అమెరికా సంయుక్త రాష్ట్రాలలో హిందూ దేవాలయాలు.. ఎక్కడ ఎన్ని ఉన్నాయంటే?
అమెరికా అంటే కేవలం ఆకాశం పైన ఎగిరే విమానం, ఆధునిక జీవనశైలి మాత్రమే కాదు.. అక్కడ మన భారతీయ సంస్కృతి, ఆధ్యాత్మికత కూడా వెల్లివిరుస్తోంది.
By: Madhu Reddy | 24 Feb 2026 12:08 PM ISTఅమెరికా అంటే కేవలం ఆకాశం పైన ఎగిరే విమానం, ఆధునిక జీవనశైలి మాత్రమే కాదు.. అక్కడ మన భారతీయ సంస్కృతి, ఆధ్యాత్మికత కూడా వెల్లివిరుస్తోంది. స్థిరపడిన భారతీయుల సంఖ్య పెరుగుతున్న కొద్దీ, అక్కడ హిందూ దేవాలయాల నిర్మాణం కూడా భారీగా పెరిగింది. కాలిఫోర్నియా నుంచి న్యూయార్క్ వరకు, అలాస్కా నుంచి హవాయి వరకు అమెరికాలోని దాదాపు ప్రతి రాష్ట్రంలోనూ ఇప్పుడు మన దేవాలయాలు కనిపిస్తున్నాయి. అగ్రరాజ్యంలో మన భక్తి భావం ఏ స్థాయిలో విస్తరించిందో ఈ గణాంకాలు చూస్తే అర్థమవుతుంది.
న్యూయార్క్, ఫ్లోరిడా తర్వాతి స్థానాల్లో:
అమెరికాలో అత్యధికంగా హిందూ దేవాలయాలు ఉన్న రాష్ట్రంగా కాలిఫోర్నియా నిలిచింది. ఇక్కడ ఏకంగా 105 ఆలయాలు భక్తులకు సేవలందిస్తున్నాయి. సిలికాన్ వ్యాలీ వంటి ప్రాంతాల్లో భారతీయుల సంఖ్య ఎక్కువగా ఉండటమే దీనికి ప్రధాన కారణం. దీని తర్వాత న్యూయార్క్‌లో 90 ఆలయాలు, ఫ్లోరిడాలో 61 ఆలయాలు ఉన్నాయి. మన తెలుగు వారు ఎక్కువగా ఉండే టెక్సాస్‌లో 55 దేవాలయాలు ఉండగా, ఇల్లినాయిస్‌లో 40, జార్జియాలో 35 ఆలయాలు కొలువై ఉన్నాయి. ఈ రాష్ట్రాల్లో వీకెండ్ వస్తే చాలు మన గుడులన్నీ భక్తులతో కళకళలాడుతుంటాయి.
మధ్యస్థ రాష్ట్రాల్లోనూ విస్తరిస్తున్న ఆధ్యాత్మికత!:
పెద్ద రాష్ట్రాలే కాకుండా, అమెరికాలోని ఇతర ప్రాంతాల్లోనూ హిందూ ఆలయాల సంఖ్య గణనీయంగా ఉంది. మేరీల్యాండ్ మరియు ఓహియో రాష్ట్రాలలో చెరో 23 ఆలయాలు ఉండగా, అరిజోనా మరియు వాషింగ్టన్ రాష్ట్రాల్లో 13 చొప్పున ఉన్నాయి. ఇండియానా, విస్కాన్సిన్, మిస్సోరి వంటి రాష్ట్రాల్లో కూడా 7 నుంచి 9 ఆలయాలు భక్తులకు కనువిందు చేస్తున్నయి. వర్జీనియా, కెంటకీ, లూసియానా మరియు అలబామా వంటి రాష్ట్రాల్లో చెరో 5 దేవాలయాలు ఉన్నాయి. చిన్న చిన్న రాష్ట్రాల్లో సైతం మన సంస్కృతిని కాపాడుకోవడానికి ప్రవాస భారతీయులు చేస్తున్న కృషి నిజంగా అభినందనీయం.
ఒకే ఒక్కడైనా మన దేవుడున్నాడు:
విశేషం ఏమిటంటే, అమెరికాలోని అత్యంత శీతల ప్రాంతమైన అలాస్కాలో కూడా ఒక హిందూ దేవాలయం ఉంది. అలాగే పర్యాటక కేంద్రమైన హవాయిలో 2 ఆలయాలు ఉండటం విశేషం. సౌత్ డకోటా, నెబ్రాస్కా, నెవాడా, న్యూ మెక్సికో, ఓక్లహోమా, అర్కాన్సాస్ మరియు వెర్మాంట్ వంటి రాష్ట్రాల్లో ప్రస్తుతానికి ఒక్కొక్క ఆలయం చొప్పున ఉన్నాయి. సంఖ్య ఏదైనా, అమెరికాలోని ప్రతి మూలనా 'ఓంకార' నాదం వినిపిస్తోందన్నమాట. అక్కడ పుట్టి పెరుగుతున్న తర్వాతి తరానికి మన ఆచార వ్యవహారాలను అందించడంలో ఈ ఆలయాలు కీలక పాత్ర పోషిస్తున్నాయి.
విదేశాల్లో ఉన్నా మన మూలాలను మర్చిపోకుండా, ఇంత పెద్ద ఎత్తున ఆలయాలను నిర్మించుకోవడం భారతీయుల ఐక్యతకు నిదర్శనం. అమెరికాలో హిందూ ధర్మం మరింతగా వెలుగుతోంది.
