Begin typing your search above and press return to search.

వరల్డ్ బాక్సింగ్ కప్: ఫైనల్ స్వర్ణంతో అదరగొట్టిన నిఖత్

ఆమె సాధించిన విజయానికి తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత రెడ్డి సంతోషాన్ని వ్యక్తం చేశారు.ఆమెకు అభినందనలు తెలియజేశారు.

By:  Garuda Media   |   21 Nov 2025 9:27 AM IST
వరల్డ్ బాక్సింగ్ కప్: ఫైనల్ స్వర్ణంతో అదరగొట్టిన నిఖత్
X

గ్రేటర్ నొయిడా వేదికగా వరల్డ్ బాక్సింగ్ కప్ పోటీలు జరుగుతున్న సంగతి తెలిసిందే. ఫైనల్ వేళ హైదరాబాదీ బాక్సర్ నిఖత్ జరీన్ పవర్ పంచ్ లతో అదరగొట్టి స్వర్ణాన్ని సొంతం చేసుకుంది. 51 కేజీల విభాగంలో ఆమె చైనీస్ తైపీకి చెందిన గువాయి గ్జువాన్ ను 5-0తో మట్టికరిపించటం ద్వారా తిరిగి తన ఫామ్ లోకి వచ్చినట్లైంది.

పారిస్ ఒలింపిక్స్ లో రౌండ 16 ఓటమి తర్వాత కొద్దికాలంగా ఒడుదిడుకుల్ని ఎదుర్కొన్న ఆమె.. ఎట్టకేలకు తనను తాను సరికొత్తగా ఆవిష్కరించుకుందని చెప్పాలి. ఆమె సాధించిన విజయానికి తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత రెడ్డి సంతోషాన్ని వ్యక్తం చేశారు.ఆమెకు అభినందనలు తెలియజేశారు.

ఇదిలా ఉండగా ఈ టోర్నీలో మరో విశేషం ఉంది. భారత్ లో జరుగుతున్న ఇందులో వివిధ విభాగాలకు చెందిన మొత్తం 20 మంది బాక్సర్లు బరిలోకి దిగితే.. అందరికి ఏదో ఒక పతకాన్ని సొంతం చేసుకున్నారు. పదిమంది మహిళా క్రీడాకారిణులు.. పది మంది పురుష క్రీడాకారులు పాల్గొన్నారు. వీరిలో తొమ్మిది మంది స్వర్ణాల్ని సాధించగా.. ఆరు రజతాలు.. ఐదు కాంస్యాల్ని సొంతం చేసుకున్నారు. మహిళా క్రీడాకారిణుల్లో స్వర్ణాల్ని ఏడుగురు.. రజతం ఒకరు.. కాంస్యాలు ఇద్దరు గెలుచుకోగా.. పురుష క్రీడాకారుల్లో స్వర్ణాలు ఇద్దరు.. రజతాలు ఐదుగురు.. కాంస్యాలు ముగ్గురు సొంతం చేసుకున్నారు.

ప్రపంచకప్ బాక్సింగ్ టోర్నీలో భారత బాక్సర్లు ఇంతగా రాణించటానికి కారణం లేకపోలేదు. అగ్రశ్రేణి బాక్సర్లు చాలామంది ఈ ఈవెంట్ కు దూరంగా ఉన్నారు. దీంతో ఈ టోర్నీ కళ తప్పింది. బాక్సింగ్ కు పవర్ హౌస్ లుగా పేర్కొనే కజకిస్థాన్.. ఉజ్బెకిస్థాన్ లు తృతీయ శ్రేణి జట్లను బరిలోకి దించటంతో మనోళ్లకు పెద్దగా పోటీ ఎదురుుకాలేదు. ఫైనల్ వేళ స్వర్ణం సాధించిన నిఖత్ మళ్లీ ఒలింపిక్స్ రేసులోకి వచ్చినట్లైంది.

ఇక.. స్వర్ణాలు సాధించిన బాక్సర్ల విషయానికి వస్తే..

పేరు విభాగం (కేజీలు)

మీనాక్షి హుడా 48

నిఖత్ జరీన్ 51

ప్రీతి పవార్ 54

జాస్మిన్ లంబోరియా 57

పర్వీన్ 60

అరుంధతి చౌధరి 70

నూపుర్ షెరాన్ 80+

సచిన్ 60

హితేష్ 70