Begin typing your search above and press return to search.

డిజిటల్ విశ్వగురువు కాదు.. ‘డిలీట్’ గురువు.. యూట్యూబ్ రికార్డులో మనదే అగ్రస్థానం

యూట్యూబ్ వీడియోల తొలగింపులో భారత్ ప్రపంచంలోనే మొదటి స్థానంలో నిలిచింది. ఏప్రిల్-జూన్ 2026 మధ్య ప్రపంచవ్యాప్తంగా 1.1 కోట్ల వీడియోలను యూట్యూబ్ తొలగించగా, వాటిలో భారత్‌కు చెందినవే 34.4 లక్షలు. అమెరికాలో 12.4 లక్షలు, ఇండోనేషియాలో 9.2 లక్షల వీడియోలను తొలగించారు. ప్రపంచవ్యాప్తంగా తొలగించిన వీడియోల్లో 68.2 శాతం చిన్నారుల భద్రతకు సంబంధించిన నిబంధనలను ఉల్లంఘించినవే.

By:  A.N.Kumar   |   26 Nov 2026 11:08 PM IST
డిజిటల్ విశ్వగురువు కాదు.. ‘డిలీట్’ గురువు.. యూట్యూబ్ రికార్డులో మనదే అగ్రస్థానం
X

కష్టపడి వీడియో తీయడం పాత పద్ధతి.. నిబంధనలను గాలికొదిలేసి.. కంటెంట్‌ను డిలీట్ చేయించుకోవడంలో నంబర్ వన్ అవ్వడం కొత్త ట్రెండ్.. డిజిటల్ విప్లవంలో భారత్ దూసుకుపోతోందంటే ఇదేనేమో... చౌకైన డేటా.. చేతిలో స్మార్ట్‌ఫోన్ పుణ్యమా అని ప్రతి వీధిలో ఒక డైరెక్టర్.. ప్రతి ఇంట్లో ఒక కంటెంట్ క్రియేటర్ పుట్టుకొచ్చారు. వీడియోలు చూడటంలోనే కాదు.. యూట్యూబ్ కమ్యూనిటీ గైడ్‌లైన్స్ తోటలోకి చొరబడి.. వాటిని తుంగలో తొక్కడంలోనూ మనం ఎవరికీ తీసిపోమని తాజా గణాంకాలు ఘంటాపథంగా చెబుతున్నాయి.

ఏప్రిల్ నుంచి జూన్ వరకు యూట్యూబ్ ప్రపంచవ్యాప్తంగా ఏకంగా 1.1 కోట్ల వీడియోలను ఊడ్చిపారేసింది. ఇందులో మన దేశం వాటా 34.4 లక్షలు. అంటే ప్రపంచంలో డిలీట్ అయిన ప్రతి మూడు వీడియోల్లో దాదాపు ఒకటి మన మేడ్ ఇన్ ఇండియా కంటెంట్ అన్నమాట. ఎప్పుడూ ప్రతి విషయంలోనూ పోటీ పడే అమెరికా 12.4 లక్షలు మన ముందు తేలిపోయింది. ఇండోనేషియా 9.2 లక్షలు మూడో స్థానంతో సరిపెట్టుకుంది. గత త్రైమాసికంతో పోలిస్తే భారత్‌లో డిలీషన్ల రేటు 28 శాతం పెరిగిందంటే.. మన క్రియేటర్ల క్రియేటివిటీ ఏ స్థాయిలో ఉందో అర్థం చేసుకోవచ్చు.

సబ్‌స్క్రైబర్లు.. లైకులు.. వ్యూస్.. ఇవే ఇప్పుడు ఆధునిక ఆదాయ వనరులు. దీంతో కొందరు కంటెంట్ క్వాలిటీ అనే పదాన్ని డిక్షనరీ నుంచి ఎప్పుడో ఎత్తేశారు. నోటికి వచ్చిన టైటిళ్లు.. కళ్లు చెదిరే థంబ్‌నెయిల్స్ పెట్టి.. లోపల మాత్రం నిబంధనలకు విరుద్ధమైన దృశ్యాలు చూపిస్తూ వైరల్ కావాలని ఆరాటపడుతున్నారు. ఒక్కసారి గైడ్‌లైన్స్ దాటితే వీడియో పోవడమే కాదు.. ఛానెల్ కూడా లేచిపోతుందన్న కనీస జ్ఞానం లేకుండా వ్యూస్ కోసం పరుగులు తీస్తున్నారు.

ఈ గణాంకాల్లో అసలు విషాదం వేరే ఉంది. ప్రపంచవ్యాప్తంగా తొలగించిన వీడియోల్లో 68.2 శాతం చిన్నారుల భద్రతకు సంబంధించిన నిబంధనలను ఉల్లంఘించినవేనట.. పిల్లలను అనుచితంగా చూపించడం.. వారి భద్రతకు ముప్పు కలిగించే కంటెంట్‌ను అప్‌లోడ్ చేయడం వంటి చర్యలపై యూట్యూబ్ కఠినంగా వ్యవహరిస్తోంది. వ్యూస్ అనే మత్తులో పడి చిన్నారుల భవిష్యత్తుతో.. భద్రతతో ఆడుకోవడం ఎంతవరకు సమంజసం?

ఇంత జరుగుతున్నా బాధ్యత మాత్రం ఎవరికీ పట్టనట్టు ఉంది. క్రియేటర్లేమో వ్యూస్ కోసం నిబంధనలు మర్చిపోతున్నారు. యూట్యూబ్ అల్గారిథమ్‌లేమో తొలగించిన తర్వాత లెక్కలు చెబుతున్నాయి. ప్రేక్షకులేమో ఇలాంటి చెత్త కంటెంట్‌ను కూడా ఆదరిస్తూ ప్రోత్సహిస్తున్నారు. కంటెంట్ క్రియేషన్ అనేది ఒక కళ.. కానీ బాధ్యతాయుతంగా ఉండటం అంతకంటే పెద్ద బాధ్యత. లేదంటే డిజిటల్ ప్రపంచంలో మన విశ్వసనీయత డిలీట్ అయిపోవడం ఖాయం..