Begin typing your search above and press return to search.

నేటి తరం పెళ్లి ముచ్చట్లు : ఉద్యోగం వచ్చేసింది.. సెటిల్ అయ్యాం.. కానీ పిల్లను మాత్రం మమ్మీ-డాడీనే వెతకాలి

చదువు పూర్తయింది.. ఐటీ కంపెనీలో ఐడంకెలా జీతం వచ్చే ఉద్యోగం దొరికింది, క్రెడిట్ కార్డుపై ఈఎంఐ పెట్టి కారు కూడా కొనేశాం.

By:  A.N.Kumar   |   6 July 2026 3:00 PM IST
నేటి తరం పెళ్లి ముచ్చట్లు : ఉద్యోగం వచ్చేసింది.. సెటిల్ అయ్యాం.. కానీ పిల్లను మాత్రం మమ్మీ-డాడీనే వెతకాలి
X

చదువు పూర్తయింది.. ఐటీ కంపెనీలో ఐడంకెలా జీతం వచ్చే ఉద్యోగం దొరికింది, క్రెడిట్ కార్డుపై ఈఎంఐ పెట్టి కారు కూడా కొనేశాం. ఇంకేం కావాలి? లైఫ్‌లో సెటిల్ అయిపోయాం! ఇక మిగిలింది పెళ్లే. కానీ ఇక్కడే ట్విస్ట్ ఉంది. ఆఫీసులో మేనేజర్లు ఇచ్చే టార్గెట్లను ఈజీగా రీచ్ అయిపోయే నేటి తరం యువతీ యువకులు.. తమ లైఫ్ పార్ట్‌నర్‌ను వెతుక్కునే టార్గెట్‌ను మాత్రం ఇప్పటికీ హోమ్ మినిస్టర్లు అయిన 'మమ్మీ-డాడీ'లకే వదిలేస్తున్నారు.

భారతదేశంలో పెళ్లి వయసు పెరుగుతున్నా, పెద్దలు కుదిర్చిన పెళ్లిళ్ల హవా మాత్రం అస్సలు తగ్గడం లేదని తాజా సర్వే చెబుతోంది. "మనం ఎంత మోడరన్ అయినా.. మన రూట్స్ మారవు బ్రదర్!" అనే రేంజ్‌లో ఈ ట్రెండ్ నడుస్తోంది.

28 ఏళ్లకు పెళ్లా? నువ్వు ఇంకా పిల్లాడివే నాయనా

గత 15 ఏళ్లతో పోలిస్తే భారతీయుల సగటు వివాహ వయసు మరో రెండేళ్లు పెరిగింది. ప్రస్తుతం మగాళ్లు సగటున 28 ఏళ్లకు, ఆడవాళ్లు 26 ఏళ్లకు పీటలు ఎక్కుతున్నారు. ఉన్నత విద్య, కెరీర్ గోల్స్, బ్యాంక్ బ్యాలెన్స్, వీటన్నింటికీ మించి 'వ్యక్తిగత స్వేచ్ఛ'. ఈ వయసు పెరిగినా ప్రపంచంలోనే అత్యంత పిన్న వయసులో పెళ్లిళ్లు చేసుకునే మగాళ్లు మన దేశంలోనే ఉన్నారట.. పాపం ఆస్ట్రేలియా మగాళ్లను చూస్తే జాలేస్తుంది. అక్కడ సగటున 39.3 ఏళ్లకు గానీ పెళ్లి చేసుకోరట. అంటే పాతికేళ్లకే మనవాళ్లు 'లైఫ్ అయిపోయింది బాబోయ్' అని ఫీల్ అవుతుంటే అక్కడ 40 ఏళ్లు వచ్చినా 'ఐ యామ్ స్టోరీ ఇంకా బాకీ హై' అంటూ తిరుగుతున్నారు. పాశ్చాత్య దేశాల ట్రెండ్ చూస్తే.. మన దేశంలో 28 ఏళ్లకే పెళ్లి చేసుకుంటున్నారంటే, వాళ్ల దృష్టిలో మనం ఇంకా 'పిల్లలమే' అన్నమాట!

డేటింగ్ యాప్‌లు వేస్ట్.. అమ్మమ్మ మాటలే బెస్ట్

స్వైప్ రైట్, స్వైప్ లెఫ్ట్ అంటూ టిండర్, బంబుల్ యాప్‌లలో వేళ్లు అరిగిపోయేలా వెతికినా.. చివరికి దేశంలో జరిగే 85 శాతం పెళ్లిళ్లు ఇప్పటికీ పెద్దలు కుదిర్చినవేనట. ప్రేమాయణాలు, ఆన్‌లైన్ మ్యాట్రిమోనీ ప్రొఫైళ్లు ఎన్ని ఉన్నా, చివరికి అమ్మ-నాన్న ఓకే అనాల్సిందే. ఆఫీసులో కోట్లకు కోట్లు ప్రాజెక్టులు హ్యాండిల్ చేసే టెక్కీలు కూడా.. ఇంట్లో పెళ్లి సంబంధం అనగానే సైలెంట్‌గా తల ఊపేస్తున్నారు.

కోడింగ్ వచ్చినా.. జాతకం కుదరాల్సిందే!

ఇక సాంకేతికత ఎంత పెరిగినా.. 'గ్రహాల' బలం ముందు 'గూగుల్' కూడా పనిచేయడం లేదు. 65 శాతం కుటుంబాలు పెళ్లి చూపులకు ముందే బయోడేటాతో పాటు 'జాతక చక్రం' తప్పనిసరిగా అడుగుతున్నాయి. అబ్బాయికి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ లో కోడింగ్ వచ్చినా.. జాతకంలో రాహు-కేతువులు కుదరకపోతే ఆ సంబంధం రిజెక్ట్ అవ్వాల్సిందే. ఉద్యోగం, శాలరీ, ఫ్యామిలీ బ్యాక్‌గ్రౌండ్‌తో పాటు 'కుజ దోషం' ఉందా లేదా అనేది ఇప్పటికీ హాట్ టాపిక్.

మోడరన్ మైండ్.. సంప్రదాయ హార్ట్!

దీన్నిబట్టి తేలింది ఏంటంటే.. భారతీయ యువత ఆఫీసుల్లో ఎంత ఆధునికంగా కనిపిస్తున్నా ఇంట్లోకి వచ్చేసరికి మాత్రం పక్కా సంప్రదాయవాదులే. అమ్మాయి/అబ్బాయి నచ్చినా.. కుటుంబాల అంగీకారం, పెద్దల ఆశీస్సులు ఉంటేనే ఆ బంధం గట్టిగా ఉంటుందని నమ్ముతున్నారు.

అందుకే బాస్.. మనవాళ్లు ఎంత చదువుకున్నా, ఎంత సంపాదించినా.. పెళ్లి పందిట్లోకి వచ్చేసరికి "అమ్మ చెప్పిన అమ్మాయే.. నాన్న మెచ్చిన అబ్బాయే" సూపర్ హిట్ ఫార్ములా. నేటి తరం యువత స్మార్ట్‌గా ఆలోచిస్తూనే, కుటుంబ వ్యవస్థకు ఇస్తున్న ఈ రెస్పెక్ట్ నిజంగా మెచ్చుకోదగ్గదే.. లేదా పెద్దలతో పెట్టుకుంటే ఆస్తులు రావనే భయమేమో.. ఏదైతేనేం పెళ్లయితే అవుతోంది కదా!