Begin typing your search above and press return to search.

ఆ బీర్ కంపెనీ కొంపముంచిన 'ప్రైవేట్' అనే పదం.. ఏం జరిగిందంటే..!

అవును... బిరా 91 బీర్ బ్రాండ్ మాతృ సంస్థకు చట్టపరమైన పేరులో స్వల్ప మార్పు కారణంగా ఊహించని స్థాయిలో సమస్యలను ఎదుర్కొంటుంది.

By:  Raja Ch   |   12 Oct 2025 11:10 AM IST
ఆ బీర్  కంపెనీ కొంపముంచిన ప్రైవేట్  అనే పదం.. ఏం జరిగిందంటే..!
X

ఓ వైపు భారతదేశానికి చెందిన విస్కీ, బీర్ బ్రాండ్లు ప్రపంచ వ్యాప్తంగా ఫుల్ ఫేమస్ అవుతున్న సంగతి తెలిసిందే. ఇందులో భాగంగా... ఇటీవల జరిగిన లాస్ వెగాస్ గ్లోబల్ స్పిరిట్స్ అవార్డ్స్‌ - 2025లో ప్రపంచ విస్కీ విభాగంలో ఐదు విస్కీలు ఫైనల్స్‌ కు చేరుకోగా.. ఈ ఐదు స్లాట్‌ లలో నాలుగు కైవసం చేసుకుని భారతీయ విస్కీలు ఆధిపత్యం చెలాయించిన సంగతి తెలిసిందే.

మరోవైపు ప్రపంచంలోని అతిపెద్ద, అత్యంత ప్రతిష్టాత్మకమైన బీర్ పోటీలలో ఒకటైన 'ఆసియా బీర్ ఛాలెంజ్' లో ఈ సంవత్సరం రెండు భారతీయ బ్రాండ్లు.. దేవన్స్ మోడరన్ బ్రూవరీస్ లిమిటెడ్, కిమాయా హిమాలయన్ బెవరేజెస్ ఎల్.ఎల్.పీ అత్యుత్తమ ప్రదర్శనకారులుగా నిలిచి, వివిధ విభాగాలలో ఆరు అవార్డులను గెలుచుకున్నాయి. అయితే మరో భారతీయ బ్రాండ్ మాత్రం కష్టాల్లో మునిగిపోయింది.

అవును... బిరా 91 బీర్ బ్రాండ్ మాతృ సంస్థకు చట్టపరమైన పేరులో స్వల్ప మార్పు కారణంగా ఊహించని స్థాయిలో సమస్యలను ఎదుర్కొంటుంది. జాతీయ మీడియాలో వస్తున్న కథనాల ప్రకారం... బిరా 91 బీర్ సంస్థ బి9 బెవరేజెస్‌ లోని 250 మందికి పైగా ఉద్యోగులు.. పాలనా సమస్యలు, జీతాల జాప్యం, చెల్లించని బిల్లులు వంటి కారణాలతో వ్యవస్థాపకుడు అంకుర్ జైన్‌ ను తొలగించాలని పిటిషన్ వేశారు!

ఎంతో ప్రాచుర్యం పొంది, సూపర్ సక్సెస్ తో దూసుకుపోతున్న ఈ సంస్థకు ఈ పరిస్థితి ఎందుకు వచ్చింది అనే విషయం ఇప్పుడు వైరల్ గా మారింది. వాస్తవానికి డిసెంబర్ 2022లో కంపెనీ తన చట్టపరమైన పేరును బీ9 బెవరేజెస్ ప్రైవేట్ లిమిటెడ్ నుండి బీ9 బెవరేజెస్ లిమిటెడ్‌ గా మార్చుకుంది. ఇలా సంస్థ పేరు నుంచి "ప్రైవేట్" అనే పదాన్ని తొలగించడంతోనే ఊహించని సమస్య మొదలైంది.

ఇందులో భాగంగా... పేరు మార్పు స్వల్పంగా కనిపించినప్పటికీ.. ఇది నెలల తరబడి అమ్మకాలను నిలిపివేసిందట. నివేదికల ప్రకారం... బీ9 బెవరేజెస్ కొత్త ఉత్పత్తి లేబుల్‌ లను నమోదు చేస్తున్నప్పుడు సుమారు రూ.80 కోట్ల ఇన్వెంటరీని రద్దు చేయాల్సి వచ్చిందట. దీంతో అగ్రిమెంట్స్ ఆలస్యం కారణంగా 2023-24 ఆర్థిక సంవత్సరానికి అమ్మకాలు 22% తగ్గిన పరిస్థితి.

ఫలితంగా... నష్టాలు 68% పెరిగి, కంపెనీ రూ.748 కోట్ల నికర నష్టాన్ని నివేదించింది. ఇది దాని మొత్తం ఆదాయం రూ.638 కోట్లను అధిగమించడం గమనార్హం.

స్పందించిన అంకుర్ జైన్‌!:

ఇలా తనపై ఉద్యోగుల వేసిన పిటిషన్ పై జైన్ స్పందించారు. ఇందులో భాగంగా.. పిటిషనర్లు లేదా వాటాదారుల నుండి కంపెనీకి ఎటువంటి అధికారిక సమాచారం అందలేదని అన్నారు. గడువు ముగిసిన ఉద్యోగుల చెల్లింపులను కూడా ఆయన అంగీకరించారు. ఇదే సమయంలో పన్ను బకాయిల చెల్లింపులలో కూడా జాప్యం ఉంటుందని ఆయన అన్నారు.

ఇదే సమయంలో... పేరు మార్పు, మద్యం విధాన మార్పులు, నిధుల సేకరణలో జాప్యం కారణంగా.. గత 18 నెలలు చాలా సవాలుతో కూడుకున్నవని జైన్ అభివర్ణించారు. ఏది ఏమైనా... కార్యకలాపాలను పునర్నిర్మించడం, ఎంపిక చేసిన రాష్ట్రాలపై దృష్టి పెట్టడంతో పాటు మార్జిన్‌ లను మెరుగుపరచడం ద్వారా కంపెనీ ఈ సమస్యలను తగ్గించడానికి ప్రయత్నించిందని చెప్పుకొచ్చారు.