Begin typing your search above and press return to search.

అమెరికా వీసా రాలేదని ఎంత పని చేశావమ్మా..?

అమెరికా వీసాకు, భారతీయుల ఆశకు మధ్య గత కొంతకాలంగా తీవ్ర ఘర్షణ జరుగుతున్న సంగతి తెలిసిందే.

By:  Raja Ch   |   24 Nov 2025 4:00 AM IST
అమెరికా వీసా రాలేదని  ఎంత పని చేశావమ్మా..?
X

అమెరికా వీసాకు, భారతీయుల ఆశకు మధ్య గత కొంతకాలంగా తీవ్ర ఘర్షణ జరుగుతున్న సంగతి తెలిసిందే. ఉన్నత చదువులు చదవాలనో, ఉజ్వల భవిష్యత్తు పొందాలనో చాలా మంది భారతీయ యువత అగ్రరాజ్యం వైపు చూస్తుంటారు. అయితే ఇటీవల ట్రంప్ రెండోసారి బాధ్యతలు స్వీకరించిన అనంతరం లెక్కలు మారిపోయాయి. ఈ నేపథ్యలో ఓ తెలుగు వైద్యురాలు ఆత్మహత్య చేసుకున్నారు.

అవును... సుమారు ఏడాది కాలంగా అమెరికా వీసా కోసం ఎదురుచూస్తున్నా.. అక్కడి ప్రభుత్వం తీసుకున్న నిర్ణయంతో ఓ తెలుగు యువ వైద్యురాలికి జే1 వీసా రాలేదు. దీంతో... తీవ్ర మనస్తాపానికి గురైన డాక్టర్ రోహిణి హైదరాబాద్ లోని తన నివాసంలో నిద్రమాత్రలు మింగి ఆత్మహత్య చేసుకున్నారు. దీంతో.. ఆ కుటుంబంలో తీవ్ర విషాదం నెలకొంది.

గుంటూరుకు చెందిన డాక్టర్ రోహిణీ.. ఉన్నత విద్య కోసం అమెరికా వెళ్లాలన్న ఆశయంతో ఎంతో కష్టపడి చదివిందని చెబుతూ కుటుంబ సభ్యులు కన్నీరు మునీరుగా విలపిస్తున్నారు. ప్రస్తుతం ఆమె మృతదేహాన్ని గుంటూరు తరలించారు.

ఏపీలోని గుంటూరుకు చెందిన రోహిణి రష్యాలో ఎంబీబీఎస్ పూర్తి చేశారు. ఆ తర్వాత ఉన్నత చదువులు అమెరికాలో చదవాలని, అక్కడే ప్రాక్టీస్ చేయాలని కలలు కన్నారు. ఈ ప్రయత్నంలో భాగంగానే ఆమె ఇప్పటికే అమెరికా వెళ్లారు.. రెసిడెన్సీ, ప్రాక్టీస్ కు సంబంధించి అన్ని ఏర్పాట్లూ పూర్తి చేసుకున్నారు. ఈ సందర్భంగా.. జే1 వీసా కోసం కూడా దరఖాస్తు చేసుకున్నారు.

అయితే... విదేశీ విద్యార్థులు, నిపుణులకు సంబంధించిన వీసాల విషయంలో అమెరికా అధ్యక్షుడు ట్రంప్ కీలక మార్పులు తీసుకొచ్చిన నేపథ్యంలో ఆమె అమెరికాను వీడి భారత్ కు రావాల్సి వచ్చిందని చెబుతున్నారు. ఈ క్రమంలో.. హైదరాబాద్ నుంచే అమెరికాలో జే1 వీసా కోసం ఆమె ప్రయత్నాలు చేశారు! ఇందులో భాగంగా మొదటి మూడు విడతల టెస్ట్ లను క్లియర్ చేశారు!

ఈ సమయంలో.. అమెరికాలో ప్రాక్టీస్ కు సంబంధించి వెంటనే ఉద్యోగంలో చేరాలని ఫోన్ కాల్స్ ఎక్కువవ్వడంతో.. తన అమెరికా కల కలగానే మిగిలిపోతుందనా అనే నిరాశ, ఆందోళన ఆమెలో ఎక్కువైందని అంటున్నారు. ఆ డిప్రెషన్ లోనే నిద్రమాత్రలు మింగి ఆత్మహత్య చేసుకున్నట్లు చెబుతున్నారు!