Begin typing your search above and press return to search.

మనోళ్లు పే..ద్ద విలుకాళ్లు.. ఆసియా క్రీడల్లో భారత్ 'గోల్డెన్ హ్యాట్రిక్'తో మూడు స్వర్ణాలు

మహిళలు, మిక్స్‌డ్ జట్ల స్ఫూర్తితో పురుషుల కాంపౌండ్ టీమ్ ఈవెంట్‌లో కుశాల్ దలాల్, సాహిల్ రాజేశ్ జాదవ్, గణేశ్ మణిరత్నం తిరుమూరులతో కూడిన భారత జట్టు బరిలోకి దిగింది.

By:  A.N.Kumar   |   30 Sept 2026 3:20 PM IST
మనోళ్లు పే..ద్ద విలుకాళ్లు.. ఆసియా క్రీడల్లో  భారత్ గోల్డెన్ హ్యాట్రిక్తో మూడు స్వర్ణాలు
X

విశ్వవేదికపై భారత ధనుర్విద్య సత్తా చాటుతూ.. గురి తప్పని బాణాల్లా స్వర్ణ పతకాలు విరుచుకుపడ్డాయి.. ఒత్తిడిని అధిగమించి, ఆశయాలను ఎక్కుపెట్టి.. ఒకే రోజు వరుసగా మూడు బంగారు పతకాలను కొల్లగొట్టిన భారత ఆర్చర్లు ఆసియా క్రీడల్లో నవశకానికి నాంది పలికారు. పట్టుదల, ఏకాగ్రత, క్రమశిక్షణ ఉంటే అసాధ్యమైనది ఏదీ లేదని నిరూపిస్తూ కోట్లాది మంది భారతీయుల గుండెల్లో దేశభక్తి ఉప్పొంగేలా చేసిన ఈ చారిత్రాత్మక విజయ పరంపర ప్రతీ భారతీయుడికి గర్వకారణం.

ఆసియా క్రీడల్లో భారత క్రీడాకారులు సరికొత్త చరిత్ర సృష్టించారు. ప్రత్యేకించి ఆర్చరీ విభాగంలో మన విలుకాళ్లు తిరుగులేని ఆధిపత్యాన్ని ప్రదర్శిస్తూ ఒకే రోజు ఏకంగా మూడు బంగారు పతకాలను కొల్లగొట్టారు. మహిళలు, మిక్స్‌డ్, పురుషుల కాంపౌండ్ టీమ్ విభాగాల్లో ఈ విజయాలు దక్కడంతో ఆర్చరీలో భారత్ ‘గోల్డెన్ హ్యాట్రిక్’ సాధించినట్లయింది. భారత్‌ పతకాల వేటకు ఈ విజయాలు కొండంత బలాన్నిచ్చాయి.

మహిళల టీమ్ బోణీ.. దక్షిణ కొరియా రికార్డు సమం

భారత స్వర్ణ పరంపర మహిళల కాంపౌండ్ టీమ్ ఈవెంట్‌తో అద్భుతంగా ప్రారంభమైంది. జ్యోతి సురేఖ, తెలుగు అమ్మాయి చికితా రావు, ప్రీతికా ప్రదీప్‌లతో కూడిన భారత త్రయం ఫైనల్లో చైనా జట్టుపై 238-234 తేడాతో ఘన విజయం సాధించింది. ఆరంభం నుంచే ఏమాత్రం గురి తప్పకుండా పాయింట్లు రాబట్టిన భారత మహిళలు.. 2014లో దక్షిణ కొరియా నెలకొల్పిన 238 పాయింట్ల ఆసియా రికార్డును సమం చేయడం విశేషం. ఈ విజయంలో విజయవాడకు చెందిన జ్యోతి సురేఖతో పాటు, తెలంగాణలోని పెద్దపల్లి జిల్లాకు చెందిన చికితా రావు కీలక పాత్ర పోషించారు.

ఉత్కంఠ పోరులో మిక్స్‌డ్ టీమ్ సత్తా

ఆ తర్వాత జరిగిన కాంపౌండ్ మిక్స్‌డ్ టీమ్ ఈవెంట్‌లోనూ భారత్ తమ విజేత హోదాను నిలబెట్టుకుంది. చికితా రావు, సాహిల్ రాజేశ్ జాదవ్ జంట దక్షిణ కొరియా బృందంతో తలపడింది. అత్యంత ఉత్కంఠగా సాగిన ఈ మ్యాచ్‌ లో ఇరు జట్లు సమాన పాయింట్లతో నిలవడంతో విజేతను తేల్చేందుకు ‘షూట్‌ఆఫ్’ నిర్వహించారు. ఒత్తిడిని సమర్థవంతంగా ఎదుర్కొన్న భారత జోడీ 158-157 తేడాతో కొరియాను చిత్తు చేసి రెండో స్వర్ణాన్ని దేశానికి అందించింది. ఈ విజయంతో తెలంగాణ క్రీడాకారిణి చికితా రావు ఒకే రోజు రెండు బంగారు పతకాలు సాధించిన ఘనతను సొంతం చేసుకుంది.

పురుషుల ఘన విజయం.. హ్యాట్రిక్ పూర్తి

మహిళలు, మిక్స్‌డ్ జట్ల స్ఫూర్తితో పురుషుల కాంపౌండ్ టీమ్ ఈవెంట్‌లో కుశాల్ దలాల్, సాహిల్ రాజేశ్ జాదవ్, గణేశ్ మణిరత్నం తిరుమూరులతో కూడిన భారత జట్టు బరిలోకి దిగింది. ఫైనల్లో చైనాతో తలపడిన భారత్.. ప్రారంభంలో కొంత వెనుకబడినప్పటికీ ఆ తర్వాతి రౌండ్లలో అద్భుతమైన పునరాగమనం చేసింది. చివరకు 238-237 తేడాతో చైనాను ఓడించి ముచ్చటగా మూడో స్వర్ణాన్ని ముద్దాడింది. దీంతో సాహిల్ జాదవ్‌కు కూడా ఇది రెండో స్వర్ణంగా నిలిచింది.

భారత్ ఖాతాలో 10వ స్వర్ణం.. మొత్తంగా 59 పతకాలు

ఆర్చరీలో సాధించిన మూడు స్వర్ణాలతో పాటు షూటింగ్‌లోనూ భారత్‌కు మరో స్వర్ణం లభించింది. మహిళల ట్రాప్ మిక్స్‌డ్ టీమ్ ఈవెంట్‌లో నీరూ ధండా, కైనన్ చెనాయ్ జోడీ పసిడి పతకాన్ని సాధించడంతో ఒకే రోజు భారత్ ఖాతాలో నాలుగు స్వర్ణాలు చేరాయి. దీనితో ఆసియా క్రీడలలో భారత్ బంగారు పతకాల సంఖ్య 10కి.. మొత్తం పతకాల సంఖ్య 59కి చేరింది.

మరోవైపు బాక్సింగ్‌లో ప్రియ ఘంఘాస్, కపిల్ పొఖరియాలు కాంస్య పతకాలతో ముగించగా.. స్టార్ బాక్సర్ లవ్లీనా బోర్గొహైన్ ఫైనల్‌కు చేరి రజతాన్ని ఖాయం చేసింది. స్క్వాష్‌ లోనూ పురుషుల, మహిళల జట్లు సెమీఫైనల్‌ కు చేరుకోవడంతో మరిన్ని పతకాలు ఖాయమయ్యాయి. డిఫెండింగ్ ఛాంపియన్‌గా బరిలోకి దిగి మళ్లీ ఆర్చరీలో తమ ఆధిక్యాన్ని నిరూపించుకున్న భారత క్రీడాకారులపై దేశవ్యాప్తంగా ప్రశంసల వర్షం కురుస్తోంది.