దుబాయ్ లో హోమ్ లోన్ కావాలా నాయనా... ఇవి ఉంటే చాలు!
దుబాయ్ రియల్ ఎస్టేట్ లో భారతీయుల పాత్ర రోజు రోజుకీ గణనీయంగా పెరుగుతోందని అంటున్నారు.
By: Raja Ch | 26 Nov 2025 5:00 PM ISTదుబాయ్ రియల్ ఎస్టేట్ లో భారతీయుల పాత్ర రోజు రోజుకీ గణనీయంగా పెరుగుతోందని అంటున్నారు. వాస్తవానికి భారత్ లోని పలు మెట్రో నగరాల్లో ఇళ్ల ధరలు ఆకాశానికి వచ్చాయని సామాన్యుడు ఆవేదన చెందుతోన్న వేళ.. పలువురు భారతీయులు దేశంలోనే కాకుండా దుబాయ్ లోను అధికంగా ఇళ్ల కొనుగోళ్లపై పెట్టుబడులు పెడుతున్నారు. ఈసమయంలో హోమ్ లోన్స్ అంశం తెరపైకి వచ్చింది.
అవును... దుబాయ్ రియల్ ఎస్టేట్ లో భారతీయుల పాత్ర రోజు రోజుకీ పెరుగుతుందనే కామెంట్లు వినిపిస్తున్నాయి. ఈక్రమంలో 2024లో దుబాయ్ లో భారతీయులు సుమారు 35 బిలియన్ దిర్హమ్ లకు పైగా పెట్టుబడులు పెట్టినట్లు చెబుతున్నారు. గత కొన్నేళ్లుగా దుబాయ్ రియల్ ఎస్టేట్ మార్కెట్ లో భారీ వృద్ధిని ఇది చూపిస్తోంది. దీన్ని మరింత ప్రోత్సహించే కార్యక్రమాలు పెరుగుతున్నాయి.
84 వేల కోట్ల పెట్టుబడి పెట్టిన భారతీయులు!:
2024లో దుబాయ్ రియల్ ఎస్టేట్ లో పెట్టుబడులు పెట్టడానికి భారతీయులు ఉత్సాహం చూపించినట్లు గణాంకాలు చెబుతున్నాయి. ఇందులో భాగంగా ఆ ఒక్క ఏడాదిలోనే దుబాయ్ లో భారతీయుల పెట్టుబడులు సుమారు 35 బిలియన్ దిర్హమ్ లు అని చెబుతున్నారు. అంటే... మన కరెన్సీలో 84 వేల కోట్ల రూపాయలకు పైబడే అన్నమాట.
ఇదే క్రమంలో... 2025 లోనూ అదే ఉత్సహాం భారీగా కనబరుస్తున్నారని అంటున్నారు. ఇందులో భాగంగా... ఈ ఏడాది మొదటి అర్ధభాగంలో దుబాయ్ లో మొత్తం పెట్టుబడుల విలువ 431 బిలియన్ దిర్హమ్ లకు పెరిగింది. ఇది 25% వృద్ధిని సూచిస్తుంది. ఈ క్రమంలో 2015 నుంచి 2023 మధ్య భారతీయులు దుబాయ్ లో 120 బిలియన్ దిర్హమ్ లకు పైగా పెట్టుబడులు పెట్టారని చెబుతున్నారు.
హోమ్ లోన్ ఇవ్వడానికి ముందుకొస్తున్న బ్యాంక్ లు!:
ట్యాక్స్ ఫ్రీ రెంటల్ ఇన్ కమ్, గోల్డెన్ వీసా, డెవలపర్ పేమెంట్ ప్లాన్ లు మరింత ఆకర్షణీయంగా మారిన వేళ.. దుబాయ్ లో భారతీయుల ఇళ్లు కొనుగోళ్లు పెరుగుతున్నాయి. ఈ సమయంలో వారిని మరింత ప్రోత్సహించేందుకు అన్నట్లుగా.. దుబాయ్ లో ఇళ్లు కొనుగోళ్లకు యూఏఈ బ్యాంకులు హోమ్ లోన్ ఆఫర్ చేస్తున్నాయి! దీనికి సంబంధించిన పలు కండిషన్స్ తాజాగా తెరపైకి వచ్చాయి.
ఇందులో భాగంగా... భారత్ లో ఉద్యోగం చేస్తూ ఉంటే.. శాలరీ స్లిప్, బ్యాంక్ స్టేట్ మెంట్, ట్యాక్స్ రిటర్న్స్ చూపిస్తే దుబాయ్ లో హోమ్ లోన్ ఇస్తారు. అయితే.. భారత్ లో నివసించేవారికి యూఏఈ బ్యాంకులు డైరెక్ట్ గా లోన్ ఇవ్వవు. అందుకు ఆర్బీఐ అనుమతి అవసరం. యూఏఈ బ్యాంకుల నుంచి మార్ట్ గేజ్ లోన్ పొందాలంటే కనీస వేతనం ఏఈడీ 15,000 ఉండాలి. అంటే.. భారత కరెన్సీలో రూ.3.3 లక్షలన్నమాట.
వాస్తవానికి దుబాయ్ తొలిసారిగా హోమ్ ఓనర్ షిప్ ఇనీషియేటివ్ ద్వారా 2025లో ఆఫర్లు ఇచ్చింది. ఈ నేపథ్యంలో... ఈఏడాది సుమారు 29,000 మంది భారతీయులు దుబాయ్ లో 35,000 ఇళ్లు కొనుగోలు చేసినట్లు చెబుతున్నారు!
