హార్మూజ్ అయిపోయింది.. ఇక ఎర్ర సముద్రంలో మొదలైంది.. భారత నౌకపై భీకర దాడి
అందిన ప్రాథమిక సమాచారం ప్రకారం.. భారతీయ జెండాతో ప్రయాణిస్తున్న ఎంఎస్‌వి ఫైజ్ నూరే ఒలియా అనే కార్గో నౌక యెమెన్ తీరానికి సమీపంలో ప్రయాణిస్తుండగా ఈ ప్రమాదం చోటుచేసుకుంది.
By: A.N.Kumar | 5 Aug 2026 12:16 PM ISTప్రపంచవ్యాప్తంగా రోజురోజుకూ పెరుగుతున్న భౌగోళిక , రాజకీయ ఉద్రిక్తతలు అంతర్జాతీయ సముద్ర రవాణా రంగాన్ని తీవ్ర భయాందోళనలకు గురిచేస్తున్నాయి. ఇప్పటికే హార్మూజ్ లో అమెరికా, ఇరాన్ ఫైట్ తో అక్కడ నుంచి నౌకల ప్రయాణం బంధ్ అయ్యింది. ఇప్పుడు ఎర్ర సముద్రం ప్రాంతం గత కొంతకాలంగా వాణిజ్య నౌకలకు అత్యంత ప్రమాదకరమైన మార్గంగా మారింది. ఇటీవల పలు సముద్ర మార్గాల్లో జరిగిన దాడుల్లో కొందరు భారతీయులు ప్రాణాలు కోల్పోయిన విషాదకర ఘటనలు మరవకముందే తాజాగా భారతీయ జెండాతో ప్రయాణిస్తున్న ఒక వాణిజ్య కార్గో నౌకపై క్షిపణి దాడి జరగడం అంతర్జాతీయంగా పెద్ద కలకలం రేపింది.
అందిన ప్రాథమిక సమాచారం ప్రకారం.. భారతీయ జెండాతో ప్రయాణిస్తున్న ఎంఎస్‌వి ఫైజ్ నూరే ఒలియా అనే కార్గో నౌక యెమెన్ తీరానికి సమీపంలో ప్రయాణిస్తుండగా ఈ ప్రమాదం చోటుచేసుకుంది. యెమెన్‌లోని హౌతీ తిరుగుబాటుదారుల నియంత్రణలో ఉన్న హోదైదా తీరానికి దక్షిణంగా సుమారు 13 నాటికల్ మైళ్ల దూరంలో ఈ క్షిపణి దాడి జరిగింది. దాడి తీవ్రతకు నౌక తీవ్రంగా దెబ్బతిని.. కొద్దిసేపటికే సముద్రంలో జలసమాధి అయింది.
అయితే ఈ ప్రమాదంలో ఎలాంటి ప్రాణనష్టం జరగకపోవడం అందరికీ పెద్ద ఊరటనిచ్చే అంశం. నౌక సముద్రంలో మునిగిపోతున్న సమయంలో సమాచారం అందుకున్న యెమెన్ కోస్ట్ గార్డ్ సిబ్బంది వెంటనే రంగంలోకి దిగి రెస్క్యూ ఆపరేషన్ చేపట్టారు. నౌకలో ఉన్న 13 మంది భారతీయ నావికులను వారు సురక్షితంగా రక్షించి.. అనంతరం వారందరినీ భద్రంగా మొఖా నౌకాశ్రయానికి తరలించారు. ప్రయాణికులందరూ పూర్తి ఆరోగ్యంతో ఎలాంటి గాయాలు లేకుండా క్షేమంగా ఉన్నారని అధికారులు అధికారికంగా ధృవీకరించారు.
గత కొన్ని నెలలుగా ఎర్ర సముద్రంలో వాణిజ్య నౌకలను లక్ష్యంగా చేసుకుని జరుగుతున్న వరుస దాడులు అంతర్జాతీయ సరఫరా వ్యవస్థపై తీవ్ర ప్రతికూల ప్రభావాన్ని చూపుతున్నాయి. అనేక అంతర్జాతీయ షిప్పింగ్ కంపెనీలు తమ నౌకలను సుదీర్ఘమైన ప్రత్యామ్నాయ మార్గాల వైపు మళ్లిస్తున్నాయి. దీనివల్ల ఆసియా , యూరప్ ఖండాల మధ్య సరుకు రవాణా సమయం పెరగడమే కాకుండా ఇన్సూరెన్స్ ఛార్జీలు, ఇంధన ఖర్చులు విపరీతంగా పెరిగిపోయి గ్లోబల్ ట్రేడ్‌పై తీవ్ర ఆర్థిక భారం పడుతోంది.
ఈ ఘటనపై భారత ప్రభుత్వం తీవ్ర ఆందోళన వ్యక్తం చేసింది. నిరపరాధులైన పౌర నావికులు, వాణిజ్య నౌకలపై ఇలాంటి దాడులకు పాల్పడటాన్ని కేంద్ర ప్రభుత్వం ఖండిస్తూ అంతర్జాతీయ సముద్ర మార్గాల్లో ప్రయాణించే నావికుల భద్రతకు అన్ని దేశాలు అత్యున్నత ప్రాధాన్యత ఇవ్వాలని పిలుపునిచ్చింది. ప్రపంచ వాణిజ్యం సజావుగా సాగాలంటే ప్రశాంత వాతావరణం అత్యంత కీలకమని స్పష్టం చేసింది. ఎర్ర సముద్రంలో వరుసగా చోటుచేసుకుంటున్న ఇలాంటి ఘటనలు ప్రపంచ సముద్ర భద్రతకు కొత్త సవాళ్లను విసురుతున్న నేపథ్యంలో అంతర్జాతీయ సమాజం కలిసి ఉమ్మడి చర్యలు తీసుకుని వాణిజ్య నౌకల భద్రతను మరింత బలోపేతం చేయాల్సిన అవసరం ఎంతైనా ఉంది.
