Begin typing your search above and press return to search.

ఇండియన్ల సెలబ్రేషన్స్.. కెనడియన్ల టెన్షన్స్!

అయితే టొరంటో వీధుల్లో ఇటీవల జరిగిన ఒక కల్చరల్ ఫెస్ట్ ఇప్పుడు కెనడా రాజకీయాలు, వలస విధానాలు, చివరకు సోషల్ మీడియా యుద్ధాలకు ఒక హాట్ టాపిక్‌గా మారింది.

By:  A.N.Kumar   |   5 Jun 2026 9:00 PM IST
ఇండియన్ల సెలబ్రేషన్స్.. కెనడియన్ల టెన్షన్స్!
X

ప్రపంచంలో ఎక్కడ ఏ వేడుక జరిగినా మన భారతీయులు ఉంటే అక్కడ జోష్ వేరేలా ఉంటుంది. ముఖ్యంగా 'మినీ ఇండియా'గా పిలవబడే కెనడాలో మనోళ్ల హడావుడి గురించి ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. అయితే టొరంటో వీధుల్లో ఇటీవల జరిగిన ఒక కల్చరల్ ఫెస్ట్ ఇప్పుడు కెనడా రాజకీయాలు, వలస విధానాలు, చివరకు సోషల్ మీడియా యుద్ధాలకు ఒక హాట్ టాపిక్‌గా మారింది. దానికి కారణం ఏంటో తెలుసా? మన భారతీయులు కాస్త గట్టిగా సంగీతం పెట్టుకుని రోడ్డుపై డ్యాన్సులు చేయడమే..

అవును.. మీరు విన్నది నిజమే. ఒక రోడ్డు జంక్షన్ వద్ద నిర్వహించిన సాంస్కృతిక కార్యక్రమంలో కొందరు భారతీయులు రంగురంగుల సాంప్రదాయ దుస్తులతో లౌడ్ స్పీకర్లలో బాలీవుడ్, పంజాబీ బీట్స్‌కు మాస్ స్టెప్పులేస్తూ సందడి చేశారు. ఈ వేడుకకు సంబంధించిన వీడియో కాస్తా సోషల్ మీడియాలో వైరల్ కావడంతో అసలు 'షో' అక్కడ మొదలైంది. డ్యాన్స్ ఫ్లోర్‌పై మనోళ్లు చూపించిన హీట్ కంటే, ఎక్స్, ఇన్‌స్టాగ్రామ్ కామెంట్ సెక్షన్‌లోనే ఎక్కువ మంటలు రేగాయి.

ఇది టొరంటోనా.. తిరుమలపురమా?

వీడియో చూసిన కొందరు స్థానిక కెనడియన్లు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. "అసలు ఇది కెనడానా? లేక కొత్త ఇండియానా?" అంటూ నెట్టింట ప్రశ్నల వర్షం కురిపించారు. మరికొందరైతే ఒక అడుగు ముందుకు వేసి.. "ఇలా చూస్తుంటే మరో పదేళ్లలో టొరంటో పేరు కాస్తా 'తిరుమలపురం' లేదా 'అమృత్‌సర్ నగర్'గా మారిపోయేలా ఉంది" అని వ్యంగ్యంగా కామెంట్లు పెడుతున్నారు. దేశం మొత్తం ఇండియన్ కాలనీగా మారిపోకముందే వలసలను పూర్తిగా అడ్డుకోవాలని కెనడా ప్రభుత్వానికి ట్యాగ్‌లు చేస్తూ సోషల్ మీడియాలో పిలుపునిస్తున్నారు.

డ్యాన్స్ చేశారే గానీ.. దేశాన్ని ఆక్రమించలేదుగా!

అయితే ఈ విమర్శలకు మన దేశీ నెటిజన్లు , వలసదారుల మద్దతుదారులు కూడా అదే స్థాయిలో స్ట్రాంగ్ కౌంటర్లు ఇస్తున్నారు. కెనడా అనేది వలసదారుల రక్తం, చెమటతో ఎదిగిన దేశమని, ఇక్కడి ఆర్థిక వ్యవస్థకు భారతీయులే ప్రధాన బలమని గుర్తు చేస్తున్నారు. "కెనడియన్లు హాకీ మ్యాచ్ గెలిచినా వీధుల్లో రచ్చ చేస్తారు, తాగి గొడవలు చేస్తారు.. అప్పుడు లేని తప్పు, ఇండియన్లు ప్రశాంతంగా డ్యాన్స్ చేస్తే ఆక్రమణగా కనిపిస్తుందా?" అంటూ నెటిజన్లు సెటైర్లు పేలుస్తున్నారు. వాళ్లు డ్యాన్స్ చేశారే గానీ, గన్‌లు పట్టుకుని దేశాన్ని ఆక్రమించలేదుగా.. కాస్త ఓపిక పట్టండి బాస్ అంటూ రీ-ట్వీట్‌లతో హోరెత్తిస్తున్నారు.

మీమర్స్‌కు దొరికిన పెద్ద పండుగ!

ఇక సోషల్ మీడియాలో మీమర్స్‌కు అయితే ఇది ఒక పెద్ద పండుగలా మారింది. ఈ ఇష్యూపై రకరకాల జోకులు పేలుస్తున్నారు. "ఇండియన్లు ప్రపంచంలో ఎక్కడికి వెళ్లినా రెండు వస్తువులు తప్పకుండా తమ బ్యాగుల్లో తీసుకెళ్తారు.. ఒకటి గరం మసాలా.. రెండోది బ్లూటూత్ స్పీకర్" అంటూ ఫన్నీ పోస్టులు పెడుతున్నారు.

మరికొందరు కెనడాలోని ప్రస్తుత పరిస్థితులను ఎద్దేవా చేస్తూ.. "కెనడాలో ఇళ్ల ధరలు పెరిగినా ఇండియన్ల తప్పు.. అక్కడ చలి ఎక్కువైనా ఇండియన్ల తప్పు.. చివరకు వర్షం పడినా అది ఇండియన్ల వల్లే " అంటూ స్థానికుల అతి జాగ్రత్తపై వ్యంగ్య బాణాలు విసురుతున్నారు.

మొత్తానికి టొరంటో వీధుల్లో కేవలం సరదాగా మొదలైన ఒక డ్యాన్స్ ప్రోగ్రామ్.. ఇప్పుడు కెనడాలో అంతర్జాతీయ వలస విధానాలు, స్థానిక హక్కులపై పెద్ద చర్చకు దారితీసింది. అక్కడ రాజకీయాలు ఎలా ఉన్నా, ఈ మొత్తం వివాదంలో స్పష్టంగా కనిపిస్తున్న విషయం ఒక్కటే.. ప్రపంచంలో ఎక్కడైనా భారతీయులు డ్యాన్స్ చేసినా వార్తే... చేయకపోయినా వార్తే భవిష్యత్తులో కెనడా వీధుల్లో 'భాంగ్రా' స్టెప్పులు వినిపిస్తాయో లేక సైలెన్స్ రూల్స్ వస్తాయో చూడాలి..