు చేస్తున్నాడు. పోలీసులు అజాజ్ పరికరాలను పరిశీలించగా ఆరు కంప్యూటర్లు, నాలుగు ఫోన్లు, 15 హార్డ్ డ్రైవ్ లు దొరికాయి.. ఒక డ్రైవ్ లో ఏకంగా 13వేల వీడియోలు ఉన్నట్టు తేలింది. రోచెస్టర్ హిల్స్ లోని గోల్డ్ ఫిష్ స్విమ్ స్కూల్, ఆస్పత్రి గదులు, బెడ్ రూమ్ లలో కూడా అజాజ్ రికార్డు చేసినట్టు వీడియోల్లో ఉంది. ఛేంజింగ్ రూములలో కెమెరాలను దాచి పెద్దలు, పిల్లలు బట్టలు మార్చుకునే వీడియోలను చిత్రీకరించాడు.
దీంతో కోర్టులో ఇతడికి 35-60 ఏళ్ల వరకూ జైలు శిక్ష పడే అవకాశం ఉందని న్యాయ నిపుణులు తేల్చారు. ఇతడిపై కఠిన చర్యలు తీసుకోవాలని బాధితులు కోరారు.
